వీళ్లు విజిలేస్తే వెయ్యి ముక్కలే – ప్రపంచాన్ని మార్చేసిన రహస్య వీరులు

Whistle Blowers
  • ప్రభుత్వాల గుండెల్లో విజిల్ బ్లోయర్లు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన హీరోలు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో పన్నులు కట్టేది మనం, ఓట్లేసి నాయకులను గెలిపించేది మనం. కానీ అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే మూగప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతున్నాం. ప్రజలకు ప్రభుత్వాలంటే భయం పోయి, బాధ్యతగా నడుచుకునే పరిస్థితి రావాలి. ఒక సంస్థలో లేదా ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలు, అన్యాయాలను గమనించి ధైర్యంగా సమాజానికి తెలియజేసే వ్యక్తులనే విజిల్ బ్లోయర్లు అంటారు. వీళ్లకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండదు; వీరి ఏకైక లక్ష్యం దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం మాత్రమే.

ప్రపంచాన్ని ఊపేసిన సంచలనాలు
ప్రపంచ చరిత్రలో విజిల్ బ్లోయర్లు చేసిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అమెరికా గుఢాచార సంస్థ పౌరుల కాల్స్, మెసేజ్‌లపై రహస్యంగా నిఘా పెడుతోందని ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ నిలదీయగా, వ్యక్తిగత గోప్యత ప్రాధాన్యత వెలుగులోకి వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేసే బడా నాయకులు, వ్యాపారవేత్తల నల్లధనాన్ని రట్టు చేసిన పనామా పేపర్స్ లీక్ వెనుక కూడా ఒక విజిల్ బ్లోయరే ఉన్నాడు. దీనివల్ల అనేక దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎంతోమంది నేతలు విచారణను ఎదుర్కొన్నారు.

భారతదేశంలో వీరుల త్యాగాలు
మన భారతదేశంలో సత్యేంద్ర దూబే జాతీయ రహదారుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టగా, ఐఓసీఎల్ అధికారి మంజునాథ్ కల్తీ పెట్రోల్ దందాను నిలదీశారు. వీరు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుళ్ళిపోయిన వ్యవస్థను సమాజం ముందుకు తీసుకువచ్చారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో విజిల్ బ్లోయర్ పంపిన ఈమెయిల్ వల్లనే భారీ అకౌంటింగ్ మోసం వెలుగులోకి వచ్చి, కార్పొరేట్ కంపెనీలపై కఠిన నిబంధనలు వచ్చాయి. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య నియామకాలు, ఉద్యోగాల భర్తీలో జరిగిన వ్యాపం కుంభకోణాన్ని బయటపెట్టడం ద్వారా నియామకాల్లో పారదర్శకత పెరిగింది.

ఆర్టీఐ చట్టం ద్వారా సాధికారత
భారతదేశంలో విజిల్ బ్లోయర్లు చేసిన పోరాటాల ఫలితంగానే మనకు సమాచార హక్కు చట్టం లభించింది. ఒక సామాన్య పౌరుడు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో ప్రశ్నించే హక్కు ఈ చట్టం ద్వారా వచ్చింది. అంతేకాక విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చేందుకు కూడా వీరి పోరాటాలే కారణమయ్యాయి. నిజాలు చెప్పే వ్యక్తికి చట్టపరమైన రక్షణ ఉండాలని ఈ చట్టాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ అధికారుల్లో, పాలకుల్లో ఒకరకమైన భయం మొదలైంది.

ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ
ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రజల కోపం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకూడదు. విజిల్ బ్లోయర్లు ప్రతి శాఖలోనూ, ప్రతి గ్రామంలోనూ పుట్టుకురావాలి. ప్రాజెక్టుల పేరుతో నిధులు దారి మళ్లించినా ఆధారాలతో సహా బయటపెట్టే వ్యక్తులు పెరగాలి. నిఘా వ్యవస్థలు లేదా పోలీసులు పట్టుకోలేని కుంభకోణాలను లోపల ఉండే ఉద్యోగులే బయటకు తీయగలరు. తమ స్వార్థం చూసుకోకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే విజిల్ బ్లోయర్లు ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం జీవించే ఉంటుంది

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *