- అక్రమంగా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని వేధింపు
- ఇంటర్న్‌షిప్‌కు అడ్డంకులు..విద్యార్థుల కన్నీళ్లు
- కాలేజీల ఆగడాలు… తల్లిదండ్రుల నిరసనల
- కాళోజీ నారాయణరావు వర్సిటీలో ధర్నా
సహనం వందే, వరంగల్:
వైద్య విద్య ముసుగులో ప్రైవేటు కాలేజీలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదువుల పేరుతో సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు మౌనం వీడాల్సి ఉంది. అక్రమ వసూళ్లతో విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న యాజమాన్యాల అసలు రంగు బయటపడింది.
నిబంధనలకు తూట్లు…
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. ఈ కాలానికి మాత్రమే ఫీజు వసూలు చేయాలి. కానీ కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. ఐదో ఏడాదికి కూడా బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రతిమ కాలేజీ దందా
ప్రతిమ మెడికల్ కాలేజీలో కార్తీక్ రెడ్డి 2021 బ్యాచ్ విద్యార్థి. తండ్రి పి. శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే 4.5 ఏళ్లకు 23.10 లక్షల రూపాయలు చెల్లించారు. పరీక్షల ముందు హాల్ టికెట్ కావాలంటే అదనంగా 11 లక్షల రూపాయల చెక్కు ఇవ్వాలని యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. చేసేదేమీ లేక విద్యార్థి 11 లక్షల రూపాయల చెక్కును ఇచ్చారు. యాజమాన్యం ఆ చెక్కును విద్యార్థి అనుమతి లేకుండానే జమ చేసింది. చెక్కు బౌన్స్ కేసును విద్యార్థిపైనే నమోదు చేసి వేధిస్తోంది.
కరీంనగర్ చల్మెడలో అక్రమాలు
కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, ప్రతిమ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. ముత్యాల వెంకటేశం, దారా రాఘవ రావు, ఎం.చంద్రశేఖర్ రెడ్డి, మేకల గంగా ప్రసాద్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అకేపోగు శామ్యూల్ ప్రభాకర్ అనే తల్లిదండ్రులు ఇప్పటికే నాలుగున్నర ఏళ్లకు సంబంధించి పూర్తి ఫీజు చెల్లించారు. అయినప్పటికీ కళాశాలలు అదనపు ఫీజు కట్టాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
ఇంటర్న్‌షిప్‌పై నీలినీడలు
ఫీజు చెల్లించని విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు అనుమతించడం లేదు. 11 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అనుమతిస్తామని యాజమాన్యం కండిషన్ పెట్టింది. విద్యార్థులను క్లాసులకు కూడా రానివ్వడం లేదు. కెరీర్‌కు పునాది అయిన ఇంటర్న్‌షిప్‌ను అడ్డుకోవడం దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాళోజీ వర్సిటీకి మొర…
ఈ అన్యాయంపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్య నారాయణచారి ఆధ్వర్యంలో బాధితులు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, రావుల మధు, యాదగిరి, మురళి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్సిటీ అధికారులు రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
కఠిన చర్యల కోసం డిమాండ్
ఫీజుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని వెంటనే ఇంటర్న్‌షిప్‌లో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. వందల కోట్ల భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్న ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. లేదంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.