- వైఎస్సార్సీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ
- ఎంపీటీసీల్లోనూ స్పష్టమైన ఆధిక్యత
- క్షేత్రస్థాయిలో మారిన రాజకీయ సమీకరణాలు
- అధికార పక్షం దూకుడుతో చప్పబడిన ఫ్యాన్
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పోరులో అధికార కూటమి ఊహించని రీతిలో సత్తా చాటింది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ ఫలితాలు మింగుడుపడడం లేదు. గ్రామస్థాయిలో జరిగిన ఈ ఎన్నికల పోరులో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారనే విషయం వెల్లడవుతోంది.
జడ్పీటీసీ బరిలో కూటమి క్లీన్‌స్వీప్
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు అక్షరాలా సునామీ సృష్టించాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా, ప్రత్యర్థి పార్టీల నుంచి స్పందన కొరవడింది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడేసరికి కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తగా, ప్రతిపక్ష శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకుంది.
వైఎస్సార్సీపీకి షాకిచ్చిన ఓటర్లు…
ఈ జడ్పీటీసీ పోరులో కూటమి అభ్యర్థులు ఏకంగా 499 స్థానాలను కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఇందులో ఒక్క తెలుగుదేశం పార్టీయే 406 స్థానాలను దక్కించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 73 స్థానాల్లో ఘన విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ 20 స్థానాల్లో గెలుపొందింది. దీనితో అధికార కూటమి కూటమి బలమేంటో మరోసారి క్షేత్రస్థాయిలో రుజువైంది. మరోవైపు వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో కేవలం 76 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే జోరు
కేవలం జడ్పీటీసీలకే పరిమితం కాకుండా, అత్యంత విస్తృతమైన 7,768 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లోనూ ఇదే దూకుడు కొనసాగింది. గ్రామస్థాయి నాయకత్వాన్ని నిర్ధారించే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రికార్డు స్థాయి విజయాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలన్ని కలిసి ఏకంగా 5,861 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 4,806 స్థానాలను సాధించి తన సత్తా చాటగా, జనసేన 938 స్థానాలను గెలుచుకుంది. అలాగే బీజేపీ సైతం 117 స్థానాలను దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది.
ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే
ఈ ఎంపీటీసీ ఎన్నికల బరిలో దిగిన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ కేవలం 1,711 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల స్థాయిలో ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేసింది. కేవలం ప్రధాన పార్టీలే కాకుండా, ఇతర రాజకీయ పక్షాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ పోరులో సీపీఎం 15 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి.
గ్రామాల్లో ప్రజలు ఎవరి వైపు?
ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ గతిని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేదానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓటర్లు కూటమి పాలనపై ఉంచిన నమ్మకం ఈ ఫలితాల ద్వారా మరోసారి బయటపడింది. ప్రతిపక్ష పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ కాగా, అధికార కూటమికి ఇది మరింత బాధ్యతను పెంచే పరిణామం. రానున్న రోజుల్లో స్థానిక అభివృద్ధికి ఈ ఫలితాలు ఎలాంటి మలుపులు తెస్తాయో వేచి చూడాలి.