- ప్రభుత్వ ధాన్యంలో తేడా వస్తే 25 శాతం జరిమానా
- పాత బకాయిలుంటే కేటాయింపుల నిలిపివేత
- అక్రమాలకు క్రిమినల్ కేసులు… మూడేళ్ల వరకు బ్లాక్‌లిస్ట్
- సీఎంఆర్ ఒప్పందాల్లో మార్పులు… ధాన్యానికి కాపలా
- పౌరసరఫరాల శాఖ 2026–27 సీఎంఆర్ నిబంధనలు
సహనం వందే, హైదరాబాద్:
ప్రభుత్వ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత దాని భద్రత, నిల్వలు, వినియోగంపై పూర్తి బాధ్యత మిల్లర్లదే. ధాన్యం నిల్వల్లో తేడా వచ్చినా, బియ్యం సరఫరాలో లోపాలున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ 2026–27 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కొత్త కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరేవరకు ప్రతి దశలో మిల్లర్ల బాధ్యతను నిర్దేశిస్తూ ఒప్పందంలో మార్పులు చేసింది. మిల్లులకు అప్పగించిన ధాన్యం, గన్నీ బ్యాగులు, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కే) అన్నింటినీ ప్రభుత్వ ఆస్తులుగానే పరిగణిస్తారు. సీఎంఆర్ సరఫరా పూర్తయ్యే వరకు వాటి భద్రత, నిల్వలు, వినియోగంపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తారు.
డిఫాల్టర్లకు ధాన్యం కేటాయింపులు కట్!
ధాన్యం కేటాయింపుల కోసం మిల్లర్లు ఆర్థిక భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లు ధాన్యం విలువలో 10 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలి. గతంలో డిఫాల్టర్లుగా మారి, ఆ తర్వాత బకాయిలు చెల్లించిన మిల్లర్లు మాత్రం 20 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. దీనికి తోడు ఆర్థికంగా బలమైన మరో ఇద్దరు మిల్లర్లు ష్యూరిటీ ఇవ్వడం తప్పనిసరి. పాత బకాయిలు ఇంకా చెల్లించని మిల్లర్లకు కొత్తగా ధాన్యం కేటాయించరు. ఈ నిబంధనలతో గత బకాయిలు ఉన్నవారికి కేటాయింపులు నిలిచిపోనుండగా, మిగతా మిల్లర్లు కూడా ధాన్యం పొందడానికి ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

కొనుగోలు కేంద్రం నుంచే బాధ్యత!
మిల్లర్ల బాధ్యత ధాన్యం మిల్లుకు చేరిన తర్వాతే మొదలుకాదు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసే సమయంలోనే వారు తమ ప్రతినిధులను ఉంచి, ధాన్యం నాణ్యతను పరిశీలించి స్వీకరించాలి. ప్రతినిధి లేకపోయినా ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదైన ధాన్యాన్ని మిల్లరు అంగీకరించినట్లుగానే పరిగణిస్తారు. ఆ తర్వాత తూకం లేదా నాణ్యతపై అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉండదు. ధాన్యం అందుకున్న మూడు రోజుల్లో పూర్తి వివరాలను అధికారులకు సమర్పించాలి. ప్రభుత్వం కేటాయించిన ఏడు రకాల సన్న ధాన్యాన్ని విడిగా నిల్వ చేసి, వాటితోనే సన్నబియ్యం తయారు చేయాలి. బాయిల్డ్ సీఎంఆర్‌లో 5 శాతం, రా సీఎంఆర్‌లో 10 శాతం బ్రోకెన్‌తో కూడిన ఇంప్రూవ్డ్ రైస్ సరఫరా చేయాలి. ఫోర్టిఫైడ్ బియ్యం తయారీలో ప్రతి 100 కిలోల సాధారణ బియ్యానికి ఒక కిలో ఎఫ్‌ఆర్‌కే కలపాలి. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రయోగశాలల్లో నాణ్యత పరీక్షలు చేయించుకోవాలి.
ధాన్యం మాయమైతే 25 శాతం జరిమానా!
ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో తేడా కనిపించినా, అప్పగించిన పరిమాణం కంటే తక్కువగా ఉన్నా మిల్లర్ల నుంచి మాయమైన ధాన్యం విలువను పూర్తిగా వసూలు చేస్తారు. దీనికి రికవరీ ఖర్చులు కూడా జతచేస్తారు. అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో పాటు వసూలు చేయాల్సిన మొత్తంపై ఏటా 12 శాతం వడ్డీ తీసుకుంటారు. ఈ విషయంలో మినహాయింపులు ఉండవని ఒప్పందం స్పష్టం చేస్తోంది. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద బకాయిలు వసూలు చేస్తారు. ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేట్ ధాన్యంతో లేదా వేర్వేరు సీజన్ల ధాన్యంతో కలపడం నిషేధం. ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర అవసరాలకు తరలించడం, విక్రయించడం, తాకట్టు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం–1955తో పాటు ఇతర క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. అవసరమైతే మిల్లుల్లోని నిల్వలను స్వాధీనం చేసుకుని మిల్లింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తారు.
తనిఖీల నుంచి బ్లాక్‌లిస్ట్ వరకు!
పౌరసరఫరాల శాఖ, జిల్లా యంత్రాంగం, ఎఫ్‌సీఐ అధికారులు ఎప్పుడైనా మిల్లుల్లో తనిఖీలు నిర్వహించవచ్చు. ప్రతి సోమవారం ధాన్యం స్వీకరణ, మిల్లింగ్, బియ్యం సరఫరా వివరాలను సేకరిస్తారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు గరిష్ఠంగా మూడేళ్ల వరకు బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు. ధాన్యం, బియ్యం, గన్నీ బ్యాగులు, ఎఫ్‌ఆర్‌కేలకు బీమా చేయించడం కూడా ప్రతి మిల్లర్‌కు తప్పనిసరి. అన్ని లెక్కలు పరిశీలించి ప్రభుత్వానికి నష్టం జరగలేదని నిర్ధారించిన తర్వాతే మిల్లింగ్ చార్జీల బిల్లులు విడుదల చేస్తారు. సీఎంఆర్ బకాయిలు పేరుకుపోకుండా, ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా చూడటమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ఒప్పందం 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.