- విద్యార్థుల పక్షాన నిలిచిన షబానా, సోనాక్షి
- వ్యవస్థ వైఫల్యంపై నందితా దాస్ ఫైర్
- యువత పోరాటానికి సోనాక్షి సిన్హా మద్దతు
- విద్యార్థులు ధైర్యాన్ని ప్రశంసించిన జెనీలియా
- నిరసనలపై దాడికి హుమా ఖురేషి ఆవేదన
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశ రాజధానిలో నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. భవిష్యత్తు కోసం గొంతుక విప్పుతున్న యువతపై పోలీసులు జరుపుతున్న దమనకాండ ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో సినీ ప్రముఖులు, దిగ్గజాలు రోడ్డెక్కి నిలవడం రాజకీయాధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
నిప్పులు చెరుగుతున్న సెలబ్రిటీలు
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ కుంభకోణంపై అలుపెరగని పోరాటం చేస్తున్న విద్యార్థులకు సినిమా రంగం నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ సెలబ్రిటీలు అందరూ ఒక్కటవుతున్నారు. విద్యార్థుల గొంతుకను అణిచివేయాలని చూస్తున్న పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జంతర్ మంతర్ వద్దకు షబానా
ఇక ఈ నిరసనల్లో సీనియర్ నటి షబానా ఆజ్మీ, నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. మన రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని షబానా స్పష్టం చేశారు. ప్రముఖ బాలీవుడ్ జంట రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కూడా యువతకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. యువత ధైర్యం, శక్తి సామర్థ్యాలే రేపటి భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వారు పేర్కొన్నారు.
కలచివేసిన దృశ్యాలు… హుమా ఆవేదన
నిరసన ప్రాంతం నుంచి వస్తున్న విజువల్స్ తనను ఎంతగానో కలచివేశాయని నటి హుమా ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన విద్యార్థులపై ఇంతటి అణచివేత, లాఠీచార్జీని చూడాల్సి రావడం బాధాకరమన్నారు. సినిమా రచయిత్రి సుతపా సిక్దర్ విద్యార్థుల కష్టాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. జేబులో 10 రూపాయలు వేసుకొని ఎన్నో ఆశలతో అక్షరాల కోసం, న్యాయం కోసం ఢిల్లీకి వచ్చిన పేద విద్యార్థులు వీరంతా అని ఆమె గుర్తుచేశారు. బస్సుల కోసం, ట్రైన్ల కోసం, అడ్మిషన్ల కోసం జీవితాంతం కష్టపడే సాధారణ కుటుంబాల పిల్లలకు ఎవరూ అండగా లేకపోతే ఎలా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారి గొంతునైనా ప్రశాంతంగా వినే ఓపిక ప్రభుత్వాలకు ఉండాలని అభిప్రాయపడ్డారు.
వ్యవస్థ వైఫల్యం… నందితా విమర్శ
నటి నందితా దాస్, భూమి పెడ్నేకర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులు, లోపాలు ఏంటో గుర్తించి వాటిని సరిదిద్దే దిశగా అందరి దృష్టి ఉండాలని ఆమె కోరారు. చదువుకునే వయస్సులో విద్యార్థులు రోడ్డెక్కి ఇబ్బందులు పడే పరిస్థితి రావడం మన వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోందని ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. సోనాక్షి సిన్హా, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్ లాంటి ఎంతో మంది దిగ్గజ నటులు సైతం ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు మద్దతుగా గొంతు కలిపారు. ఎంత కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ సమస్యల పరిష్కారం కోసం నిలబడిన యువతే దేశానికి అసలైన బలమని సోనాక్షి సిన్హా కొనియాడారు. శాంతియుతంగా తమ ఆందోళనను ముందుకు తీసుకెళ్తున్న విద్యార్థుల పోరాటానికి సెలబ్రిటీల నుంచి వస్తున్న ఈ మద్దతు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.
దక్షిణాది తారల గర్జన
కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా సినీ పరిశ్రమ నుంచి కూడా ఈ దాడిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. మలయాళ నటుడు టొవినో థామస్ స్పందిస్తూ భవిష్యత్తు తరాల గొంతుకను అణచివేయడం అంటే నేరుగా భవిష్యత్తునే నాశనం చేయడమేనని హెచ్చరించారు. పార్వతి తిరువోతు సైతం పోలీసుల క్రూరత్వాన్ని ఎత్తిచూపుతూ ప్రభుత్వాల వద్ద చర్చలకు ఉన్న అయిష్టతను తీవ్రంగా ప్రశ్నించారు.