- రెండేళ్లలో 50 ప్లాట్‌ఫారమ్‌లు బంద్
- హద్దుమీరిన అసభ్యకర కంటెంట్ ప్రసారం
- చట్టాన్ని ధిక్కరిస్తున్న చిన్న యాప్‌లు
- యువతను పెడదోవ పట్టిస్తున్న ముప్పు
సహనం వందే, న్యూఢిల్లీ:
డిజిటల్ వినోదం ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్కారం మరిచి పచ్చి బూతులు ప్రసారం చేస్తున్న డిజిటల్ యాప్‌ల భరతం పడుతోంది. ఎవరికి పడితే వారికి చెత్త కంటెంట్‌ను అందిస్తున్న ప్లాట్‌ఫారమ్‌లను ఏరిపారేస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన తరుణంలో కొద్దిమంది చేస్తున్న తప్పులకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన చర్యలకు తెరలేపింది.
అరాచక కంటెంట్‌పై కొరడా
దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన తరుణంలో కొన్ని చిన్నస్థాయి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశాయి. ఏమాత్రం సంస్కారం లేని పచ్చి బూతులు, అశ్లీల దృశ్యాలతో కూడిన కంటెంట్‌ను విచ్చలవిడిగా అప్‌లోడ్ చేస్తూ యువతను పెడదోవ పట్టించాయి. ఈ క్రమంలోనే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, టెలికాం శాఖలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకున్నాయి. మొత్తం 50 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు పబ్లిక్ యాక్సెస్ లేకుండా పూర్తిగా బ్లాక్ చేశారు.
నిషేధానికి గురైన యాప్‌ల చిట్టా
ప్రభుత్వ నిఘా వలలో చిక్కి బ్లాక్ అయిన ఆ 50 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రధాన జాబితాలో… బిగ్ మూవీస్, నియో ఫ్లిక్స్, మూడ్ ఎక్స్, ఫుల్ సేవ, కుకూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే, ఉల్లు, షార్ట్ ఫ్లిక్స్, నియో కాస్ట్, రెడ్ ఆపిల్, హాట్ షాట్స్, ఫ్లాజో, నియో ప్రైమ్, బన్నీ, మ్యాజిక్ బాక్స్, రాబిట్, ఎక్స్‌ట్సి, నిషాచర్, హెల్ లో, నయా గ్లామర్, ట్రిప్ జీ, ఎక్స్ ప్రైమ్, హంటర్‌కుమ్, మూన్ ఫ్లిక్స్, ఎఫ్ డబ్ల్యూ ఎస్, జియో ఫ్లిక్స్, డార్క్ కార్నర్, వైబ్రెంట్, మోడ్, నియో డిజిటల్, ఇతర అనధికారిక ఏపీకే ఆధారిత లోకల్ స్ట్రీమింగ్ యాప్‌లు ఈ 50 ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటి సెన్సార్‌షిప్ లేకుండానూ కేవలం అడల్ట్ కంటెంట్‌ను నమ్ముకుని నడుస్తున్నవే కావడం గమనార్హం.
చట్టాన్ని తప్పించుకుంటున్న చిన్న యాప్‌లు
పెద్ద పెద్ద మెయిన్‌స్ట్రీమ్ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్-2021 కింద వస్తాయి. కానీ ఈ 50 చిన్న యాప్‌లు మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నేరుగా సోషల్ మీడియా లింక్స్, ఏపీకే ఫైల్స్ ద్వారా జనాల ఫోన్లలోకి చొరబడ్డాయి. చిన్న పిల్లలు కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా ఎలాంటి ఏజ్-రెస్ట్రిక్షన్ లాక్స్ లేకుండా ఈ కంటెంట్ అందుబాటులో ఉంచడం చాలా పెద్ద ప్రమాదంగా ప్రభుత్వం గుర్తించింది.
డిజిటల్ లోకంలో సరికొత్త శుభపరిణామం
స్వేచ్ఛ పేరుతో అసభ్యతను అమ్ముకుంటే చట్టం ముందు ఎవరైనా దోషులే అవుతారనే దానికి ఈ కఠిన చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ లోకంలో ఒక సరికొత్త శుభపరిణామం అని చెప్పవచ్చు. ఈ యాప్‌ల నిషేధంపై ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. ఇలాంటి కంటెంట్‌ను పూర్తిగా కట్టడి చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.