- ఒకే కంపెనీ… ఒకే ఉత్పత్తి… నాణ్యత వేరు
- విదేశాల్లో నాణ్యత… భారతదేశంలో మోసం
- నాసిరకపు పదార్థాలతో ఉత్పత్తుల తయారీ
- చిన్న అక్షరాల వెనుక పెద్ద పన్నాగం
సహనం వందే, హైదరాబాద్:
విదేశాలలో ఆరోగ్య నిబంధనలతో తయారయ్యే ఫాంటా, బోర్న్‌విటా, మాగీ వంటి ఉత్పత్తులు మన దేశంలో మాత్రం భారీ షుగర్‌తో, హానికరమైన పదార్థాలతో ఎందుకు తయారవుతున్నాయి? మన దేశ ప్రజల పట్ల ఎందుకు అంత చులకన? మన ఆరోగ్యం పట్ల బడా కంపెనీలకు బాధ్యత లేదా?
కంపెనీ ఒకటే నాణ్యత వేరు
ఫాంటా, మాగీ, కిట్‌క్యాట్, బోర్న్‌విటా వంటి ప్రముఖ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. కానీ వీటి తయారీలో ఉపయోగించే పదార్థాలు దేశాన్ని బట్టి పూర్తిగా మారిపోతుంటాయి. ఉదాహరణకు యూరప్ దేశాల్లో విక్రయించే ఫాంటాలో సహజమైన పండ్ల రసం మోతాదు ఎక్కువగా ఉంటుంది. అదే మన దేశంలోకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, రంగులు, భారీ స్థాయిలో పంచదారను కలుపుతారు. దీనివల్ల రుచిలో తేడా రావడం మాత్రమే కాకుండా మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
పిల్లల ఆరోగ్యాన్ని తాకట్టుపెట్టే చక్కెర
బోర్న్‌విటా ఉదంతం చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది కాలం క్రితం దీనిలో మోతాదుకు మించిన చక్కెర శాతం ఉండడంపై పెద్ద వివాదమే చెలరేగింది. పిల్లల ఎదుగుదల కోసం రోజూ తాగించే హెల్త్ డ్రింక్స్‌లో ఇంత భారీ మొత్తంలో షుగర్ ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. విదేశాల్లో విక్రయించే ఇదే ఉత్పత్తులలో పోషక విలువులు మెరుగ్గా ఉంటున్నప్పటికీ, మన దేశ మార్కెట్లలో మాత్రం పంచదార మోతాదు ఎక్కువగా ఉంటోంది.
చట్టాల లొసుగులతో సాగే వ్యాపారం
మాగీ నూడుల్స్ విషయంలోనూ ఇదే తంతు కనిపిస్తుంది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సోడియం, మైదా మోతాదుపై పరిమితులు విధిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం బ్రాండ్లు స్థానిక రుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూనే, హానికరమైన పదార్థాలను నియంత్రించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. చట్టాలలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కంపెనీలు మన దేశ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయి.
చిన్న అక్షరాల వెనుక పన్నాగం
ఇక్కడ అసలు సమస్య కేవలం పదార్థాల నాణ్యత మాత్రమే కాదు, వినియోగదారుడికి నిజాలు తెలియకపోవడం. విదేశాలలో ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలు ముద్రించడం తప్పనిసరి. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయి, ఆరోగ్యానికి ఏది ప్రమాదకరమో ముందుగానే పెద్ద అక్షరాలతో చూపిస్తారు. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ప్యాకెట్ల వెనుక భాగంలో చిన్న చిన్న అక్షరాలతో ఎవడూ చదవని రీతిలో ముద్రించి చేతులు దులుపుకుంటున్నారు.
వార్నింగ్ లేబుళ్లను వ్యతిరేకిస్తున్న వైనం
దీనికోసమే ప్రపంచవ్యాప్తంగా ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ వార్నింగ్ లేబుల్స్ విధానం తెరపైకి వచ్చింది. ప్యాకెట్ వెనుక కాదు, సరిగ్గా ముందు భాగంలోనే ఎరుపు రంగు గుర్తుతో ఈ పదార్థంలో ఎంత షుగర్, ఉప్పు లేదా కొవ్వు ఉందని హెచ్చరించడమే ఈ విధానం ఉద్దేశం. చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు కొనేటప్పుడే సామాన్యుడికి అది ఎంత ప్రమాదకరమో ఇట్టే అర్థమైపోతుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇప్పటికే ఈ లేబుల్స్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తుంటే, మన దేశంలో కోట్లాది రూపాయల వ్యాపారం చేసే పెద్ద పెద్ద ఫుడ్ కార్పొరేషన్లు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కార్పొరేట్ లాభాల వేటలో మన ఆరోగ్యం
ప్యాకెట్ల ముందు భాగంలో ప్రమాదకరమైన హెచ్చరికలు ఉంటే తమ అమ్మకాలు పడిపోతాయని, వ్యాపారం దెబ్బతింటుందని ఆ కంపెనీలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏ దేశపు పౌరులైనా వారికి లభించే ఆహార నాణ్యత ఒకేలా ఉండాలి. మన దేశంలోని పిల్లలు, పెద్దలు తాగే పానీయాలు లేదా తినే తిండి విదేశాల్లోని ప్రమాణాలకంటే తక్కువ నాణ్యతతో ఉండటం ఎంతవరకు సమంజసం. కంపెనీల లాభాల వేటలో మన ఆరోగ్యం బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.