ఆయిల్ ఫెడ్ అక్రమాలపై రైతుల ఆగ్రహం

  • జన్యులోపంతో మొక్కల సరఫరా… రైతులు నష్టాలు
  • చర్యలకు అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ సమాఖ్య డిమాండ్

ఆయిల్ ఫెడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ గళమెత్తింది. సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ శక్తులు, కొందరు అధికారులు ఆయిల్ ఫెడ్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం తమ సమాఖ్య చేసిన సూచనలను ప్రభుత్వానికి, ఆయిల్ ఫెడ్‌కు సమర్పించారు.

జన్యుపరంగా లోపమున్న మొక్కల సరఫరా…
తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతులకు సరఫరా చేస్తున్న ఆయిల్ పామ్ మొక్కల నాణ్యతపై గ్రోయర్స్ సొసైటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయిల్ ఫెడ్ కింద ఉన్న చాలా నర్సరీలను అర్హత లేని (నాన్ టెక్నికల్) అధికారులు నిర్వహిస్తున్నారని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (ఐఐఓపీఆర్) నిబంధనలను పాటించడం లేదని సొసైటీ పేర్కొంది. ఇది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈఓ) మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపింది.

విత్తనాలు దిగుమతి చేసుకున్నప్పుడు ఎగ్జిమ్ కమిటీ ఆదేశాల ప్రకారం, ప్రతి బ్యాచ్ నుండి పది మొలకెత్తిన మొక్కలను క్వారంటైన్ లేదా జన్యు పరీక్షల కోసం ఐఐఓపీఆర్ కు పంపడం తప్పనిసరి. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఆయిల్ ఫెడ్ ఒక్క బ్యాచ్‌ను కూడా పంపలేదని సొసైటీ నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, పుల్లయ్య ఆరోపించారు. నర్సరీలలో ఎటువంటి నిబంధనలను పాటించటం లేదని, 25 శాతం కంటే ఎక్కువగా కర్లింగ్ మొక్కలు (జన్యు లోపం) ఉంటే, పూర్తి బ్యాచ్‌ను నాశనం చేయాలని నిబంధనలు చెబుతున్నా, ఆయిల్ ఫెడ్ నర్సరీలు జన్యులోపం ఉన్న మొక్కలను కూడా రైతులకు విక్రయిస్తున్నాయని సొసైటీ ధ్వజమెత్తింది. సత్తుపల్లి మండలంలోని రేగళ్లపాడు నర్సరీలో ఆయిల్ ఫెడ్, యాగంబి, టెంబా రకాలకు చెందిన మూడు లక్షల కర్లింగ్ మొక్కలు ఉన్నట్లు తేలిందని, వీటిని రైతులకు పంపిణీ చేయకూడదని డిమాండ్ చేసింది. రైతు సంఘాల నిరసనల తర్వాత కూడా ఆయిల్ ఫెడ్ మూడేళ్ల వయస్సున్న మొలకలను కూడా రైతులకు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తోందని సొసైటీ నాయకులు మండిపడ్డారు.

నర్సరీలలో అక్రమాలు… ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ నర్సరీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరిగ్గా నిర్వహించడం లేదని, నిబంధనలను పాటించడం లేదని ఉమామహేశ్వర్ రెడ్డి, పుల్లయ్య వెల్లడించారు. ఎన్ఎంఈఓ- ఓపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 15 ఎకరాల్లో ఒక లక్ష మొక్కలను పెంచడానికి 40 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తుండగా, ఆయిల్ ఫెడ్ కేవలం 15 ఎకరాల్లో ఐదు నుండి ఎనిమిది లక్షల మొక్కలను పెంచుతోందని పేర్కొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, కొంతమంది ఆయిల్ ఫెడ్ ఉద్యోగులు దిగుమతి చేసుకున్న మొలకలను ఇతర రాష్ట్రాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయని సొసైటీ పేర్కొంది. నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ కాంట్రాక్టర్లు రైతుల తోటల నుండి స్థానిక విత్తనాలను సేకరించి, వాటితో నర్సరీలను పెంచుతున్నారని తెలిపింది.

