ప్రధాని పీఠంపై దళపతి కన్ను – ఢిల్లీకి దూసుకొస్తున్న విజయ్

India Today Survey
  • మూడో స్థానంలో తమిళనాడు సీఎం
  • మొదట మోడీ… రెండో స్థానం రాహుల్
  • దేశాన్ని కుదిపేస్తున్న ఇండియా టుడే సర్వే
  • ఎన్నికలు వస్తే మోడీకే మళ్లీ అధికార పీఠం
  • కాక్రోచ్ జనతా ‘పార్టీ’గా మారకూడదన్న జనం

సహనం వందే, న్యూఢిల్లీ:

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే నిజమని నిరూపిస్తూ తమిళనాడులో పార్టీ పెట్టి అనతికాలంలోనే సీఎంగా పీఠం ఎక్కిన జోసఫ్ విజయ్ ఇప్పుడు ఏకంగా జాతీయ రాజకీయాల్లో ప్రధాని రేసులో మూడో స్థానానికి దూసుకొచ్చారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైన ఈ సంచలన విషయాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

ప్రధాని రేసులో విజయ్ సంచలనం…
తమిళనాడులో టీవీకే పార్టీని స్థాపించి రెండేళ్లలోపే సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ జాతీయ స్థాయిలోనూ తన పాపులారిటీని అసాధారణ రీతిలో పెంచుకుంటున్నారు. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుందనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఏకంగా 9.2 శాతం మంది ప్రజలు విజయ్‌ వైపు మొగ్గు చూపారు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, కేవలం ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు ప్రధాని రేసులో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ ప్రధాని అభ్యర్థుల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నరేంద్ర మోదీ 48.7 శాతం మద్దతుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 27.1 శాతం మద్దతుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా జనం విజయ్‌ను ఎంచుకోవడం గమనార్హం. విజయ్ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత కీలకం కానుందని స్పష్టమవుతోంది.

వెనక్కి తగ్గిన జాతీయ దిగ్గజాలు
ప్రధాని రేసులో మూడో స్థానంలో ఉన్న విజయ్… మిగతా జాతీయ, ప్రాంతీయ దిగ్గజ నేతలందరినీ ఆయన వెనక్కి నెట్టేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే రాగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు 1.7 శాతం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌కు 1.2 శాతం మద్దతు మాత్రమే లభించింది. అంటే ఈ సీనియర్ నాయకులందరికంటే విజయ్ ఎంతో ముందంజలో ఉన్నారన్నమాట. అంతేకాదు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులలో ఎవరు అత్యంత సమర్ధులని ప్రశ్నిస్తే, విజయ్ ఏకంగా 12.2 శాతం ఓట్లతో మరోసారి సత్తా చాటారు. ఈ విభాగంలోనూ రాహుల్ గాంధీ 29 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, విజయ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు.

మళ్లీ ఎన్డీయేదే అధికార పీఠం
మరోవైపు దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై కూడా ఈ సర్వేలో స్పష్టమైన అంచనాలు వెలువడ్డాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన విద్యార్థుల ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన నిరసనల తర్వాత ఎన్డీయేకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన మాట వాస్తవమే. అయితే ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి తన ప్రభుత్వాన్ని ఘనంగా నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో అది 326 సీట్లకు పడిపోయింది. అంటే ఎన్డీయే కూటమి సుమారు 26 ఎంపీ సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ మెజారిటీ మార్క్‌ను సులభంగా దాటి మరోసారి కేంద్రంలో పీఠం కైవసం చేసుకునే బలమైన స్థితిలోనే ఎన్డీయే ఉండటం గమనార్హం.

ఇండియా కూటమికి ఆశించిన సీట్లు లేవు…
ఇక విపక్ష ఇండియా కూటమి విషయానికి వస్తే… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ కూటమికి 185 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ఈ సంఖ్య 182గా ఉండేది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన 234 సీట్లతో పోల్చి చూస్తే, ప్రస్తుత అంచనాలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఇక దేశ యువత, జెన్-జీ మనస్తత్వాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై యువతలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరీక్షా వ్యవస్థపై దాదాపు 67 శాతం మంది యువతకు నమ్మకం లేదని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాక్రోచ్ జనతా ‘పార్టీ’గా మారకూడదు…
అయితే ప్రభుత్వానికి ఎదురుకానున్న సవాళ్లు కూడా తక్కువేం కావు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని 46.7 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు యువత కోసం పోరాడుతున్నామని చెబుతున్న కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారకూడదని, కేవలం ప్రెజర్ గ్రూప్‌గానే పనిచేయాలని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలు అన్నీ ఉన్నప్పటికీ మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం సడలలేదని సర్వే స్పష్టం చేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *