లక్ష రూపాయల మందు బాటిల్ – తెలంగాణలో ఇదే ఖరీదైన డ్రింక్

Highest Liquor Costs in Telangana
  • రాష్ట్రంలో భారీగా పెరిగిన లిక్కర్ ధరలు

సహనం వందే, హైదరాబాద్:

మద్యం బాటిల్ ధర మహా అయితే ఎంత ఉంటుంది చెప్పండి? ఓ ఐదు వేలా, పది వేలా? బాబూ.. మీరు ఇంకా అక్కడే ఉన్నారా? కాస్త ఈ లోకంలోకి రండి. కేవలం ఒక్క బాటిల్ మందు ధర అక్షరాలా లక్షా పదహారు వేల రూపాయలు! వింటేనే గుండె గుభేల్ మంటోంది కదూ! దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విదేశీ మద్యం సవరించిన ధరల జాబితా చూస్తే ఇలాంటి షాకులు ఎన్నో తగులుతాయి. అసలు ఆ అత్యంత ఖరీదైన డ్రింక్ ఏంటి, మిగతా బ్రాండ్ల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.

డామ్ పెరిగ్నాన్ రోజ్ షాంపైన్ రికార్డు ధర…
తెలంగాణలో విదేశీ మద్యం బ్రాండ్ల సవరించిన ధరల జాబితా తాజాగా విడుదలైంది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ జాబితాలో స్కాచ్, సింగిల్ మాల్ట్, జపనీస్ విస్కీలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ వైన్లు, షాంపైన్ల కొత్త ధరలను ప్రకటించారు. ఇందులో కొన్ని బ్రాండ్ల ధరలు సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ జాబితా మొత్తంలో అన్నింటికంటే ప్రధానంగా హైలైట్ అవుతున్నది ‘డామ్ పెరిగ్నాన్ రోజ్ షాంపైన్’. 750 ఎంఎల్ పరిమాణం కలిగిన ఈ బాటిల్ డ్యూటీ పెయిడ్ ధర ఏకంగా 1,16,560 రూపాయలుగా నమోదైంది. దీంతో ఇది తెలంగాణ మార్కెట్లో అత్యంత ఖరీదైన డ్రింక్‌గా రికార్డు సృష్టించింది.

గ్లెన్‌మొరాంజీ సిగ్నెట్ విస్కీ ధర 50,660
ఇక గ్లెన్‌మొరాంజీ బ్రాండ్‌లోనే అత్యంత ఖరీదైన ‘గ్లెన్‌మొరాంజీ సిగ్నెట్’ హైల్యాండ్ సింగిల్ మాల్ట్ విస్కీ ధర రూ. 50,660గా ఉంది. అలాగే మోయెట్ అండ్ చాండన్ ఐస్ షాంపైన్ ధర రూ. 18,870 ఉండగా, బ్రూట్ ఇంపీరియల్ షాంపైన్ రూ. 14,270గా ప్రకటించారు. అంతేకాదు, ఇతర ప్రీమియం విస్కీల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రముఖ గ్లెన్‌మొరాంజీ 18 ఏళ్ల హైల్యాండ్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ ధర రూ. 27,270 కాగా, రాయల్ సెల్యూట్ 21 ఏళ్ల విస్కీ ధర రూ. 27,220 ఉంది. ఇక చీవాస్ రీగల్ 12 ఇయర్స్ విస్కీ రూ. 4,940 ఉండగా, 18 ఏళ్ల వెర్షన్ ధర రూ. 10,540 గా ఉంది.

హిబికి జపనీస్ హార్మొనీ…
జపనీస్ విస్కీల విషయానికి వస్తే, హిబికి జపనీస్ హార్మొనీ, యమజాకి డిస్టిలర్స్ రిజర్వ్ సింగిల్ మాల్ట్ విస్కీలు రెండూ కూడా దాదాపు రూ. 17,400 నుండి రూ. 17,450 వరకు ధర కలిగి ఉన్నాయి. జపాన్‌ నుంచి దిగుమతి అయ్యే ఈ ప్రత్యేకమైన బ్రాండ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ రేట్లు ఫిక్స్ చేశారు. మరికొన్ని ప్రముఖ బ్రాండ్లను పరిశీలిస్తే, గ్లెన్‌ఫిడిచ్ 12 ఏళ్ల సింగిల్ మాల్ట్ రూ. 7,910 కాగా, 15 ఏళ్ల బాటిల్ ధర రూ. 10,510 ఉంది. అలాగే గ్లెన్ గ్రాంట్ 18 ఇయర్స్ సింగిల్ మాల్ట్ ధర రూ. 13,420 గా నిర్ణయించారు. లగ్జరీ డ్రింక్స్ ప్రియులను టార్గెట్ చేస్తూ ఈ ధరలను సవరించినట్లు స్పష్టమవుతోంది. రష్యన్ బెలుగా నోబుల్ వోడ్కా ధర రూ. 5,810 ఉండగా, గ్రే గూస్ వోడ్కా రూ. 5,050 గా ఉంది. అలాగే రోకు జిన్ ధర రూ. 7,620గా పేర్కొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *