- పాన్ ఇండియా తెలుగు స్టార్లలో టెన్షన్
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కలకలం
- భద్రతా ఆందోళనలో టాలీవుడ్ సినీ పరిశ్రమ
సహనం వందే, హైదరాబాద్:
ముంబై నగరంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనతో ఇప్పుడు యావత్ భారతీయ సినీ పరిశ్రమ గజగజ వణికిపోతోంది. ముంబైలోని జుహు ప్రాంతంలో యాక్షన్ హీరో వాహనాన్ని టార్గెట్ చేస్తూ బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారినే కాకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగే ప్రతి ఒక్కరినీ బెదిరించేలా ఈ ముఠా తన పరిధిని విస్తరిస్తోంది.

టాలీవుడ్ స్టార్స్ భద్రతా ఆందోళనలు
ఈ పరిణామాలు కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బాహుబలి, పుష్ప, వారణాసి లాంటి సినిమాలతో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్న మన హీరోలు, నిర్మాతలు కూడా భద్రతా ఆందోళనలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. మన పాన్ ఇండియా స్టార్లకు కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది
సోషల్ మీడియాలో బెదిరింపుల ముఠాలు
గతంలో కేవలం ముంబై అండర్‌వరల్డ్ డాన్లు మాత్రమే సినీ పరిశ్రమను కంట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు సరిహద్దులు దాటి గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌లు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. 90ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల అండర్‌వరల్డ్ సంస్కృతి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో సోషల్ మీడియా ముఠాలు తెరపైకి వస్తుండటం పట్ల ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
షూటింగ్ లొకేషన్లలో భారీ సెక్యూరిటీ
ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించే పాన్ ఇండియా స్టార్స్ షూటింగ్స్ సమయంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కేవలం సెట్స్‌పైనే కాకుండా ప్రైవేట్ లైఫ్‌లో కూడా పర్సనల్ బాడీగార్డ్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. సినిమా షూటింగ్ లొకేషన్లు ఎక్కడో రిమోట్ ఏరియాలలో లేదా విదేశాల్లో ఉన్నప్పటికీ, వారి భద్రతపై ఇప్పుడు మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. హీరోలతో పాటు పెద్ద నిర్మాణ సంస్థలు, ఫైనాన్షియర్లు కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు.
సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్
టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ ప్రభుత్వాలను హెచ్చరించింది. సెలబ్రిటీల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో యంత్రాంగాలు మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కూడా భద్రత కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ రక్షణను కోరాల్సి వస్తుంది.
అప్రమత్తత అవసరం… ప్రభుత్వాల బాధ్యత
తెలుగు హీరోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరిస్తున్న తరుణంలో, ఇలాంటి నేర సామ్రాజ్యాల బెదిరింపులు వారి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ భయానక వాతావరణం సౌత్ వరకు రాకముందే మూలాలను గుర్తించి పోలీస్ యంత్రాంగం అణచివేయాలి. సినిమా రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి పెద్దపీట వేస్తుంది కాబట్టి దానికి పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.