అనామక పార్టీల వేల కోట్ల కుంభకోణం – విరాళాల ముసుగులో 1,869 కోట్ల దందా

Gujarat New Political Parties Money Scam
  • కేవలం మూడు పార్టీల అక్రమ వ్యవహారం
  • పెద్ద పెద్ద పార్టీలకే ఈ స్థాయి విరాళాలు లేవు
  • గుజరాత్ లో 15 మందిపై కేసులు నమోదు

సహనం వందే, గుజరాత్:

రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం, దానికి పన్ను మినహాయింపు పొందడం చట్టబద్ధంగా జరిగే విషయమే. కానీ అసలు ఓట్లే పడని అనామక రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకుని, ఏకంగా రూ. 1,869 కోట్ల నకిలీ చందాల దందా నడిపితే ఎలా ఉంటుంది? పైగా ప్రభుత్వ ఖజానాకు రూ. 560 కోట్ల పన్ను గండి కొడితే ఎలా ఉంటుంది? గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ విచిత్రమైన ఘరానా స్కామ్ గురించి తెలిస్తే మతిపోతుంది! అసలు ఈ చందా నాటకం ఎలా ఆడారో, షెల్ కంపెనీల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం.

ఐటీ శాఖ ఫిర్యాదు – సీఐడీ రంగ ప్రవేశం
గుజరాత్ రాష్ట్రంలో నమోదైన, గుర్తింపు లేని మూడు రాజకీయ పార్టీలపై సీఐడీ క్రైమ్ పోలీసులు సంచలన కేసులు నమోదు చేశారు. ఇన్ కమ్ టాక్స్ డిపార్త్‌మెంట్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ మూడు రాజకీయ పార్టీలు కేవలం పన్ను ఎగవేత దారుల కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాజకీయ పార్టీల పేరుతో నకిలీ విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని హవాలా మార్గాల్లో మళ్లీ దాతలకే తిరిగి ఇచ్చేవారు. ఈ మొత్తం వ్యవహారంలో చట్టవిరుద్ధంగా కోట్లాది రూపాయల పన్ను ఎగవేత జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది.

Gujarat New Political Parties Danda

కాగితాలకే పరిమితమైన మూడు పార్టీలు
ఈ కుంభకోణంలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు భాగమయ్యాయని ఇన్ కమ్ టాక్స్ దర్యాప్తులో తేలింది. అందులో మొదటిది ‘భారతీయ నేషనల్ జనతా దళ్’ కాగా, రెండోది ‘స్వతంత్రతా అభివ్యక్తి పార్టీ’, మూడోది ‘గరీబ్ కళ్యాణ్ పార్టీ’. ఈ మూడు పార్టీలు కలిసి సుమారు 1,869 కోట్ల రూపాయల విరాళాలను పొందినట్లు రికార్డుల్లో చూపించాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ. 560 కోట్ల ఆదాయ పన్ను నష్టం వాటిల్లిందని ఐటీ శాఖ లెక్కగట్టింది. ఈ పార్టీలన్నీ కేవలం కాగితాలకే పరిమితమై, ఆర్థిక అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

మాస్టర్‌మైండ్ హస్తం – వేల కోట్ల మోసం
ఈ మూడు పార్టీలలో అతిపెద్ద మోసానికి పాల్పడింది ‘భారతీయ నేషనల్ జనతా దళ్’ అని ఐటీ నివేదిక పేర్కొంది. ఈ ఒక్క పార్టీయే ఏకంగా 56,238 మంది దాతల నుంచి 1,143 కోట్ల రూపాయల విరాళాలు పొందినట్లు చూపించింది. దీని మూలంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు 343 కోట్ల వరకు పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లింది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సురేంద్రకుమార్ గజేరా ఈ కుంభకోణానికి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు.

మిగిలిన రెండు పార్టీల బాగోతం
ఇక మిగిలిన రెండు పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ‘స్వతంత్రతా అభివ్యక్తి పార్టీ’ ఖాతాల్లోకి 519 కోట్ల చందాలు రాగా, దీనివల్ల 155 కోట్ల పన్ను ఎగవేత జరిగింది. అలాగే ‘గరీబ్ కళ్యాణ్ పార్టీ’ పేరిట రూ. 206 కోట్ల విరాళాలు జమ చేసి, రూ. 62 కోట్ల మేరకు పన్ను ఎగ్గొట్టారు. ఈ వ్యవహారంలో పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా కీలక పాత్ర పోషించారని తేలింది.

షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లుల దందా
అసలు ఈ విరాళాల నాటకం వెనుక ఉన్న కుట్ర వెలుగు చూసింది. పెద్ద పెద్ద వ్యాపారులు లేదా దాతలు బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పార్టీలకు విరాళాల సొమ్మును జమ చేసేవారు. అలా జమ చేసిన సొమ్మును పొందినందుకు పార్టీల నుంచి అధికారిక రసీదులు కూడా పొందేవారు. ఆ రసీదులతో ఐటీ రిటర్న్స్‌లో ఆదాయ పన్ను మినహాయింపులు పొంది పన్ను కట్టకుండా తప్పించుకునేవారు. విరాళంగా వచ్చిన డబ్బును పార్టీలు కేవలం తమ వద్దే ఉంచుకోకుండా, జై రామ్ ఎంటర్‌ప్రైజెస్, కిసాన్ ఎంటర్‌ప్రైజెస్ వంటి షెల్ కంపెనీలకు మళ్లించేవి. ఆ కంపెనీల ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర సరుకులు కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించేవారు. ఆ బిల్లుల ఆధారంగా బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసేవారు. కాగితాలపై వ్యాపారం జరిగినట్లు చూపిస్తూ అసలు సొమ్మును నగదు రూపంలోకి మార్చేవారు.

కమీషన్లు, హవాలా దందా
ఈ విధంగా డ్రా చేసిన నగదు నుంచి పార్టీ నిర్వాహకులు, మధ్యవర్తులు 2 శాతం నుండి 10 శాతం వరకు కమీషన్‌గా తీసుకునేవారు. మిగిలిన 90 శాతానికి పైగా సొమ్మును హవాలా మార్గాల్లో లేదా ఏజెంట్ల ద్వారా మళ్లీ అసలు దాతలకే నగదు రూపంలో వెనక్కి ఇచ్చేసేవారు. అంటే దాతకు పన్ను మినహాయింపు లభించడమే కాకుండా కమీషన్ పోను తన సొంత డబ్బు నగదుగా తిరిగి చేతికి వచ్చేది. ఐటీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలకు సంబంధించిన అనేక బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి.

డిపాజిట్లు రాని అభ్యర్థులు
ఈ రాజకీయ పార్టీల అసలు రంగు వారు సాధించిన ఓట్ల శాతాన్ని చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఇవి 2017 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, ప్రతి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ‘భారతీయ నేషనల్ జనతా దళ్’ పార్టీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కేవలం 0.01 శాతం మాత్రమే. అమ్రేలి నియోజకవర్గంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు గజేరాకు వచ్చినవి కేవలం 322 ఓట్లు మాత్రమే. నిందితులపై మోసం, నేరపూరిత కుట్ర, నకిలీ పత్రాల సృష్టి వంటి తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పన్నులు ఎగ్గొట్టడానికి రాజకీయ పార్టీలనే ఒక వ్యాపార మార్గంగా మార్చుకోవడం నిజంగా విచారకరం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *