- ఆయిల్ పామ్ లక్ష్యం పదింతలు అధికం
- ఆ ప్రకారం నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం
- అందుకోసం ఏకంగా రూ. 247 కోట్లు ఖర్చు
- ఈ ఏడాది 90,975 టన్నుల గెలల అంచనా
- కానీ రైతుల నుంచి వచ్చింది 9 వేల లోపే…
- వచ్చే ఏడాదికి 1,87,885 టన్నుల అంచనా
- ఆయిల్ ఫెడ్ ను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టారు
సహనం వందే, హైదరాబాద్:
సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి.


అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం. ఆ బోర్డు మీటింగ్ లో సాగు లక్ష్యం… ఉత్పత్తి… అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి విషయాలపై వాస్తవాలకు అందనంత దూరంలో లెక్కలు చెప్పారు. తద్వారా నర్మెట్టలో ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ. 247 కోట్లు (జీఎస్టీ కాకుండా) అవసరమని నిర్ధారించి బోర్డు ఆమోదం తీసుకున్నారు. కాగితాలపై ఊహాజనితమైన లెక్కలు వేసి 30 మెట్రిక్ టన్నుల నుంచి 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీ అవసరమని తేల్చారు.
నర్మెట్ట పరిధిలోకి ఆరు జిల్లాలు…
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలనేది లక్ష్యం. రాబోయే రోజుల్లో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగు పెంచాలనేది ఉద్దేశం. దీన్ని అవకాశంగా తీసుకొని ఆయిల్ ఫెడ్ ద్వారా ఎలాగైనా పెద్ద ఎత్తున ఆర్జించేందుకు వ్యూహాలు పన్నారు. అందులో భాగంగా ఈ కార్పొరేషన్ ద్వారా సాగు లక్ష్యాన్ని… ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని ఎక్కువ చూపి అందినకాడికి దోచుకోవాలనే ప్రయత్నం ఉన్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీ పరిధిలోకి సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, గద్వాల్, నారాయణపేట జిల్లాలను తీసుకొచ్చారు.
బోర్డు నివేదికలో కళ్ళు బైర్లు కమ్మే లెక్కలు…
బోర్డు నివేదికల ప్రకారం ఆయిల్ ఫెడ్ అధికారులు వేసిన లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. బోర్డు నివేదికలో ఏముందంటే…
- సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, గద్వాల్, నారాయణపేట నుండి ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ రాకపోకలను దృష్టిలో ఉంచుకుని… నర్మెట్టలో 30 టన్నుల సామర్థ్యంతో 120 టన్నుల వరకు విస్తరించగల ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి.
- 2025-26 నాటికి నర్మెట్ట ఫ్యాక్టరీకి 90,975 మెట్రిక్ టన్నుల ఎఫ్ఎఫ్ బీ వస్తుందని అంచనా. దీనికి 32 టీపీహెచ్ సామర్థ్యం అవసరం. ఫ్యాక్టరీ 2025 ఏప్రిల్ నుండి కార్యకలాపాలు ప్రారంభించనుంది.
- 2026-27 నాటికి ఎఫ్ఎఫ్ బీ 1,87,885 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుంది. అందుకోసం ఫ్యాక్టరీ సామర్థ్యం 65 టీపీహెచ్ అవసరం. ఈ దశలో ఫ్యాక్టరీ సామర్థ్యం 30 నుండి 60 టీపీహెచ్ కి విస్తరిస్తాం.
- 2027-28 నాటికి ఎఫ్ఎఫ్ బీ 2,18,937 మెట్రిక్ టన్నులకు చేరుతుంది. దీనికి 75 టీపీహెచ్ సామర్థ్యం గల ఫ్యాక్టరీ అవసరం. ఆ ప్రకారం విస్తరిస్తాం.
