- కోట్ల గణపతికి కొండంత బీమాతో భద్రత
- ముంబైలో జీఎస్‌బీ సేవా మండల్ ఉత్సవం
సహనం వందే, ముంబై:
దేశంలో వినాయక చవితి వేడుకలు అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి ఉంటుంది. మరి, కేవలం ఐదు రోజుల పండుగ కోసం ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల బీమా చేయిస్తే ఆ గణపయ్య వైభవం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ముంబై మహా నగరంలో కొలువుదీరే ఆ ప్రత్యేక దేవుడి విశేషాలు.
66 కేజీల బంగారంతో గణేషుడు…
ముంబైలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ ఈ ఏడాది గణేశోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ విగ్రహ అలంకరణ కోసం ఏకంగా 66 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను ఉపయోగిస్తారు. అలాగే 335 కిలోలకు పైగా వెండిని, అనేక విలువైన రత్నాలను ఈ అలంకరణలో భాగం చేస్తారు. ఈ ఆభరణాలన్నీ ఎక్కడో కొన్నవి కావు, భక్తులు, సేవదార్లు తమ మొక్కుల రూపంలో ఎంతో భక్తితో సమర్పించినవే కావడం దీని ప్రత్యేకత. ఇన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయి కాబట్టే అంత భారీ స్థాయిలో బీమా చేయించాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఏకంగా 703 కోట్ల రూపాయల భారీ బీమా కవరేజీని తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ నెల 14 నుంచి 18 వరకు…
ఇక్కడ కొలువుదీరే మహా గణపతిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ దేవుడిని నవసాలా పావ్నారా విశ్వచా రాజా అని పిలుస్తారు. అంటే కోరిన కోరికలు తీర్చే విశ్వానికి రాజు అని అర్థం. ఈ ఐదు రోజుల గణేశోత్సవ వేడుకలు ఈ నెల 14 నుంచి 18 వరకు అత్యంత కోలాహలంగా జరగనున్నాయి. అంతకంటే ముందే 12న రాత్రి 8 గంటలకు మండల్ నిర్వహించే ప్రత్యేక విరాట్ దర్శన్ దివస్ రోజున భక్తులకు తొలి రూప దర్శనం కల్పించనున్నారు. ఈ వేడుకల్లో కేవలం పూజలే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా మండలి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. సాంప్రదాయ కాగితపు రసీదులను పూర్తిగా రద్దు చేసి అన్నింటినీ డిజిటల్ విధానంలోకి మార్చాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఇక్కడ పూజించే మహా గణపతి విగ్రహం కూడా పూర్తిగా పర్యావరణ హితమైన పదార్థాలతోనే తయారు చేయడం విశేషం.
2 లక్షల మందికి అన్నదానం…
ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే మరో ముఖ్యమైన కార్యక్రమం అన్నదాన సేవ. ఈ ప్రత్యేక సేవా కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ 40 వేల మందికి పైగా భక్తులకు అరటి ఆకుల్లో సాంప్రదాయ ప్రసాద భోజనాన్ని వడ్డిస్తారు. ఈ ఐదు రోజుల వేడుకల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భక్తుల ఆకలి తీర్చడమే నిజమైన దైవ సేవ అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మహా గణపతి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని భక్తులు అంటుంటారు. అంతగా ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా, అద్భుతంగా అలంకరిస్తారు. భక్తుల కనుల విందుగా విగ్రహంపై ప్రత్యేక కళను తీసుకొస్తారు. ముంబై నగరంలో జరిగే ఈ మహా గణపతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి.