- కొత్త విధానం పేరుతో వింత ప్రయోగం
- ఈసారి భారీగా మొక్కజొన్నల నిల్వలు
- నష్టంలో మార్క్ ఫెడ్… కొత్త చిక్కులు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విధానం మారింది
మార్క్‌ఫెడ్ యాసంగి మక్కల విక్రయానికి కొత్త బాట పట్టింది. ఇప్పటివరకు ఉన్న పద్ధతులకు స్వస్తి చెప్పింది. 14,70,382 మెట్రిక్ టన్నుల మక్కలను విక్రయించేందుకు ఈ-టెండర్లను ఆహ్వానించింది. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే కనీస ధర లేదా బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం నిర్వహించడం. గతంలో గోదాముల వారీగా టెండర్లు పిలిచే వారు. ధరలు రాకపోతే టూ-బిడ్ విధానం అనుసరించే వారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
మూడు విడతల వేలం
భారీ నిల్వలను విక్రయించేందుకు మార్క్‌ఫెడ్ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మక్కలను మూడు విడతలుగా విభజించారు. మొదటి విడతలో 3,81,000 టన్నులను 30 లాట్లుగా నిర్ణయించారు. రెండో విడతలో 6,05,000 టన్నులను 20 లాట్లుగా, మూడో విడతలో 4,82,000 టన్నులను 16 లాట్లుగా వేలం వేయనున్నారు. జూన్ 15, 16, 17 తేదీల్లో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుంది. బిడ్డర్లు ఎమ్మెస్పీ విలువలో 1 శాతం ఈఎండీ కట్టాలి. విజేతలు 15 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి నెల రోజుల్లోనే మక్కలను తరలించాల్సి ఉంటుంది.
వానాకాలం లెక్కలివే
వానాకాలం సీజన్‌కు చెందిన 3,80,000 టన్నుల మక్కల విక్రయంపై ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. దీని ద్వారా రూ.202.56 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో టన్నుకు రూ.14,000 నుంచి రూ.14,355 మాత్రమే వచ్చింది. ఆ టెండర్లను రద్దు చేసి కొత్త విధానాన్ని అమలు చేశారు. దేశవ్యాప్తంగా వ్యాపారులను రప్పించేలా నిబంధనలు సరళీకరించారు. గోదాములను భౌగోళిక ప్రాతిపదికన 25 లాట్లుగా విభజించారు.
ఆదాయం పెరిగిందంటూ గొప్పలు…
మే 29న జరిగిన ఈ-వేలంలో తీవ్ర పోటీ నెలకొంది. టన్నుకు సగటున రూ.19,337 ధర పలికింది. పాత టెండర్లతో పోలిస్తే ఇది టన్నుకు రూ.5,327 అధికం. పాత పద్ధతిలో అయితే మొత్తం ఆదాయం రూ.532 కోట్లకే పరిమితమయ్యేది. కానీ కొత్త విధానంతో రూ.735 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు లెక్కలు చూపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.202 కోట్లకు పైగా అదనపు ప్రయోజనం దక్కిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అసలు నష్టం ఎంత?
అధికారులు చెబుతున్న ఆదాయం ఒక ఎత్తు అయితే అసలు ఖర్చుల లెక్క మరొక ఎత్తు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, గోదాముల అద్దె, నిర్వహణ ఖర్చులు అన్నీ కలిపి టన్నుకు రూ.29,272 ఖర్చయినట్లు సమాచారం. కానీ విక్రయ ధర టన్నుకు రూ.19,337 మాత్రమే. అంటే ఒక్క వానాకాలం మక్కల సేకరణలోనే సుమారు రూ. 400 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కన్నా నష్టమే అధికంగా కనిపిస్తోంది.
ఆదాయానికి, ఖర్చులకు మధ్య వ్యత్యాసం
యాసంగి మక్కల విక్రయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. భారీ నిల్వలు ఉండటంతో వేలంలో ధర ఎలా ఉంటుందనేది కీలకం. గత వానాకాలం అమ్మకాల్లో వచ్చిన నష్టాన్ని ఈ వేలంతోనైనా భర్తీ చేసుకోగలరా? లేదా నష్ట భారం మరింత పెరుగుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వం చెబుతున్న ఆదాయానికి, ఎదుర్కొంటున్న ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రశ్నార్థకంగా మిగిలింది.