- బట్టల నుంచి సరుకుల అమ్మకం వరకు
- బ్రాండ్ విలువ… మహిళా నాయకత్వం
సహనం వందే, హైదరాబాద్:
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంస్థ ఇప్పుడు తన పగ్గాలను ఒక పవర్‌ఫుల్ మహిళా లీడర్ చేతిలో పెట్టింది. ఆన్‌లైన్‌లో బట్టలు కొనుక్కునేలా మ్యాజిక్ చేసిన సెలబ్రిటీ బాస్ ఇప్పుడు టమాటాలు, పాలు మోసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతున్న తరుణంలో ఈ మార్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
క్విక్ కామర్స్ రంగంలో సంచలన మార్పు
భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతోంది. మనం అడిగిన 10 నిమిషాల్లోనే కిరాణా సామాను నుంచి గృహోపకరణాల వరకు అన్నీ గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయంటే దాని వెనుక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీ సంస్థ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టామార్ట్ వ్యాపారానికి కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ విభాగాన్ని నడిపించిన అమిటేష్ కుమార్ ఝా తన వ్యక్తిగత కారణాల వల్ల సంస్థ నుంచి మంగళవారం బయటకు వెళ్ళిపోయారు. సరిగ్గా ఆయన స్థానంలోకి ఫ్యాషన్ రంగంలో తిరుగులేని పేరు తెచ్చుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నందితా సిన్హాను స్విగ్గీ యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ కీలక మార్పు రాబోయే రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ రూపురేఖలనే పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫ్యాషన్ నుంచి కిరాణా రంగం వైపు
నందితా సిన్హా పేరు వినగానే మనకు ముందుగా గుర్తువచ్చేది ప్రముఖ ఫ్యాషన్ ఈకామర్స్ దిగ్గజం మింత్రా. గత కొన్ని సంవత్సరాలుగా మింత్రా సంస్థను సీఈఓ హోదాలో అత్యంత లాభాల బాటలో నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా అంతకు ముందు ఫ్లిప్‌కార్ట్, బ్రిటానియా, హిందుస్థాన్ యునిలీవర్ వంటి దిగ్గజ కంపెనీలలో కూడా ఆమె ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మార్కెట్ పోకడలను ముందే పసిగట్టడంలో బ్రాండ్ వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడంలో ఆమెది అందెవేసిన చేయి. అందుకే స్విగ్గీ తన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్‌స్టామార్ట్ వ్యాపారాన్ని ఆమె చేతికి అప్పగించింది.
తీవ్రతరమవుతున్న పోటీ
ప్రస్తుతం మన దేశంలో క్విక్ కామర్స్ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు… చిన్న పట్టణాలకు కూడా వేగంగా పాకుతోంది. ఒకవైపు బ్లింకిట్, మరోవైపు జెప్టో వంటి కంపెనీలు ఇన్‌స్టామార్ట్‌కు నిద్రలేకుండా గట్టి పోటీ ఇస్తున్నాయి. 10 నిమిషాల డెలివరీ కోసం కస్టమర్లు ఎగబడుతున్న ఈ తరుణంలో లాభాల బాట పట్టడం కంపెనీలకు కత్తి మీద సాములా మారింది. కేవలం వేగంగా డెలివరీ చేయడం మాత్రమే కాకుండా కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలను తక్కువ ఖర్చుతో అందించడం ఇప్పుడు అసలైన సవాల్. ఈ పోటీలో నిలదొక్కుకోవాలంటే కేవలం ఆపరేషన్స్ మాత్రమే కాదు కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకునే బలమైన లీడర్ అవసరం. ఫ్యాషన్ రంగంలో వినియోగదారుల నాడీని బాగా పట్టుకున్న నందితా సిన్హా అనుభవం ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌కు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
బ్రాండ్ విలువ… మహిళా నాయకత్వం
నందితా సిన్హా కెరీర్‌ను గమనిస్తే ఆమె కేవలం వ్యాపారాన్ని పెంచడమే కాకుండా బ్రాండ్ విలువను కూడా విపరీతంగా పెంచగలరని అర్థమవుతుంది. మింత్రాలో ఆమె పనిచేసిన కాలంలో డిజిటల్ షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు మరింత సులభతరం చేసేలా అనేక కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. ఇప్పుడు అదే అనుభవాన్ని కిరాణా సామాను డెలివరీ రంగంలో ఆమె ఎలా వాడుతారనేది చూడాలి. కిరాణా, నిత్యవసర వస్తువుల కొనుగోళ్లలో మహిళల పాత్ర చాలా కీలకం కాబట్టి ఆమె నాయకత్వం మరింత ప్రత్యేకమైన ప్రభావం చూపవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తగా ఆమె సాధించిన విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆమె భుజాన పడిన ఈ కొత్త బాధ్యత భారతీయ రిటైల్ రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.