నష్టపరిహారంపై ఆయిల్ ఫెడ్ ఉదాసీనత…
రైతుల తోటలలో ఆఫ్-టైప్ మొక్కల సమస్య తీవ్రంగా ఉందని సొసైటీ గుర్తించింది. కొన్ని మొక్కలు సంవత్సరంలో కేవలం రెండు ఆడ గుత్తులను మాత్రమే ఇస్తాయని, మిగిలినవి అన్నీ మగ గుత్తులను ఇస్తున్నాయని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సొసైటీ పేర్కొంది. దాదాపు 10 వేల ఎకరాలు ఈ సమస్యతో ప్రభావితమయ్యాయని అంచనా వేసింది. ఆయిల్ ఫెడ్ చైర్మన్ స్వయంగా ఆఫ్-టైప్ మొక్కలు రైతుల తోటల్లోకి వచ్చిన మాట నిజమే అని అంగీకరించినా, నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పడం రైతులను విస్మయానికి గురిచేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని పునఃపరిశీలించి బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

చట్ట సవరణకు డిమాండ్…
కర్లింగ్ మొక్కలు ఉన్న రైతులను ఆయిల్ ఫెడ్ వాటిని పీకి కొత్త మొక్కలు వేసుకోమని సూచిస్తోంది. అయితే ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల వయస్సున్న తోటలో కొన్ని మొక్కలను పీకి కొత్తవి వేస్తే అవి నీడలో పెరిగే అవకాశం లేదని, మొత్తం తోటను పీకి కొత్త మొక్కలు వేయాలన్నా ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ వద్ద ఉన్న మొక్కలు మంచివేనా అని సొసైటీ ప్రశ్నించింది. 28 నుండి 30 నెలల వయస్సు ఉన్న మొక్కలను అసలు నాటవచ్చా అని సందేహం వ్యక్తం చేసింది. ఒకవేళ మళ్ళీ కర్లింగ్ మొక్కలు వస్తే మూడు సంవత్సరాల తరువాత రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఆయిల్ ఫెడ్ చైర్మన్ నష్టపరిహారం ఇవ్వలేమని చెబుతున్నందున, ప్రభుత్వం నుండి స్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకునేంత వరకు కొత్త మొక్కలు వేయకుండా వేచి చూడాలని బాధిత రైతులకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తోటల్లో ఆఫ్-టైప్ మొక్కలు వస్తే కంపెనీల నుండి పూర్తి నష్టపరిహారం దగ్గరుండి ఇప్పిస్తానని ప్రకటించారు. కానీ ఆయిల్ ఫెడ్ ఎండీ, చైర్మన్ మాత్రం అందుకు అవకాశం లేదని చెబుతున్నారు. కాబట్టి వ్యవసాయ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఆయిల్ పామ్ యాక్ట్ లో నష్టపరిహారం ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని ఉమామహేశ్వర్ రెడ్డి, పుల్లయ్య డిమాండ్ చేశారు.

ఆయిల్ ఫెడ్ ప్రక్షాళనకు డిమాండ్…
కర్లింగ్ మొక్కలు రైతుల తోటల్లోకి రావడానికి కారణమైన 2016-2022 సంవత్సరాల మధ్య పనిచేసిన కాంట్రాక్టర్లు, అధికారులపై విచారణ జరిపి బాధ్యులను తొలగించి నష్టాన్ని వారి నుండి రికవరీ చేయాలని సొసైటీ కోరింది. ఇకపై అన్ని నర్సరీలు కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించి గతంలో లాగానే ఆయిల్ ఫెడ్ స్వయంగా నర్సరీని పెంచాలని విజ్ఞప్తి చేసింది. నర్సరీలో అవకతవకలపై గతంలో ఒక ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ 40 లక్షల రూపాయల రికవరీకి ఆదేశించినప్పటికీ దాన్ని పక్కన పెట్టి అదే ఉద్యోగిని ఆయిల్ ఫెడ్ లో కీలక పోస్టులో కొనసాగించటంపై వారు మండిపడ్డారు. ఆయిల్ ఫెడ్ విదేశీ సీడ్ దిగుమతిలో కొంత మంది మధ్యవర్తులు కీలక పాత్ర పోషించి థర్డ్ క్వాలిటీ సీడ్‌ను ఇంపోర్ట్ చేయడం మీద కూడా విచారణ జరిపి వ్యవస్థను ప్రక్షాళన చేయవలసినదిగా కోరింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *