కోర్టుకే షాకిచ్చిన ఫుడ్ కమిషనర్! – నిలదీసిన న్యాయమూర్తికే చుక్కలు

Thukaram Munde IAS
  • గంటలో హైకోర్టు క్యాంటీన్లపైనే మెరుపు దాడి
  • అక్కడి లైసెన్సులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం
  • ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంచలన రికార్డులు
  • మహారాష్ట్రను ఊపేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్

సహనం వందే, ముంబై:

ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే పడుతున్నారంటూ సాక్షాత్తు ముంబై న్యాయమూర్తి నుంచి ఎదురుదాడి ఎదురైన వేళ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే వేసిన మాస్టర్ స్ట్రోక్ సంచలనం సృష్టించింది. కోర్టులకే చుక్కలు చూపిస్తూ కేవలం గంటల వ్యవధిలో హైకోర్టు ఆవరణలోని క్యాంటీన్లపైనే మెరుపు దాడి చేసిన ఆయన, లైసెన్సులు లేకుండా నడుస్తున్న వాటిని తక్షణమే మూసివేయించారు.

కోర్టు గది నుంచి వంటగది దాకా రైడ్స్
ముంబై నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తుకారామ్ ముండే ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారా అని ముంబై న్యాయమూర్తి నిలదీయడంతో, అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కోర్టు క్యాంటీన్లలో కూడా తనిఖీలు నిర్వహించి లైసెన్సులు లేని వాటిని కొద్ది గంటల్లోనే మూసివేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3 వేలకు పైగా రైడ్స్ నిర్వహించి అపరిశుభ్ర వంటగదుల బాగోతాన్ని బట్టబయలు చేశారు. ప్రముఖ ఫుడ్ చెయిన్ ఔట్‌లెట్లలో కూడా అనుమతులు సస్పెండ్ చేయించారు. డొమిటోస్ సంస్థకు చెందిన 4 ఔట్‌లెట్లు, ఒక పిజ్జా హట్ ఔట్‌లెట్లలో తనిఖీలు చేసి అనుమతులు రద్దు చేశారు. మురికి గోడలు, బొద్దింకలు, ఎలుకలు, గడువు తీరిన ఆహార పదార్థాలు వంటగదుల్లో ప్రత్యక్షమయ్యాయి.

Food Safety Commissioner Court Ride

వీధి వ్యాపారుల్లోనూ ముండే భయం
తుకారామ్ ముండే దూకుడుతో నగరంలోని వీధి వ్యాపారులు కూడా దారికి వస్తున్నారు. ముంబైలో ఎంతో పేరున్న వడా పావ్‌ను పేపర్లలో చుట్టి అమ్మడాన్ని పూర్తిగా నిషేధించారు. హానికరమైన కృత్రిమ రంగుల స్థానంలో సహజమైన మిరప పొడిని వాడడం మొదలుపెట్టారు. వంట నూనెను రోజులో 3 సార్లు మార్చాలని, సిబ్బంది గ్లోవ్స్, హెడ్ క్యాప్‌లు ధరించాలని నిబంధనలు పెట్టారు. ఈ చర్యలతో ప్రజల నుంచి తీవ్రమైన స్పందన వస్తోంది. ఏళ్లుగా అంతులేని ఆగ్రహానికి ముండే రూపంలో పరిష్కారం దొరుకుతోందని వినియోగదారులు భావిస్తున్నారు.

లూజ్ ఆయిల్ విక్రయాలపై ఉక్కుపాదం
ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ డ్రైవ్ లూజ్ ఎడిబుల్ ఆయిల్ విక్రయాలపైకి పాకింది. పాత కాలం నాటి వ్యాపారులు, చిన్న రిటైలర్లు దీనిపై ఆందోళన చెందుతున్నారు. 2011 నాటి ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారమే విక్రయాలు జరగాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. నేరుగా వినియోగదారులకు అమ్మే నూనె సీల్ చేసిన, లేబుల్ ఉన్న ప్యాకింగ్‌లోనే ఉండాలి. డ్రమ్ములు, క్యాన్లు, ట్యాంకుల నుంచి నేరుగా కస్టమర్లు తెచ్చిన డబ్బాల్లో పోయడాన్ని నిలిపివేశారు. దీనివల్ల నూనె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

కల్తీకి చెక్ పెట్టేలా నిబంధనలు
లూజ్ ఆయిల్ విక్రయాల వల్ల తయారీదారు వివరాలు, బ్యాచ్ నంబర్, తేదీ వంటి సమాచారం లభించడం లేదు. దీనివల్ల కల్తీ విపరీతంగా పెరిగిపోతోంది. నాణ్యత లేని నూనె కలపడం లేదా వేరే నూనెగా అమ్మి మోసం చేయడం జరుగుతోంది. గాలి, వేడి, కాంతి తగలడం వల్ల నూనె పాడైపోయే ప్రమాదం ఉంది. మురికిగా ఉన్న డబ్బాలు వాడడం వల్ల దుమ్ము, నీరు, పురుగులు, రసాయన అవశేషాలు కలుస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్యాకింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. సంప్రదాయ వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *