- మానసరోవర్ యాత్రీకులకు శుభవార్త
- నాలుగేళ్ల తర్వాత ఈసారి పునఃప్రారంభం
సహనం వందే, హైదరాబాద్:
కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020 నుంచి నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
త్వరలో కైలాష్ కు ప్రయాణం!

హిందూ, బౌద్ధ, జైన మతాల వారికి ఎంతో పవిత్రమైన కైలాష్ పర్వతం, మానస సరోవర్ సరస్సులను దర్శించుకునే అవకాశం మళ్లీ రానుంది. ఈ ఏడాది యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా కైలాష్ యాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునఃప్రారంభం కాలేదు. అయితే, ఇటీవల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతుండటంతో యాత్రకు మళ్లీ మార్గం సుగమమైంది.
భారత్-చైనా చర్చలు సఫలం!
ఈ ఏడాది జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి బీజింగ్‌లో పర్యటించిన సందర్భంగా కైలాష్ యాత్ర పునఃప్రారంభంపై చర్చలు జరిగాయి. 2025 వేసవిలో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర హిందువులు, బౌద్ధులు, జైనులకు అత్యంత పవిత్రమైనది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథు లా పాస్ ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది. 2019లో రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
ఖర్చు ఎంత?
యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు కుమావు మండల్ వికాస్ నిగమ్ ఏర్పాట్లు చేస్తోంది. లిపులేఖ్ పాస్ ద్వారా ఒక్కో యాత్రికుడికి సుమారు రూ. 1.80 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఏడాది దాదాపు 2,000 మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్, షెడ్యూల్, ఇతర వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. భక్తులు తాజా సమాచారం కోసం www.mea.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని విదేశాంగ శాఖ సూచించింది.