- 2029-30 నాటికి ఎఫ్ఎఫ్ బీ 2,75,704 మెట్రిక్ టన్నులకు చేరుతుంది. దీంతో ఫ్యాక్టరీ సామర్థ్యం 95 టీపీహెచ్ అవసరపడుతుంది.
- చివరగా 2030-31 నాటికి 3,47,704 మెట్రిక్ టన్నుల ఎఫ్ఎఫ్ బీ వస్తుందని అంచనా. దాన్ని సమర్ధవంతంగా ప్రాసెస్ చేయడానికి 120 టీపీహెచ్ సామర్థ్యం గల ఫ్యాక్టరీ కావాలి. ఆ మేరకు దాన్ని విస్తరిస్తాం.
బోర్డు మీటింగు నివేదికలో నర్మెట్టకు వచ్చే ఆయిల్ పామ్ గెలలకు సంబంధించిన టేబుల్ ఇది:

తెరపైకి బీచుపల్లి, తొర్రూరు ఫ్యాక్టరీలు…
ఆరు జిల్లాలకు కలిపి నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే సరిపోతుందని పేర్కొంటూనే… అందుకు భిన్నంగా ప్రాంతీయ అవసరాల మేరకు కొత్త ఫ్యాక్టరీలు ఇవే జిల్లాల పరిధిలో పెట్టాలని ప్రకటించడం అనుమానాలకు తావిచ్చింది. ‘భవిష్యత్తులో కొత్త ఫ్యాక్టరీల అవసరాన్ని కూడా గుర్తించినట్లు’ ఆయిల్ ఫెడ్ పేర్కొంది. దాని ప్రకారం గద్వాల్, నారాయణపేట జిల్లాల కోసం బీచుపల్లిలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల కోసం 2027-28 నాటికి మహబూబాబాద్‌లో ప్రత్యేక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని పేర్కొనడం గమనార్హం. ‘ఈ వ్యూహాత్మక నిర్ణయాలు ఎఫ్ఎఫ్ బీ రవాణా ఖర్చులను తగ్గించి, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచి, రైతులకు మరింత చేరువగా మారుతాయ’ని సంస్థ స్పష్టం చేసింది. అందుకోసం వెంటనే రంగంలోకి కూడా దిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భూమి పూజ కూడా చేశారు. బీచుపల్లి, తొర్రూరులలో ఫ్యాక్టరీలను నిర్మించాలని అనుకున్నప్పుడు… వాటి పరిధి జిల్లాలను కూడా కలుపుకొని నర్మెట్ట ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి? అక్కడ దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో ఆంతర్యం ఏంటి? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
90 వేల మెట్రిక్ టన్నులకు… 9 వేల లోపే!
బోర్డు మీటింగ్ లో చెప్పిన నిర్ణయాలు అన్నీ తలకిందులు అయినట్టు ఆచరణ చూపిస్తుంది. ఈ ఆరు జిల్లాల పరిధిలో గత మార్చి నాటికి 1016 ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ గెలలు అందుబాటులోకి వచ్చాయని ఉద్యాన శాఖ నివేదికలో స్పష్టంగా ఉంది. అంటే ఎకరానికి ఎంత ఫ్రూట్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. 90 వేల మెట్రిక్ టన్నులు ఎక్కడ? 9 వేలు కూడా రాని పరిస్థితి ఎక్కడ? ఇదంతా ఎవరికోసం? రైతుల కోసమా? ఆనాటి పెద్దల కోసమా? అప్పుడూ ఇప్పుడున్న కొందరు అధికారుల జేబులు నింపేందుకోసమా? అనే ప్రశ్నలను ఆ సంస్థ ఉద్యోగులే సంధిస్తున్నారు. ఈ అక్రమాల నేపథ్యంలో కీలకమైన అధికారులు కొందరు కోట్లకు పడగలెత్తినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఒక ముఖ్య అధికారి కీలక ప్రజా ప్రతినిధి వద్ద పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో తప్పులు చేసి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధి వద్ద ఆశ్రయం పొందుతూ తలదాచుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.