సినీ నిర్మాతగా 21 ఏళ్ల స్టూడెంట్ – పార్ట్ టైం ఉద్యోగాలు చేసి 60 లక్షల పెట్టుబడి

Hanuman Ansh Updates
  • మరో ఇద్దరు మహిళా నిర్మాతలతో ప్రయాణం
  • మొత్తం 2 కోట్ల పెట్టుబడి… 400 కోట్ల కలెక్షన్
  • నీమ్ కరోలి బాబా జీవిత కథతో అద్భుతం
  • బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ జోరు

సహనం వందే, హైదరాబాద్:

సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు, 200 కోట్లు… ఇలా వందల కోట్లు పెట్టి తీసినా కలెక్షన్లు రావడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో కేవలం ఒక కోటి 80 లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పెద్ద స్టార్స్, భారీ పబ్లిసిటీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించిన సంచలనం చూసి దిగ్గజాలే నోరెళ్లబెడుతున్నారు. అసలు ఈ సినిమా వెనుక ఉన్న ఆ ముగ్గురు మహిళలు ఎవరు? 1 కోటి 80 లక్షల పెట్టుబడి నుంచి 400 కోట్ల వసూళ్ల వరకు ఎలా చేరిందో తెలుసుకుందాం.

నీమ్ కరోలి బాబా జీవితమే కథాంశం…
విశాల్ చతుర్వేది రాసిన ‘డివైన్ డిటోర్: దట్ చేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం ఆధారంగా ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనే ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఇండియాలో సాగే ఈ కథలో… తల్లి మరణం తర్వాత లక్ష్మీ నారాయణ్ అనే యువకుడు ఇల్లు వదిలి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. ఉత్తర భారతదేశంలో అతను చేసిన పర్యటనలు, ఆ తర్వాత అతను ‘నీమ్ కరోలీ బాబా’గా ఎలా మారారనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఇందులో లక్ష్మీ నారాయణ్ శర్మ పాత్రలో శోభినావ్ సత్య నటించగా, చందన్ కె ఆనంద్, నిఖిల్ దూబే, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Hanuman Ansh

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర…
సాధారణంగా భక్తిరస చిత్రాలంటే తక్కువ బడ్జెట్, పరిమితమైన ఆడియన్స్ మాత్రమే ఉంటారనే అపోహ ఉంటుంది. కానీ కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ చిత్రం ఆ అపోహలన్నింటినీ తుత్తునియలు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా మేకింగ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రాగిణి సోనా, నమ్రతా జి. సింగ్, అనుప్రియ నాగర్ అనే వేర్వేరు తరాలకు చెందిన ముగ్గురు మహిళా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను నమ్మి ముందుకు వచ్చారు. ప్రచారంలో లేని వీరు ప్రతి ఒక్కరూ 60 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడిగా పెట్టారు.

నిర్మాతగా విద్యార్థి ప్రయాణం…
ఇందులో 21 ఏళ్ల అనుప్రియ నాగర్ ప్రయాణం మరింత ఆసక్తికరం. లండన్ బాత్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ డబ్బు దాచుకుంది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి ప్రముఖులకు నీమ్ కరోలి బాబాతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుని ఆకర్షితురాలైంది. ఇండియా తిరిగి వచ్చాక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఫండ్స్ కొరత ఉన్న సమయంలో తన సేవింగ్స్ 60 లక్షలను పెట్టుబడిగా పెట్టింది. ఇక మిగిలిన ఇద్దరు మహిళా నిర్మాతలు రాగిణి సోనా, నమ్రతా సింగ్‌లు షూటింగ్ ప్రారంభానికి ముందే పెట్టుబడి పెట్టారు. దర్శకుడు విశాల్ చతుర్వేది బడ్జెట్ దాటకుండా చాలా ప్లాన్డ్‌గా పనిచేశారు. మొదట 26 రోజుల్లో అనుకున్న షూటింగ్‌ను రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా సహజసిద్ధమైన లొకేషన్లలో కేవలం 22 రోజుల్లోనే ముగించారు.

‘వర్డ్ ఆఫ్ మౌత్’ ప్రచారం తిరుగులేని బలం…
అయితే ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. సినిమా పూర్తయ్యాక పెద్ద ఓటీటీ సంస్థలు దీనిని తిరస్కరించడంతో నిర్మాతలు ధైర్యం చేసి థియేటర్లలోనే విడుదల చేశారు. కానీ మొదటి రోజు కేవలం 10 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే రావడంతో అంతా నిరాశపడ్డారు. మొదటి వారంలో దాదాపు ఒక కోటి మాత్రమే రావడంతో థియేటర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. పాత షోల స్థానంలో వేరే సినిమాలు వచ్చాయి. కథ ముగిసిపోయిందనుకున్న సమయంలో అసలైన మ్యాజిక్ మొదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల ‘వర్డ్ ఆఫ్ మౌత్’ ప్రచారం తిరుగులేని బలాన్ని ఇచ్చి మూడో వారం నుంచి థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం ప్రారంభమైంది.

మూడో వారం నుండి కలెక్షన్ల సునామీ…
మూడో వారం నుండి ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి రోజుకు 7 నుంచి 8 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. 400 కోట్లు దాటేసి బడ్జెట్ కంటే 200 రెట్లకు పైగా లాభాలను రాబట్టింది. ఈ భారీ సక్సెస్ చూసి, మొదట తిరస్కరించిన ఓటీటీ సంస్థలే ఇప్పుడు డిజిటల్ హక్కుల కోసం కోట్లలో ఆఫర్లు ఇస్తున్నాయి. మరోవైపు భక్తి, ప్రేమ, నిస్వార్థ సేవ అనే అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఊహించని విజయంతో ఈ సినిమాను మూడు భాగాలుగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సహ నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. రాబోయే భాగాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద స్టార్స్, భారీ ప్రచారం కంటే ప్రేక్షకుల గుండెను తాకే కంటెంట్ ఉంటే విజయం ఎక్కడకీ పోదని ఈ సినిమా నిరూపించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *