- కాక్రోచ్ జనతా పార్టీ డెమొక్రాటిక్ ఏర్పాటు
- సీజేపీ నేత మనీష్ బ్రహ్మభట్ సంచలనం
- కేజ్రీవాల్ టీమ్‌లా ఉండొద్దనేదే ఉద్దేశం
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గతంలో జరిగిన నీట్ నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ఆందోళనలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. విద్యార్థుల సమస్యల కోసం పుట్టిందంటూ చెప్పుకున్న ఈ పార్టీ వ్యవహార శైలిపై సొంత వర్గాల నుంచే తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత రాజకీయాలు, నాయకత్వం తీరు ఆ పార్టీలోని కొందరికి అసలు మింగుడు పడలేదు.
కాక్రోచ్ పార్టీ చీలిక…
కాక్రోచ్ జనతా పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మనీష్ బ్రహ్మభట్ గురువారం ఓ సంచలన ప్రకటన చేశారు. సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ డెమొక్రాటిక్ (సీజేపీ-డి). పాత పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కేవలం పేరు మార్పు కాకుండా, ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
సీజేపీ ఒంటెద్దు పోకడలే కారణం
అసలు ఈ కొత్త పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సీజేపీ పార్టీ నాయకులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా గాలికి వదిలేశారని మనీష్ బ్రహ్మభట్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏ ఒక్కరి చేతుల్లోనో పార్టీ కేంద్రీకృతం కాకూడదని ఆయన గట్టిగా వాదించారు. అందుకే అందరికీ సమానమైన భాగస్వామ్యం కల్పించేలా ఒక పారదర్శకమైన జాతీయ బృందాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు.
కేజ్రీవాల్ టీమ్‌లా మారిందా?
ఈ సందర్భంగా మనీష్ బ్రహ్మభట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాయి. వాలంటీర్లు ఎవరూ కూడా కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగేలా లేదా ఎవరికో ఒకరికి తొత్తులుగా ఉండేలా పనిచేయకూడదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా దీనిని కేజ్రీవాల్ టీమ్‌లా మార్చవద్దని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏ రాజకీయ నాయకుడికో బానిసలుగా మారకుండా, స్వతంత్రంగా ఆలోచించే నిజమైన కార్యకర్తలే దేశానికి అసలైన బలమని ఆయన నమ్ముతున్నారు. అంటే సీజేపీ కేజ్రీవాల్ టీమ్‌లా మారిందనేది ఆయన ఉద్దేశం.
రాజకీయాల్లో వ్యక్తి పూజపై ఫైర్
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తి పూజ ఎక్కువై సిద్ధాంతాలు కనుమరుగవుతున్నాయని మనీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఒక నాయకుడు ఎదిగితే చాలు, చుట్టూ ఉన్నవారు ఆయనను దేవుడిలా కొలవడం మొదలుపెడతారని, దీనివల్ల అసలు ప్రజా సమస్యలు పక్కదారి పడతాయని ఆయన విశ్లేషించారు. అందుకే సీజేపీ-డి పార్టీలో అలాంటి పోకడలకు తావు ఉండకూడదని ఆయన నిబంధనలు పెడుతున్నారు. పార్టీలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి కార్యకర్త అభిప్రాయానికి విలువనిచ్చేలా సరికొత్త విధానాన్ని రూపొందించాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారా?
నీట్ పరీక్షల సమయంలో విద్యార్థులకు అండగా నిలిచామని చెప్పుకున్న నాయకులు… ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. యువత భావోద్వేగాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సరికాదని మనీష్ భావిస్తున్నారు. అందుకే ఉద్యమాల పేరుతో మోసపోయిన యువతకు అసలైన నాయకత్వాన్ని అందించడమే తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని ఆయన చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రకటనపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రాజకీయంగా ప్రకంపనలు
మొత్తానికి చూస్తే, జంతర్ మంతర్ నిరసనలతో వెలుగులోకి వచ్చిన బొద్దింకల పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు నిరసనలు, మరోవైపు అంతర్గత పోరు మధ్య నలుగుతున్న ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎలాంటి రూపం దాలుస్తుందో వేచి చూడాలి. యువతను ఆకర్షించడానికి ఈ కొత్త డెమొక్రాటిక్ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.