- సీఐఏ జోస్యం.. భారత్-పాక్ యుద్ధం తప్పదు
- బయటపడ్డ 30 ఏళ్ళ సీక్రెట్ డాక్యుమెంట్స్
- అణు యుద్ధం ముంగిట పొరుగుదేశం
- యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?
- రెండు దేశాలకూ అణ్వాయుధ సామర్థ్యం
సహనం వందే, హైదరాబాద్:
1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి 30 ఏళ్ల క్రితం సీఐఏ ఊహించిన భయానకమైన పరిస్థితి నిజమయ్యే పరిస్థితులు ఉన్నాయా?
సీఐఏ జోస్యం… తప్పటడుగు పడితే విలయం!
1980, 90 దశకాల్లో సీఐఏ రూపొందించిన ఈ డాక్యుమెంట్స్ ప్రకారం… భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ… చిన్న పొరపాటు జరిగినా లేదా ఎవరైనా అతిగా స్పందించినా అది సాంప్రదాయ యుద్ధాన్ని అణ్వాయుధ యుద్ధంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒక పెద్ద ఉగ్రదాడి లేదా సరిహద్దుల్లో తీవ్రమైన ఘర్షణలు యుద్ధానికి దారితీయవచ్చని… ఇది పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా… ఆ దేశ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని ఆనాడే సీఐఏ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత ఈ రిపోర్ట్స్ బయటకు రావటం పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న లష్కర్-ఏ-తొయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్ జరిపిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను బహిష్కరించడం వంటి కఠిన చర్యలు తీసుకుంది. ఈ చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
అణ్వాయుధ భయం ఇంకా ఉందా?
ఈ సీఐఏ డాక్యుమెంట్స్ విడుదల కావడంతో సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. “భారత్‌తో యుద్ధం పాకిస్తాన్ సైన్యాన్ని లేదా దేశాన్ని కూడా నాశనం చేస్తుందని సీఐఏ 1993లోనే చెప్పింది” అంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ డాక్యుమెంట్స్‌ను పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ యొక్క బలమైన స్థానానికి నిదర్శనంగా చూపిస్తున్నారు. అయితే అణ్వాయుధాలు కలిగి ఉండటం వల్ల ఇరు దేశాలు సంయమనం పాటిస్తాయా? ఒకవేళ యుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే భయం అందరిలోనూ నెలకొంది. రెండు దేశాలూ అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల… ఏ చిన్న ఘర్షణ జరిగినా అది ఊహించని వినాశనానికి దారితీస్తుందనే భయం ఇరు దేశాల నాయకులను వెనక్కి లాగుతుంది. అయితే సీఐఏ హెచ్చరించినట్లుగా… చిన్న పొరపాటు లేదా భావోద్వేగపూరిత నిర్ణయాలు ఈ నిరోధక శక్తిని బలహీనపరిచే ప్రమాదం లేకపోలేదు