- పక్క దేశాల బాటలో ఇండియన్ యువత
- పాలకుల పీఠం కదిలిస్తోన్న ఉద్యమం
- బొద్దింకల జనతా పార్టీ రచ్చతో దేశవ్యాప్త చర్చ
- వ్యవస్థపై దాడి… నిరుద్యోగంపై యుద్ధం
సహనం వందే, హైదరాబాద్:
నేపాల్, శ్రీలంక దేశాల్లో పాలకులను గడగడలాడించిన యువ ఉద్యమాలు ఇప్పుడు భారత్‌కు పాకాయి. నిన్నటి వరకు ఆన్‌లైన్ జోక్ అని కొట్టిపారేసిన బొద్దింకల జనతా పార్టీ ఇప్పుడు అధికార పీఠాన్ని కదిలిస్తోంది. పొరుగు దేశాల్లో జరిగినట్లుగానే వ్యవస్థపై విసిగిన జెన్ జెడ్, మిలీనియల్స్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో విప్లవానికి నాంది పలికారు. పాలకుల అహంకారానికి, యువత ఆవేశానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి.
చరిత్ర పునరావృతం అవుతుందా?
నేపాల్, శ్రీలంకల్లో యువత చేపట్టిన ఉద్యమాలు అక్కడ ప్రభుత్వాలను కూల్చివేశాయి. అదే స్థాయిలో భారత యువత ఇప్పుడు పాలకులను గజగజలాడిస్తోంది. నిరుద్యోగులను పరాన్నజీవులతో, బొద్దింకలతో పోల్చిన అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు రగిల్చిన సెగ ఇప్పుడు ఉద్యమంగా మారింది. అభిజీత్ దిప్కే నాయకత్వంలో వేలాది మంది రోడ్డెక్కారు. ఇది కేవలం నిరసన కాదు… రాబోయే రాజకీయ మార్పునకు సంకేతం అని యువత బలంగా నమ్ముతోంది.
సోషల్ మీడియాలో ప్రభంజనం
కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ పార్టీ అద్భుతం చేసింది. అమెరికాలో ఉన్న దిప్కే డిజిటల్ వేదికగా విసిరిన చిన్న పిలుపు కోట్ల మందిని ఏకం చేసింది. ఇన్ స్టాగ్రామ్‌లో 2 కోట్ల 20 లక్షల మంది ఫాలోవర్లతో భారత అధికార పార్టీని వెనక్కి నెట్టింది. ఎక్స్ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసినా ఈ ఉద్యమం ఆగలేదు. ఆన్‌లైన్ మీమ్స్ నుండి రోడ్లపైకి చేరిన ఈ పోరాటం ఇప్పుడు అధికార పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారింది.
నిరుద్యోగంతో కుదేలైన తరం
దేశంలోని విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. 25 ఏళ్ల లోపు పట్టభద్రులలో 40 శాతం మందికి ఉపాధి లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని యువత వాపోతోంది. సిస్టమ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు… అందుకే మేమే పార్టీ పెట్టుకున్నాం అనే నినాదం ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. చదువుకున్నా ప్రయోజనం లేని ఈ వ్యవస్థపై యువత గుర్రుగా ఉంది.
పరీక్షల పేరుతో దోపిడీ…
దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 1 లక్ష 30 వేల మెడికల్ సీట్ల కోసం 20 లక్షల మంది పోటీ పడుతున్నారు. పేపర్ లీకేజీల పుణ్యమా అని పరీక్షల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు ట్యూషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు చేసే అప్పులు వ్యవస్థలోని కుళ్లిపోయిన స్థితికి నిదర్శనం. వరుసగా లీక్ అవుతున్న వైద్య ప్రవేశ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి.
మంత్రి రాజీనామాకు డిమాండ్
అస్తవ్యస్త విద్యాశాఖకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో గుమిగూడిన యువత చేతుల్లో భారత రాజ్యాంగ ప్రతులతో ప్రశాంతంగా నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించినా వెనక్కి తగ్గేది లేదని యువత తేల్చి చెప్పారు. తాము బొద్దింకలం కాదు… భవిష్యత్తును నిర్ణయించే శక్తి అని చాటి చెప్పారు.
మార్పు దిశగా పయనం
ఈ ఉద్యమం ఒక డేవిడ్, గోలియత్ యుద్ధం వంటిదని నిరసనకారులకు తెలుసు. అధికార, మీడియా వ్యవస్థలపై పట్టున్న పాలకులను ఎదుర్కోవడం కష్టమని తెలిసినా పోరాటానికి సిద్ధమని దిప్కే ప్రకటించారు. జోక్ లా మొదలైన ఈ ప్రయాణం ఒక విప్లవంగా మారుతోంది. పక్క దేశాల బాటలోనే భారత యువత తన భవిష్యత్తును రాసుకునేందుకు సిద్ధమైంది. ఈ రాజకీయ చదరంగంలో బొద్దింకల జనతా పార్టీ వేసే అడుగులు దేశ గతిని మారుస్తాయా అనేది వేచి చూడాలి.