‘గడల’పై ఏసీబీ ఉచ్చు?

  • ప్రజాధనం దుర్వినియోగంపై ఆరా
  • పలువురి వద్ద సమాచార సేకరణ
  • డాక్టర్ శ్రీనివాసరావు కోట్ల సామ్రాజ్యంపై నిఘా

తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా విపత్కర సమయంలో, అంతకుముందు కాలంలో ఆయన కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక ఫిర్యాదులతో పాటు ఇటీవల కొందరు ఉద్యోగులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ తన విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ అక్రమాల నుంచి తప్పించుకునేందుకు డాక్టర్ శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు సమాచారం.

కరోనా నిధుల దోపిడీ వెలుగులోకి…
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో డాక్టర్ శ్రీనివాసరావు ప్రజారోగ్య సంచాలకుడిగా ఉంటూ కోవిడ్ నిధులను దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక నియమాలను పాటించకుండా అనవసరమైన వస్తువులను కొన్నారని, ప్రభుత్వ అనుమతి లేకుండా సైబరాబాద్‌లోని కొన్ని బహుళజాతి సంస్థల కార్మికులకు మొబైల్ ద్వారా టీకాలు వేయించి, ఆ సంస్థల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. అంతేకాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి ఆత్మీయ సమ్మేళనం పేరుతో 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రింటింగ్ నిధుల కుంభకోణం…
2015-16, 2016-17, 2017-18 సంవత్సరాల్లో డాక్టర్ శ్రీనివాసరావు ప్రజారోగ్య విభాగంలో చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా ఉంటూ ప్రింటింగ్, సమాచార, విద్యా, ప్రసార కార్యక్రమాల కోసం కేటాయించిన రూ. 20.46 లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముద్రణ విలువ 5 లక్షల రూపాయలకు మించినప్పటికీ, టెండర్లు పిలవకుండా నామినేషన్ ప్రాతిపదికన స్థానిక ముద్రణా సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. సాధారణ ధరల కంటే 200-300 శాతం అధికంగా ముద్రణ ఖర్చులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకరి ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపి, 2019 ఫిబ్రవరి 2న ఇచ్చిన నివేదిక ద్వారా ఆరోపణలను నిర్ధారించింది. అయినప్పటికీ ఆయన అప్పటి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ సహకారంతో ప్రభుత్వానికి ఆర్థిక నష్టం లేదని పేర్కొంటూ ఒక లేఖ పొంది, చర్యల నుంచి తప్పించుకున్నారన్న ఫిర్యాదులు అందాయి.

పోస్టులేకున్నా గడలకే ఇచ్చారు…

డీహెచ్ పోస్టు లేనప్పటికీ డాక్టర్ శ్రీనివాసరావు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగారు. అన్ని హెచ్ఓడీ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, తెలంగాణలో ఈ పోస్టుల సృష్టికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హెచ్ఓడీ పోస్టుల మంజూరుకు సంబంధించిన దస్త్రం రెండేళ్లకు పైగా అప్పటి మంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. అప్పటి మంత్రి డాక్టర్ శ్రీనివాసరావుకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉప సంచాలకుల అవినీతిపై నిర్లక్ష్యం…
ఇద్దరు ఉప సంచాలకుల (అడ్మిన్) అవినీతి కార్యకలాపాలకు సంబంధించి ఆడియో ఆధారాలు ఉన్నప్పటికీ డాక్టర్ శ్రీనివాసరావు వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది ఆయన నిర్లక్ష్యాన్ని, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాన్ని సూచిస్తుంది. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి డిప్యుటేషన్లు/వర్క్ ఆర్డర్లు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు పారదర్శకత లేని పరిపాలనను, స్వార్థ ప్రయోజనాలకు నిదర్శనాలుగా ఆరోపణలు వచ్చాయి.

విజిలెన్స్ నివేదికల తాఖీదు…
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక (2019 ఫిబ్రవరి 2) డాక్టర్ శ్రీనివాసరావు అవినీతి ఆరోపణలను నిర్ధారించినప్పటికీ, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నివేదిక ఆధారంగా విచారణ జరపకుండా చర్యలు తీసుకోకుండా నిలిపివేశారు. ఈ నిర్ణయం ఆయనను రక్షించే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యం ప్రజారోగ్య విభాగంలో అవినీతిని ప్రోత్సహించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటన్నిటిపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చా:
ఎస్.కె. ప్రసన్న, అధ్యక్షురాలు, తెలంగాణ మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈఎస్ఐ (ఐఎంఎస్) మహిళా ఉద్యోగుల కేంద్ర సంఘం:

ఏసీబీ దృష్టి సారించినట్లు నాకు కూడా సమాచారం ఉంది. విజిలెన్స్ కు, ఏసీబీకి అవసరమైన సమాచారాన్ని కూడా నేను అందజేశాను. గడల శ్రీనివాసరావు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. ఆయా ఆధారాలను ప్రభుత్వానికి, విచారణ సంస్థలకు అందజేశాను. ఆయన అక్రమాలను బట్టబయలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరాను.

అంతేకాకుండా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా కలిసి జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను గడల ఏ విధంగా తనకు మళ్ళించుకున్నాడో వివరాలతో సహా అందజేశాను. నేను ఇచ్చిన వివరాలు మొత్తం అధికారికంగా ఉన్న సమాచారమే. ఆయనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని, అక్రమాలకు పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

——————————————————————————————————————–

కరోనా సమయంలో అక్రమ దందాలకు పాల్పడిన అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి కొన్నింటిపై చర్య తీసుకున్నారు. మరికొన్ని ఆసుపత్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు.

రేపు ప్రత్యేక కథనం…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *