సౌత్ లీడర్లు సరెండర్ అయ్యారా? – డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది మౌనం

South Leaders Silence on Delimitation
  • నోరు విప్పని సౌత్ ఇండియన్ సీఎంలు
  • తూతూమంత్రంగా దక్షిణాది జోనల్ కౌన్సిల్
  • నేతలను దారికి తెచ్చుకుంటున్న కేంద్రం

సహనం వందే, హైదరాబాద్:

ఇప్పుడు దక్షిణాది రాజకీయాలను అత్యంత తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన అంశం లోక్‌సభ సీట్ల పునర్విభజన. దక్షిణాది నాయకులు ఈ విషయంలో కలిసికట్టుగా మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్తరాది హవా ముందు మన రాష్ట్రాల నాయకులు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. జాతీయ స్థాయిలో మన గొంతు రోజురోజుకూ బలహీనపడిపోతోంది.

నేతల మౌనరాగం
ఇటీవల తమిళనాడులో జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తీవ్ర స్థాయిలో తమ గళాన్ని విప్పలేదన్న విమర్శలు ఉన్నాయి. శివకుమార్ మాత్రం 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాల సంఖ్య అలాగే ఉంచాలని ఆయన కోరారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ విషయంలో కేవలం మొక్కుబడి మాటలతో సరిపెట్టారనే అభిప్రాయం వ్యక్తమైంది.

మారిన నేతల వైఖరి…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గతంలో ఈ డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, రానురాను తన పద్ధతిని మార్చుకుని రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరడానికే పరిమితమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలకమైన సమావేశానికి హాజరుకాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పంపడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం పాటిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను దారికి తెచ్చుకోవడానికి కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు దక్షిణాది గళాన్ని క్రమంగా నొక్కివేస్తున్నాయి.

చరిత్రలో ఉత్తరాది హవా
స్వాతాంత్ర ఉద్యమ కాలం నుంచి చూస్తే ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల నాయకులదే జాతీయ స్థాయిలో హవా నడిచింది. కానీ దక్షిణాది ప్రాంతం మాత్రం జాతీయ రాజకీయాల్లో తన గళాన్ని పూర్తిగా వినిపించలేకపోయామనే ఆవేదన ప్రజల్లో ఉంది. గాంధీ, నెహ్రూ, నేతాజీ, పటేల్ వంటి దిగ్గజాలు ఉత్తరాది నుంచి రాగా, దక్షిణాది నుంచి రాజాజీ, టంగుటూరి ప్రకాశం, ఈఎంఎస్ నంబూద్రిపాద్ లాంటి గొప్ప నేతలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు. అప్పట్లో దక్షిణాదిలో జరిగిన అనే ఉద్యమాలు, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలు జాతీయ స్థాయిలో పెద్దగా చర్చకు రాలేదు.

హిందీ భావజాలం నీడలో వెనుకడుగు…
నెహ్రూ-గాంధీ కుటుంబం రాజకీయ ఆధిపత్యం, హిందీ భావజాలం దక్షిణాది నాయకత్వాన్ని ఎప్పుడూ నీడలా కమ్ముకుంటూనే వచ్చాయి. బీజేపీలో కూడా హిందీ మాట్లాడే రాష్ట్రాల నాయకులదే పైచేయిగా ఉండటం వల్ల దక్షిణాది రాజకీయ నాయకులు వెనుకబడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాదిలో కామరాజ్, సి. సుబ్రమణ్యం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్. జయరామారెడ్డి, ఎస్. నిజలింగప్ప, దేవరాజ్ ఉర్స్, ఎస్.ఎం. కృష్ణ, ఈఎంఎస్ నంబూద్రిపాద్ వంటి శక్తివంతమైన ప్రాంతీయ నాయకులను తయారుచేసింది.

ప్రాంతీయ పార్టీలకే పరిమితమైన రాజకీయం…
జాతీయ రాజకీయాల్లో ఎవరైనా దక్షిణాది నేతలు తమ ముద్ర వేయగలిగితే, అది కేవలం ప్రాంతీయ పార్టీల ద్వారా లేదా ప్రత్యేకమైన ప్రాంతీయ ప్రాబల్యం ఉన్న జాతీయ పార్టీల ద్వారానే సాధ్యమైంది. తమిళనాడులో ఎం.జి. రామచంద్రన్, జయలలిత, కేరళలో నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు, తెలంగాణలో కె. చంద్రశేఖర రావు, కర్ణాటకలో హెచ్.డి. దేవెగౌడ, రామకృష్ణ హెగ్డే, సిద్ధరామయ్య వంటి నాయకులు ప్రాంతీయ స్థాయిలోనే తమ రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ పార్టీలు దక్షిణాది నాయకులకు ఒక ప్రాంతీయ గుర్తింపు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యాయి తప్ప జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం ఇవ్వలేదు.

మౌనం వీడితేనే హక్కుల రక్షణ
ఇక దక్షిణాది రాజకీయ నాయకత్వానికి జాతీయస్థాయిలో తగిన మీడియా మద్దతు గానీ, ఆ స్థాయి గుర్తింపు గానీ లభించలేదు. దక్షిణాది ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను విస్మరించి, కేవలం కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు రాబట్టుకోవడానికే పరిమితమవుతున్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో మన రాష్ట్రాల గొంతుక రోజురోజుకూ బలహీనపడి మూలన పడిపోతోంది. దక్షిణాదిలో బలమైన పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ముందు బలహీనపడుతున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *