- ప్యాకేజీ వెనుక అసలు రహస్యం
- ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక నిజాలు
- చిన్న అక్షరాల్లో డిస్క్లైమర్ వెనుక వాస్తవాలు
- ఏఐ చిత్రాలతో వినియోగదారులకు భ్రమలు
- వంట లేదు… ప్రాసెస్డ్ ఫుడ్ తో అనారోగ్యం
- సాంప్రదాయ ఆహారమే నిజమైన రీసెట్
సహనం వందే, హైదరాబాద్:
తింటూనే డైటింగ్ ఉండొచ్చు, కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గిపోవచ్చంటూ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోతున్నారా? ఒక కార్పొరేట్ సంస్థ తెచ్చిన ఈ మెటాబోలిక్ రీసెట్ కిట్ మెరిసే ప్రకటనలు ఒకెత్తయితే, ఆ పేపర్ ప్రకటన అడుగున దాచిన డిస్క్లైమర్ మరో ఎత్తు. ఆ చిన్న అక్షరాల వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిస్తే మీరు ఖంగు తినడం ఖాయం. ఆ ప్రకటనలోని ప్రతీ అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ కిట్ ప్రకటనలో ఫాస్టింగ్ ఇంజనీర్డ్ అని చాలా ఆకర్షణీయంగా రాశారు.
కంపెనీ స్వయంగా ఒప్పేసుకున్న ప్రమాదాలు…
సోమవారం ఒక ఇంగ్లీష్ పేపర్ లో మొదటి పేజీలో జాకెట్ యాడ్ ఇచ్చారు. మెటాబోలిక్ రీసెట్ కిట్ అనేది యాడ్. ఐదు రోజులు కడుపు నిండా తింటూనే ఫలితం వస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు. పేపర్ కింద భాగంలో చిన్న అక్షరాలతో ఉన్న డిస్క్లైమర్ లో ఇది కేవలం స్వల్పకాలిక క్యాలరీ నియంత్రణ ప్రోగ్రామ్ మాత్రమేనని స్పష్టం చేశారు. అంతే తప్ప అందరికీ ఇది సరిపోదని, ప్రతీ ఒక్కరికీ ఇది సురక్షితం కాదని స్వయంగా కంపెనీయే ఒప్పుకుంది. మీ శరీరం ఎలాంటిదో తెలుసుకోకుండా గుడ్డిగా ఈ బాక్స్ కొంటే ఆరోగ్యానికి ప్రమాదమే అని వారే పరోక్షంగా చెప్తున్నారు. ఇది సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని కూడా రాశారు. రోజువారీ సహజ సిద్ధమైన ఇంటి వంట, కూరగాయలు, పప్పు ధాన్యాలకు ఈ ప్రాసెస్ చేసిన ప్యాకెట్లు ప్రత్యామ్నాయం కావు.
కృత్రిమ చిత్రాలు… హెచ్చరికలు
ఈ ప్రకటనలోని ఫోటోలు చూసి నోరూరించుకునే వారికి మరొక షాకింగ్ నిజం ఉంది. అందులో ఉన్న ఆహార చిత్రాలన్నీ కేవలం ఏఐ ఉపయోగించి సృష్టించిన విజువల్స్ మాత్రమే. అల్పాహార బాక్స్ లో ఉండే అసలు పదార్థాలు ఆ ఫోటోల్లో ఉన్నట్లుగా ఉండవు. ప్రకటన పైన న్యూట్రిషనిస్టులు లెక్కింపులు చేసి ఈ ప్యాకెట్లు తయారు చేశారని గొప్పలు చెప్పుకున్నా, కొనే ముందు తగిన నిబంధనలు చదువుకోవాలని కింద రాశారు. అంటే ఈ ప్యాకెట్లు తిన్నాక ఏమైనా తేడా కొడితే కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదనేది వారి ముందస్తు జాగ్రత్త చర్య.
రోజుకు కేవలం 950 క్యాలరీలు…
ఈ కిట్ లో రోజుకి ఐదుసార్లు తినడానికి పొరిడ్జెస్, న్యూట్రిషన్ బార్లు, స్నాక్ ప్యాక్స్, ఎలక్ట్రోలైట్లు, మల్టీ విటమిన్లు ఇస్తారు. అయితే దీని ద్వారా రోజుకు కేవలం 950 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. పేరుకే ఐదుసార్లు తింటున్నా, ఇచ్చేది అరకొర తిండి మాత్రమే. ఏమీ వండాల్సిన పనిలేదని, తూకాలు వేయాల్సిన పనిలేదని రంగుల కలలు చూపిస్తున్నప్పటికీ, సహజ సిద్ధమైన ఆహారాన్ని పక్కనబెట్టి రోజులు తరబడి నిల్వ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? తాజా ఆహారాన్ని నిల్వ ఉన్న ఆహారంతో రీప్లేస్ చేయడం క్షేమం కానే కాదు.
తాత్కాలిక బరువు తగ్గింపు మాయ…
సమయానికి ఇన్ని గ్రాముల ఆహారమే తినాలని డిజైన్ చేసిన ఈ కిట్ తో తాత్కాలికంగా బరువు తగ్గవచ్చేమో కానీ, అది శాశ్వత పరిష్కారం కాదు. ఈ ఐదు రోజుల కిట్ ముగియగానే మళ్ళీ సాధారణ ఆహారం తింటే బరువు పాత స్థితికి వచ్చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో కష్టపడకుండా, వ్యాయామం చేయకుండా, వంట వండకుండా చౌకబారు దారుల్లో బరువు తగ్గాలనుకునే బలహీనతలను ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. కేవలం కలర్ ఫుల్ బాక్సులు చూసి వేల రూపాయల ప్రాసెస్డ్ ఫుడ్ కొనుగోలు చేయడం సహేతుకం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సహజ ఆహారమే శ్రీరామ రక్ష…
మార్కెట్లో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండుకునే పౌష్టికాహారం, సరైన వ్యాయామం మాత్రమే శరీరానికి నిజమైన మెటాబోలిక్ రీసెట్ ఇస్తాయి. ఏఐ చిత్రాలతో, రంగురంగుల ప్యాకింగ్ లతో, చిన్న డిస్క్లైమర్ల వెనుక దాక్కునే ఇలాంటి తాత్కాలిక డబ్బా ఆహారాలను నమ్మడం కంటే మన సాంప్రదాయ ఆహారపు అలవాట్లను నమ్మడమే శ్రేయస్కరం. పెద్ద పెద్ద ప్రకటనలతో మార్కెట్లోకి వచ్చే ఇలాంటి కిట్ల వెనుక ఉన్న వ్యాపార కోణాన్ని, చిన్న అక్షరాల్లో ఉండే డిస్క్లైమర్లను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.