- ఎస్బీఐలో ఉద్యోగి, కస్టమర్ మధ్య వాగ్వాదం
- ఆ రాష్ట్రంలో కన్నడ, హిందీ భాషా వివాదం
- హిందీనే మాట్లాడుతానని ఉద్యోగి వీరంగం!
- సీఎం దృష్టికి వెళ్లడంతో ఉద్యోగిపై బదిలీ వేటు
సహనం వందే, కర్ణాటక:
కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు.
కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదం
సూర్య నగర బ్రాంచ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వేగంగా వ్యాపించింది. వీడియోలో కస్టమర్, ‘ఇది కర్ణాటక మేడమ్ అని చెప్పగా, అధికారిణి ఇది ఇండియా అని’ బదులిచ్చారు. కస్టమర్ కన్నడలో మాట్లాడాలని కోరినప్పుడు, ఆమె ‘నీ కోసం కన్నడ మాట్లాడను… నేను హిందీ మాట్లాడతాన’ని స్పష్టంగా చెప్పారు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ‘నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు కన్నడిగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
సోషల్ మీడియాలో నిరసన జ్వాలలు…
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఆ అధికారిణిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక యూజర్ ఆమె కన్నడ భాషను అవమానించారని, ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపించారు.
తప్పని క్షమాపణ… నాటకీయ మలుపు
పరిస్థితి తీవ్రమవడంతో ఆ అధికారిణి తోటి సహోద్యోగి సాయంతో కన్నడలో క్షమాపణ వీడియో విడుదల చేశారు. ‘నేను ఎవరి మనసు నైనా నొప్పించి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఇకపై కన్నడలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను’ అని ఆమె చెప్పారు. అయితే ఈ క్షమాపణ ఆలస్యంగా వచ్చిందని, కేవలం ఒత్తిడి వల్లే ఇచ్చారని పలువురు విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండన…
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో సూర్యనగర ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ కన్నడ, ఇంగ్లీష్ మాట్లాడటానికి నిరాకరించి, పౌరులను అవమానించిన వైఖరి గర్హనీయం అని రాశారు. ఎస్‌బీఐ ఆ అధికారిణిని బదిలీ చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక భాషను గౌరవించడం అంటే ప్రజలను గౌరవించడమే అని ఆయన స్పష్టం చేశారు.