- సరిహద్దులు దాటి సేవలందిస్తున్న నటుడు
- బాధితుల గుండెల్లో దేవుడైన రియల్ హీరో
- ఇండియా నుంచి ఆహారం, దుప్పట్ల సాయం
సహనం వందే, నేపాల్:
కష్టమొచ్చినప్పుడు సరిహద్దులు లెక్కచేయకుండా ముందుకెళ్లే అసలు సిసలు రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నేపాల్ దేశాన్ని వణికించిన భయంకరమైన వరద విలయంలో సర్వస్వం కోల్పోయిన ప్రజల రోదనలకు చలించిపోయి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి బాధితులకు అండగా నిలుస్తున్నారు.
సరిహద్దులను దాటిన సోనూసూద్ సేవలు…
కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులకు దేవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్… ఇప్పుడు సరిహద్దులు దాటి పక్కనే ఉన్న నేపాల్ దేశంలోని వరద బాధితుల కోసం అడుగులు వేశారు. తన సూద్ ఛారిటీ ఫౌండేషన్ బృందంతో కలిసి నేరుగా నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. ‘నేపాల్ ప్రజలారా మీరు ఒంటరిగా లేరు, మేము ఆహారం, ఆశ్రయం కల్పిస్తాం. మిమ్మల్ని మళ్లీ నిలబెట్టేందుకు వస్తున్నామని’ ఆయన ముందే ప్రకటించి ఇప్పుడు చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఖాట్మాండు చేరుకున్న వెంటనే వరద బాధితులను కలిసి వారిని ఓదార్చడంతో పాటు వారి జీవితాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు తాను ముందుంటానని భరోసా ఇచ్చారు.
భారీగా తరలివస్తున్న సహాయక సామగ్రి
ప్రస్తుతానికైతే అక్కడి బాధితుల తక్షణ అవసరాలను తీర్చడానికి సోనూసూద్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. భారత్ నుంచి ప్రత్యేకంగా వేల సంఖ్యలో దుప్పట్లు, ఆహార పదార్థాలను నేపాల్‌కు తరలించారు. అక్కడి గ్రౌండ్ రియాల్టీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ స్థానిక ప్రజలకు అసలు ఏది అవసరమో తెలుసుకుని మరీ సాయం అందిస్తున్నారు. కేవలం ఒకరిద్దరితో కాకుండా పెద్ద బృందంతో వెళ్లి అక్కడి క్షతగాత్రులను, బాధితులను పరామర్శించడం విశేషం. నేపాల్‌లో చిన్నపిల్లలు తమ ఇళ్లను, కుటుంబాలను, బాల్యాన్ని కోల్పోయి రోడ్డున పడిన దృశ్యాలు తనను ఎంతగానో కలిచివేశాయని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వారందరికీ ఒక కొత్త జీవితాన్ని అందించడానికి తాము కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
భవిష్యత్తులోనూ నిరంతరం సేవలు
ఈ సహాయ కార్యక్రమాలు కేవలం కొన్ని రోజులకే పరిమితం కావని సోనూసూద్ స్పష్టం చేశారు. కేవలం ఈ నెల మాత్రమే కాకుండా రాబోయే నెలల్లో కూడా నేపాల్‌కు నిరంతరం సహాయం అందుతూనే ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో అవసరమైన సామగ్రిని సేకరించి భారత్ నుంచి ఎప్పటికప్పుడు నేపాల్‌కు పంపిస్తున్నామని తెలిపారు. బాధితులు పూర్తిగా కోలుకుని తమ సొంత కాళ్లపై నిలబడే వరకు తమ సహాయం ఆగదని ఆయన చెప్పారు.
సేవా కార్యక్రమాల్లో నిలువెత్తు రూపం…
సోనూసూద్ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కరోనా మహమ్మారి సమయంలోనూ… ఆ తర్వాత పంజాబ్ వరదల సమయంలోనూ, అలాగే ఈ ఏడాది మార్చిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉచిత వసతి కల్పించి తన పెద్ద మనసును చాటుకున్నారు. కులం, మతం, దేశం అనే తేడా లేకుండా సాయం చేయడమే అసలైన మానవత్వం అని ఆయన చేతల్లో చేసి చూపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.