వేల కోట్ల ఆటగాళ్లు – ఫుట్‌బాల్ ఆటగాళ్ల నోట్ల వేట

Foot Ball Players
  • ఏడాదికి 2505 కోట్లతో రొనాల్డో టాప్ గేర్
  • 1169 కోట్ల రూపాయలతో మెస్సీ రెండో ప్లేస్
  • 22 ఏళ్ల జూడ్ బెల్లింగ్‌హామ్ కు 368 కోట్లు
  • మైదానంలో పైసల వరద… ఫోర్బ్స్ జాబితా

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచ కప్ ఆడుతున్న సాకర్ వీరుల జేబులు ఎలా నిండుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఇది కేవలం ఈ ఒక్క టోర్నమెంట్ సంపాదన కాదు. క్లబ్ మ్యాచుల వార్షిక జీతాలు, ప్రపంచవ్యాప్త బ్రాండ్ల ప్రకటనల ద్వారా ఈ ఏడాది వీరు అందుకుంటున్న మొత్తం వార్షిక ఆదాయం. ఈ ఏడాది ప్రపంచ కప్‌లో బరిలోకి దిగుతున్న అత్యధిక పారితోషికం కలిగిన టాప్ 11 మంది ఆటగాళ్ల పూర్తి ఆదాయ వివరాలను ఫోర్బ్స్ సంస్థ లెక్కగట్టింది.

ఖజానాకు రాజు రొనాల్డో
ఈ సంపాదన వేటలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అందరికంటే ముందంజలో ఉన్నాడు. 41 ఏళ్ల రొనాల్డో మొత్తం ఏడాది ఆదాయం 2505 కోట్ల రూపాయలుగా నమోదైంది. మైదానంలో ఆట ద్వారా ఆయనకు లభించే వేతనం 1962 కోట్లు. మైదానం బయట బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రకటనల ద్వారా 543 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ప్రపంచ కప్‌లో ఆడుతున్న అత్యధిక సంపాదన కలిగిన బిలియనీర్ కెప్టెన్లలో రొనాల్డో ప్రథమ స్థానంలో నిలిచాడు.

అదే దూకుడులో మెస్సీ
అర్జెంటీనా స్టార్ 38 ఏళ్ల లియోనెల్ మెస్సీ 1169 కోట్ల రూపాయల వార్షిక సంపాదనతో రెండో స్థానంలో నిలిచాడు. మెస్సీ మైదానంలో ఆట ద్వారా 584 కోట్లు సంపాదిస్తున్నాడు. అంతే మొత్తాన్ని అంటే మరో 585 కోట్ల రూపాయలను మైదానం బయట ప్రకటనల ద్వారా వెనకేస్తున్నాడు. ఇంటర్‌ మయామి క్లబ్‌ ద్వారా వస్తున్న జీతంతో పాటు అడిడాస్, మిచేలోబ్ అల్ట్రా వంటి పెద్ద బ్రాండ్ల ప్రచారకర్తగా మెస్సీ దూసుకుపోతున్నాడు.

కుర్రాళ్ల గట్టి పోటీ
సీనియర్లకు భవిష్యత్తు తరం ఆటగాళ్లు గట్టి పోటీ ఇస్తున్నారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన 27 ఏళ్ల కిలియన్ ఎంబాప్పే మొత్తం 794 కోట్ల రూపాయలతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఆయన మైదానంలో 585 కోట్లు, ప్రకటనల ద్వారా 209 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అలాగే నార్వేకు చెందిన 25 ఏళ్ల ఎర్లింగ్ హాలాండ్ 668 కోట్ల రూపాయల సంపాదనతో నాలుగో స్థానంలో ఉన్నాడు. హాలాండ్ మైదానంలో 501 కోట్లు, ప్రకటనల ద్వారా 167 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

స్టార్ల నోట్ల వేట
బ్రెజిల్ దేశానికి చెందిన 25 ఏళ్ల యువ స్టార్ వినిసియస్ జూనియర్ మొత్తం 501 కోట్ల రూపాయల ఆదాయంతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇందులో మైదానంలో ఆట ద్వారా 334 కోట్లు, ప్రకటనల ద్వారా 167 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈయన తర్వాత ఈజిప్ట్ దేశానికి చెందిన 33 ఏళ్ల మహ్మద్ సలా 460 కోట్ల రూపాయల సంపాదనతో ఆరో స్థానంలో నిలవగా, సెనెగల్ దేశానికి చెందిన 34 ఏళ్ల సాడియో మానే 451 కోట్ల రూపాయల సంపాదనతో ఏడో స్థానంలో నిలిచాడు. సలా మైదానంలో 293 కోట్లు, బయట 167 కోట్లు సంపాదిస్తుండగా, మానే మైదానంలో 418 కోట్లు, బయట 34 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు.

చిన్న వయసులోనే వందల కోట్లు
ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్న 22 ఏళ్ల జూడ్ బెల్లింగ్‌హామ్ మొత్తం 368 కోట్ల రూపాయల ఆదాయంతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఆయన మైదానంలో 243 కోట్లు, ప్రకటనల ద్వారా 125 కోట్ల రూపాయలు వెనకేస్తున్నాడు. ఇక ఈ లిస్టు మొత్తంలో అందరికంటే చిన్న వయస్కుడైన స్పెయిన్ దేశపు 18 ఏళ్ల లామిన్ యమాల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 360 కోట్ల రూపాయల సంపాదనతో తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ వయసులోనే ఆయన మైదానంలో 276 కోట్లు సంపాదిస్తుండగా, కోకాకోలా, మెక్‌డొనాల్డ్స్, వీసా వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ల ప్రకటనల ద్వారా ఏకంగా 83 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు.

ఆఖరి స్థానాల్లో కేన్, నేమార్
ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతూ జర్మనీ బుండెస్లిగా లీగ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యారీ కేన్ 32 ఏళ్ల వయసులో మొత్తం 343 కోట్ల రూపాయల ఆదాయంతో పదో స్థానంలో ఉన్నాడు. ఆయన మైదానంలో 243 కోట్లు, ప్రకటనల ద్వారా 100 కోట్లు రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఇక బ్రెజిల్ స్టార్ నేమార్ 318 కోట్ల రూపాయల సంపాదనతో ఈ టాప్ 11 జాబితాలో చివరి స్థానంలో నిలిచాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *