‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

  • అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా?
  • బెంగళూరు ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
  • చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో 11 మంది మృతి

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు.

అభిమానుల ఆవేశం…
ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్ తేడాతో సాధించిన సంతోషంలో బెంగళూరు నగరం మునిగిపోయింది. విజయోత్సవాల కోసం కర్ణాటక ప్రభుత్వం విధాన సౌధ వద్ద ఆర్సీబీ జట్టును సన్మానించి, చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే 35,000 సామర్థ్యం ఉన్న స్టేడియంలో 2-3 లక్షల మంది అభిమానులు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. స్టేడియం గేట్ నంబర్ 3 వద్ద అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక తాత్కాలిక స్లాబ్ కూలిపోవడం ఈ ఘటనను మరింత తీవ్రతరం చేసిందని అధికారులు తెలిపారు.

ప్రమాదాల చరిత్ర… పాలకుల నిర్లక్ష్యం!
ఇది కేవలం ఒక్క చిన్నస్వామి స్టేడియం ఘటన మాత్రమే కాదు. దేశంలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఇలాంటి తొక్కిసలాటలు, మరణాలు సర్వసాధారణం అయ్యాయి. గతంలో కుంభమేళాలో వందలాది మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో బాబాలు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ అనేకమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంగా పదుల సంఖ్యలో చనిపోయారు. ఈ ఘటనలన్నీ జరిగినప్పుడు గుణపాఠాలు నేర్చుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

ముఖ్యమంత్రికి అహంభావమా?
‘ఇంతమంది జనం వస్తారని తాము ఊహించలేద’ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించడం విడ్డూరం. ఇటువంటి పెద్ద ఈవెంట్లకు, అందునా బెంగళూరు వంటి మెట్రో నగరంలో ప్రజల ఉత్సాహం అధికంగా ఉన్నప్పుడు ఇంతమంది వస్తారని ఎందుకు ఊహించలేకపోయారు? గతంలో జరిగిన తొక్కిసలాటల అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? పాలకుల అలసత్వం, అతి విశ్వాసమే నిండు ప్రాణాలను బలిగొంటోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *