- డబ్బులు లేని చిన్న బిల్డర్ల సరికొత్త జిమ్మిక్కు
- ఈఎంఐ లేదంటూ మాయ… ఆఫర్లతో మోసం
సహనం వందే, హైదరాబాద్:
రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త వ్యాపార వ్యూహాలు కలకలం రేపుతున్నాయి. ఇల్లు చేతికి రాకముందే అద్దె ఇస్తామంటూ బిల్డర్లు వేస్తున్న ఎర వెనుక భారీ ఆర్థిక మాయాజాలం దాగి ఉంది. ఈ సరికొత్త ప్రీ-పొసెషన్ రెంట్ మోసాల అసలు రంగును ఇప్పుడు చూద్దాం.
ఉచ్చులా ఉచితాల ప్రకటనలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొద్దిరోజులుగా సరికొత్త ఆఫర్లు హల్చల్ చేస్తున్నాయి. స్వాధీనానికి ముందే అద్దె చెల్లిస్తామంటూ బిల్డర్లు సరికొత్త మోసపూరిత ప్రకటనలతో మార్కెట్లోకి వచ్చారు. స్వాధీనం వరకు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదంటూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. అష్యూర్డ్ రెంటల్ స్కీమ్స్ పేరుతో నమ్మబలుకుతూ మధ్యతరగతిని బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ఆఫర్ల వెనుక ఉన్న లోతైన ఆర్థిక నష్టాలను సామాన్యులు గమనించలేకపోతున్నారు.
టియర్ వన్ బిల్డర్ల నమ్మకమైన పునాది
ఈ తరహా ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండాలంటే బిల్డర్ల చరిత్రను పూర్తిగా పరిశీలించాలి. మీరు సంప్రదించే సంస్థ టియర్ వన్ కేటగిరీకి చెందినదైతే కొంతవరకు సురక్షితం కావచ్చు. గతంలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నమ్మకమైన చరిత్ర గల బిల్డర్లతోనే ఇటువంటి ఒప్పందాలు చేసుకోవాలి. అటువంటి పెద్ద సంస్థలు అందించే ముందస్తు అద్దె పథకాలు పెట్టుబడిదారులకు మంచి ఆర్థిక సాధనంగా ఉపయోగపడతాయి. అయితే మార్కెట్లో అందరూ అటువంటి వారు లేరనేది పచ్చి నిజం.
చిన్న బిల్డర్లలో ఆర్థిక సంక్షోభం
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చిన్న బిల్డర్లు లేదా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న డెవలపర్లు ఈ పథకాలను మోసపూరితంగా వాడుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా లేక ఇలాంటి ఉచితాల ఎర వేస్తున్నారు. ఈ చిన్న బిల్డర్ల నమ్మకత్వంపై ఎలాంటి ఆధారాలు ఉండవు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిల్డర్లు కస్టమర్ల నుంచి ముందస్తుగా డబ్బులు లాగడానికే ఇటువంటి జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. వీరి ట్రాప్‌లో పడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.
మీ డబ్బుతోనే మీకు చెల్లిస్తున్న అద్దె మాయ
బిల్డర్లు ఎవరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరనేది జగమెరిగిన సత్యం. రాబోయే 2 లేదా 3 ఏళ్లలో మీకు చెల్లిస్తామన్న మొత్తం అద్దెను ముందే లెక్కగడుతున్నారు. ఆ మొత్తాన్ని అపార్ట్మెంట్ బేస్ సెల్లింగ్ ప్రైస్‌కు అదనంగా కలిపేస్తున్నారు. అంటే మీ జేబులో నుంచి తీసుకున్న డబ్బులనే మీకు ప్రతి నెలా అద్దె రూపంలో తిరిగి ఇస్తున్నారు. కొనుగోలుదారులు తమ సొంత డబ్బుతోనే ఈ ముందస్తు అద్దె స్కీమ్‌కు తామే పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నారనే విస్తుపోయే నిజం ఇక్కడ దాగి ఉంది.
అసలు మోసం ఎలా జరుగుతుందంటే?
ఈ మోసాన్ని అర్థమయ్యేలా ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక అపార్ట్మెంట్ అసలు ధర 50 లక్షల రూపాయలు అనుకుందాం. బిల్డర్ మీకు ఇల్లు కట్టకముందే నెలకు 20 వేల రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు అద్దె ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. అంటే 3 ఏళ్లకు కలిపి మొత్తం 7 లక్షల 20 వేల రూపాయలు మీకు అద్దెగా ఇస్తాడు. కానీ బిల్డర్ తెలివిగా ఆ 50 లక్షల అపార్ట్మెంట్ ధరను 57 లక్షల 20 వేల రూపాయలుగా నిర్ణయిస్తాడు. అంటే మీ దగ్గరే అదనంగా డబ్బులు వసూలు చేసి మీ డబ్బునే మీకు అద్దెగా ఇస్తున్నాడు.
నో ఈఎంఐ టిల్ పొసెషన్ అంటూ…
కొందరు బిల్డర్లు నో ఈఎంఐ టిల్ పొసెషన్ అంటారు. అంటే ఇల్లు మీ చేతికి వచ్చేవరకు బ్యాంకు లోన్ ఈఎంఐను బిల్డరే కడతానని నమ్మిస్తాడు. ఇక్కడ కూడా సదరు ఈఎంఐ మొత్తాన్ని ముందే ఫ్లాట్ ధరలో కలిపేసి మీ నెత్తిన భారం వేస్తాడు. ఒక చిన్న బిల్డర్ అష్యూర్డ్ రెంటల్ స్కీమ్ ప్రకటించి మధ్యలోనే చేతులెత్తేస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఫ్లాట్ ధర పెంచి వసూలు చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పారిపోతే అటు ఇల్లు రాక ఇటు అద్దె రాక సామాన్యుడు రోడ్డున పడతాడు.