సమాధిలో గర్జిస్తున్న హిట్లర్ – మళ్లీ పెనుభూతమై వస్తున్న నాజీయిజం

Naziism
  • జర్మనీలో జరుగుతున్న ఎన్నికలపై ఉత్కంఠ
  • హిట్లర్ సిద్ధాంతం నమ్మిన పార్టీకి బ్రహ్మరథం
  • యూరప్ అంతటా నాజీ భావజాలం విస్తరణ

సహనం వందే, జర్మనీ:

ప్రపంచాన్ని ఏలిన హిట్లర్ కాలం నాటి చీకటి రోజులు మళ్లీ జర్మనీని భయపెడుతున్నాయా? హిట్లర్ నిష్క్రమించి దశాబ్దాలు గడుస్తున్నా, సరిగ్గా అదే దేశంలో ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో మితవాదం పంజా విసురుతోంది! అసలు జర్మనీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఎందుకు మళ్లీ తీవ్రవాద పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు?

రాజకీయ ప్రకంపనల మధ్య ఎన్నికలు…
జర్మనీ దేశంలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఈ నెల 6న జరగబోయే ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ ఊహించని విజయాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాల్లో ప్రధాన స్రవంతి పార్టీలే అధికారాన్ని చెలాయిస్తూ వస్తున్నాయి. కానీ ప్రస్తుత ఎన్నికల సర్వేల ప్రకారం, ఈ తీవ్రవాద పార్టీ ఏకంగా 40 శాతానికి పైగా ఓట్లను సాధించి అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించేందుకు సిద్ధమవుతోంది.

AFD Hitler - Naziism

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న సమస్య…
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో నాజీ పాలన అంతమైంది. అప్పటి నుంచి ఆ దేశం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య విలువలకు, ఉదారవాద రాజకీయాలకు కట్టుబడి ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అదే జర్మనీలో ఒక తీవ్రవాద మితవాద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, ప్రసంగాలు పాత నాజీల రోజులను గుర్తుకు తెస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విదేశీయులను తరిమేస్తామంటూ…
ఈ పార్టీ ఇంత వేగంగా బలపడడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల్లో ఉన్న ఆర్థిక అసంతృప్తి, నిరుద్యోగమే. జర్మనీలోని పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే తూర్పు ప్రాంతంలోని ప్రజలు చాలా కాలంగా ఉపాధి లేక ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దీంతో అక్కడి యువత తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని ఏఎఫ్‌డీ పార్టీ తమ రాజకీయ లబ్ధి కోసం తెలివిగా వాడుకుంటోంది. దేశంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటే, ఈ పార్టీ మాత్రం విదేశీయులను పెద్ద ఎత్తున తరిమేస్తామంటూ నినాదాలు చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా వస్తున్న తప్పుడు ప్రచారాలు కూడా ఈ పార్టీకి మరింత బలానిస్తున్నాయి.

యూరప్ అంతటా ఇదే భావజాలం…
యూరప్ అంతటా ఇప్పుడు మితవాద భావజాలం వేగంగా విస్తరిస్తోంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ వరకు తీవ్రవాద పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థలకే సవాళ్లు విసురుతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన తరుణంలో జర్మనీ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. విద్వేషపూరిత రాజకీయాలకు లొంగిపోవాలా లేక వాటిని ధైర్యంగా ఎదుర్కొని మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలా అనే అతిపెద్ద పరీక్ష జర్మనీ ఎదుట నిలిచింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *