అమెరికా గడ్డపై మన బిడ్డల గోడు – భారతీయులపై పెరుగుతున్న జాతి వివక్ష

Indians at America
  • ఉషా వాన్స్, వివేక్ రామస్వామిలపై దాడులు
  • ఇండియన్లపై రెండొంతులు పెరిగిన దాడులు
  • స్టాప్ ఏపీఐ హేట్ రిపోర్టులో వెల్లడైన నిజాలు

సహనం వందే, అమెరికా:

అమెరికా అంటేనే అప్పట్లో అందరికీ బంగారు భవిష్యత్తు కనిపించేది. అక్కడికి వెళ్తే డాలర్లు సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే అమెరికాలో అడుగుపెట్టడమే కష్టంగా మారుతోందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన భారతీయులపై ఎందుకు ఇంత కక్ష గడుతున్నారు? ఉషా వాన్స్ నుంచి వివేక్ రామస్వామి దాకా పెద్ద పెద్ద వాళ్లే ఎందుకు టార్గెట్ అవుతున్నారు?

జాతి వివక్ష… పెరిగిన దాడులు
స్టాప్ ఏపీఐ హేట్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక షాకింగ్ రిపోర్ట్ ప్రకారం, సౌత్ ఏషియన్లను కించపరిచే మాటలు, జాతి దూషణలు గత రెండేళ్లలో ఏకంగా 109 శాతం పెరిగాయట. అంటే పరిస్థితి ఎంత వేగంగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మాటలతో సరిపెట్టకుండా భౌతికమైన దాడులకు కూడా తెగిస్తున్నారు. మన వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమస్య రోజురోజుకూ ఒక ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటోంది. ఆఫీసుల్లో, కాలేజీలలో, రోడ్లపై ఎక్కడ చూసినా ఈ రకమైన మానసిక వేధింపులు పెరిగిపోయాయి. దీన్ని చూస్తుంటే అమెరికాలో బతకడం ఇప్పుడు ఎంత కష్టంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా…
ఈ దాడులు కేవలం సాధారణ ప్రజలకే పరిమితం కాలేదు. అమెరికా రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందుతున్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ జాతి వివక్ష బారిన పడుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య, భారత సంతతికి చెందిన ఉషా వాన్స్, అలాగే ఒకప్పుడు అధ్యక్ష రేసులో నిలిచిన వివేక్ రామస్వామి లాంటి ప్రముఖులు కూడా ఈ దాడుల బారిన పడుతున్నారు. మరోవైపు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని కూడా ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా, ఎంత శక్తివంతమైన వాళ్లయినా ఈ వివక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి…
మన ఇండియన్ అమెరికన్లు రాజకీయంగా, ఆర్థికంగా రోజురోజుకూ చాలా వేగంగా ఎదుగుతున్నారు. కంపెనీలకు సీఈఓలుగా మారుతున్నారు, పెద్ద పెద్ద రాజకీయ పదవులను అధిరోహిస్తున్నారు, చివరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ రాజకీయ, సామాజిక గుర్తింపు స్థానిక శ్వేతజాతీయులలో ఒక రకమైన అసూయను, భయాన్ని పుట్టిస్తోంది. మన వాళ్ళు తమ స్థానాలను లాగేసుకుంటారనే అభద్రతాభావమే ఈ రకమైన దాడులకు దారితీస్తోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం రంగు, జాతి పేరుతో ఇలాంటి దాడులు జరగడం మాత్రం నిజంగా మానవ హక్కులకే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. పక్క దేశాల నుంచి వచ్చి అక్కడ ఎదుగుతున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం మానవ నైజంలోని చీకటి కోణాన్ని బయటపెడుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *