డల్లాస్ రియల్ ఎస్టేట్ ఖల్లాస్ – టెక్ బూమ్ కుప్పకూలిన వేళ

Dollas Real Estate
  • ఆకాశాన్ని అంటిన ఇళ్ల ధరలు
  • భారీ వడ్డీల ఊబిలో సామాన్యుడు
  • అనేకమంది తెలుగు సాఫ్ట్ వేర్ల ఆవేదన

సహనం వందే, డల్లాస్:

అమెరికాలోని డల్లాస్ నగరం ఒకప్పుడు టెక్ కలలకు చిరునామాగా వెలిగింది. భారతీయుల పాలిట స్వర్గధామంలా కనిపించిన ఆ నగరం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా బస్ట్ అవ్వడంతో వేలమంది పెట్టుబడిదారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీధిన పడే పరిస్థితి తలెత్తింది. ఈ నగరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరికలా నిలుస్తోంది.

ఆకాశాన్ని తాకిన ధరలు
డల్లాస్ నగరం ఒకానొక దశలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు బాతుగా మారింది. టెక్ కంపెనీలు క్యూ కట్టడంతో ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. దీంతో ఇళ్ల ధరలు అసాధారణంగా పెరిగాయి. భారతీయ టెక్కీలు తాము పని చేసే చోటే ఇళ్లు ఉండాలని ఆశపడ్డారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు లక్షల రూపాయల అప్పులు చేసి మరీ ఆస్తులు కొనుగోలు చేశారు. మార్కెట్ పెరుగుతుందని నమ్మిన వారంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

ఉద్యోగాల కోతతో మొదలైన కష్టం
టెక్ రంగంలో ఊహించని విధంగా లేఆఫ్స్ మొదలయ్యాయి. దీనివల్ల వేలాదిమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒక్కసారిగా ఆదాయాన్ని కోల్పోయారు. చేతిలో ఉద్యోగం లేక, భారీగా పెరిగిన హోమ్ లోన్ల వాయిదాలు చెల్లించలేక వారు నలిగిపోతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగానికి పవర్ కట్ అయితే రియల్ ఎస్టేట్ వ్యవస్థ కరెంట్ పోయినట్టు తయారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాత్ర
ఈ దుస్థితికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లను పెంచడంతో హోమ్ లోన్లు సామాన్యుడికి భారంగా మారాయి. బిల్డర్లు, ప్లానింగ్ కమిషన్లు ఒకేసారి మార్కెట్లోకి భారీగా ఇళ్లను వదిలారు. దీనివల్ల డిమాండ్ కంటే సప్లై పెరిగిపోయింది. ప్రస్తుతం ఇల్లు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారు కొనేవారు లేక అల్లాడిపోతున్నారు.

ఈఎంఐల భారం పెరిగింది
ఇళ్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. వడ్డీ రేట్ల పెంపు వల్ల నెలకు చెల్లించే ఈఎంఐలు సుమారు లక్షల రూపాయలకు చేరుకున్నాయి. ఉద్యోగం కోల్పోయిన టెక్కీలు ఇంటిని అమ్మేద్దామని చూసినా కొనేవారు లేరు. లాభాలు పక్కన పెడితే కనీసం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం కూడా ఇప్పుడు అసాధ్యంగా మారింది. కొన్న ఇళ్లే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్న ఉరితాడులా మారాయి.

రిమోట్ వర్క్ సంస్కృతి ప్రభావం
డల్లాస్ వంటి నగరాల్లో స్థిరపడాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. రిమోట్ వర్క్ సంస్కృతి పెరగడంతో ఆఫీసులకు దగ్గరగా ఇళ్లు ఉండాలన్న పాత పద్ధతికి కాలం చెల్లింది. టెక్నాలజీ మారుతుండటంతో డల్లాస్ ఆకర్షణ క్రమంగా తగ్గుతోంది. భవిష్యత్తులో నగరాల నిర్మాణ శైలి కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం డల్లాస్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ నగరాలకు ఒక పాఠం.

భవిష్యత్తుపై అస్పష్టత
స్థానిక ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్ర స్తబ్దతలో ఉంది. పొదుపు చేయడమే ఇప్పుడు ప్రజల ముందున్న ఏకైక మార్గం. మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ఇది కేవలం తాత్కాలిక దశ అని ఎకనామిస్టులు అంటున్నా, పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో తెలియదు. ఆర్థిక ప్రణాళికలో ప్లాన్ బి లేకపోతే ఇలాగే ఉంటుందని డల్లాస్ ఘటన నిరూపిస్తోంది. అతి ఆశ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా కుప్పకూలుస్తుందో డల్లాస్ ఉదాహరణే చెబుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *