మమితా బైజు… అంకుల్స్ మోజు – మలయాళంలో బెత్లెహేమ్ సూపర్ హిట్

  • రికార్డులన్నింటినీ తిరగరాసిన సినిమా
  • ఇది ఒక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ
  • క్యూ కడుతున్న కుటుంబ ప్రేక్షకులు

సహనం వందే, హైదరాబాద్:

ఒక చిన్న సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే సాధారణ విషయమా? ఎలాంటి భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లేకుండా కేవలం ప్యూర్ ఎమోషన్స్, హ్యూమర్‌తో ఒక మలయాళ చిత్రం బాక్సాఫీస్‌ని ఊపేసింది. అదే ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. అసలు ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని ఎలా సాధించింది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఆ సీక్రెట్ మ్యాజిక్ ఏంటి?

అధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం…
విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాలో మమితా బైజు చేసిన యాక్షన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాలు 90 శాతం ఆమె మోసినట్టే లెక్క. ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ తిరగరాసింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 320 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోజువారీ వసూళ్లలో కూడా ఎక్కడా తగ్గకుండా థియేటర్లలో భారీ రన్స్ సాధించింది. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ విజయం సాధ్యమైంది.

అశ్లీలత, అసభ్యత లేకుండా…
ఈ సినిమా విజయం వెనుక ఉన్న ప్రధాన బలం దాని కథా నేపథ్యం. ఒక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీని చాలా పద్ధతిగా, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. నివిన్ పౌలీ, మమితా బైజు మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాధారణంగా ఇలాంటి కాన్సెప్ట్‌లు కాస్త తేడా కొట్టినా ఇబ్బందిగా మారుతాయి. కానీ ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా చాలా సహజంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అందుకే ప్రతీ ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడగలిగారు.

నటనతో మెప్పించిన మమితా బైజు
ఇక కథానాయికగా నటించిన మమితా బైజు తన గ్లామర్, నటనతో మెప్పించింది. ఆష్లీ అనే పాత్రలో ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ సినిమాకు కొత్త ఊపిరి పోసింది. ఇంట్రోవర్ట్ గా ఉంటూనే తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాల్లో ఆమె చూపించిన పరిణతి ప్రశంసనీయం. నివిన్ పౌలీ వంటి సీనియర్ యాక్టర్ పక్కన ఎక్కడా తగ్గకుండా పోటీపడి నటించింది. ఆమె నటనలోని అమాయకత్వం, చలాకీతనం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చేసాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ తెరకు సరికొత్త అందాన్ని తెచ్చింది.

ప్రేమలు దర్శకుడి ఘనత…
ఈ సినిమా సక్సెస్‌కు అసలైన సూత్రధారి దర్శకుడు గిరీష్ ఏడీ. గతంలో ప్రేమలు వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ఆయన, మరోసారి తన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. చాలా సాధారణమైన సన్నివేశాలను కూడా ఎంతో ఆసక్తికరంగా మలచడం ఆయన ప్రత్యేకత. కథలో అనవసరమైన డ్రామా లేకుండా నేరుగా ఎమోషన్స్‌తో కనెక్ట్ చేశారు. ఆయన ఎంచుకున్న కామెడీ సన్నివేశాలు ప్రతీ ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించాయి. దర్శకుడిగా ఆయన మేకింగ్ స్టైల్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఎంతో రియలిస్టిక్‌…
సినిమాలోని డైలాగ్, నేటివిటీ ప్రతి ఒక్కరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. మనం రోజువారీ జీవితంలో చూసే క్యారెక్టర్లను తెరపై చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫ్రెండ్స్‌ మధ్య ఉండే సంభాషణలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ఎంతో రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఏ సన్నివేశంలోనూ కృత్రిమత్వం కనిపించకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. మన పక్క ఇంట్లో లేదా మన ఊరిలో జరిగే కథలా అనిపించడమే ఈ సినిమా సాధించిన పెద్ద విజయం. ఆ ఆత్మీయతే ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేసింది.

హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు…
మంచి కథ, చక్కని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి రుజువైంది. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక చిన్న, అందమైన ప్రేమకథ అంతటి ఘనవిజయం సాధించడం నిజంగా విశేషం. మన చుట్టూ ఉండే మనుషులు, వారి ప్రేమకథలే ఎప్పుడైనా గ్రేట్ సినిమాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *