- ఆ కంపెనీల తప్పుడు నిర్ణయాలకు మద్దతు
- వారేం చెప్తే అదే అమలు చేస్తున్న ఎల్ఐసీ
- ఇద్దరి ఆధీనంలోకి లక్షల కోట్ల రూపాయలు
- ఇతర కంపెనీలను దగ్గరకు రానీయని దుస్థితి
- సామాన్యుల పొదుపుతో కార్పొరేట్ జూదం!
సహనం వందే, న్యూఢిల్లీ:
కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు గుడ్డిగా ఆమోదం చెప్పడం సామాన్యుల డబ్బును కేవలం రెండు కార్పొరేట్ గ్రూపుల ప్రయోజనాల కోసం పణంగా పెట్టింది.
ఇతర కంపెనీలపై కత్తిగట్టిన ఎల్‌ఐసీ!
విమర్శకుల ఆరోపణలు మరింత తీవ్రంగా ఉన్నాయి. అదానీ, రిలయన్స్ కంపెనీల ప్రతిపాదనల్లో కొన్ని వివాదాస్పదంగా ఉన్నా, డైరెక్టర్ల అర్హతలు సరిగా లేకపోయినా ఎల్‌ఐసీ కళ్లు మూసుకుని ఆమోదించింది. ఉదాహరణకు ముఖేష్ అంబానీని రిలయన్స్ డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి మద్దతివ్వడం, అలాగే ఆడిటర్ అభ్యంతరం చెప్పినా అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆర్థిక పత్రాలను ఆమోదించడం వంటి నిర్ణయాలు రాజకీయ ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో కోరమండల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్ వంటి ఇతర కంపెనీలు ఇదే స్వభావం ఉన్న ప్రతిపాదనలు తెచ్చినప్పుడు మాత్రం ఎల్‌ఐసీ వాటిని తిరస్కరించింది. ఒకే నిబంధనల విషయంలో రెండు రకాల వైఖరి ఎందుకు? కోట్ల మంది ప్రజల పెట్టుబడిని రక్షించాల్సిన సంస్థ కేవలం రెండు గ్రూపుల సేవలో ఉండటం దేనికి సంకేతం?
సామాన్యుల పొదుపుతో కార్పొరేట్ జూదం!
ఎల్‌ఐసీ తన పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో సరైన పాలన (గవర్నెన్స్) ఉండేలా చూడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఉంది. కానీ వివాదాలున్న డైరెక్టర్ల నియామకాలను, ఆడిటర్ అభ్యంతరం చెప్పిన ఆర్థిక పత్రాలను ఆమోదించడం ద్వారా ఎల్‌ఐసీ తన విధిని తానే ఉల్లంఘిస్తోంది. బంధుత్వ లావాదేవీల విషయంలోనూ, తక్కువ హాజరున్న డైరెక్టర్ల విషయంలోనూ మద్దతివ్వడం అంటే ఆయా కంపెనీల్లో జరుగుతున్న తప్పుడు నిర్ణయాలకు, అవకతవకలకు ఎల్‌ఐసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. దీనివల్ల దీర్ఘకాలంలో ఆ కంపెనీలు ఆర్థికంగా పడిపోతే ఎల్‌ఐసీ పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడులు నష్టపోతాయి. ఆ నష్టం నేరుగా సామాన్యుల పాలసీ ఫండ్ల నుంచే వస్తుంది. ఇది కేవలం పెట్టుబడి సమస్య కాదు… కోట్ల మంది ప్రజల ఆస్తి భద్రతకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన అంశం.
పాలసీదారుడికి గండం…
ఎల్‌ఐసీ అనేది ప్రభుత్వ ఆస్తి కాదు. కోట్ల మంది పాలసీదారుల కష్టార్జితమైన ప్రీమియం డబ్బు. ఎల్‌ఐసీ తీసుకునే ప్రతి తప్పుడు పెట్టుబడి నిర్ణయం పాలసీదారుల రిటర్న్స్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. అత్యధిక రిస్క్ ఉన్న కంపెనీలకు నిర్లక్ష్యంగా మద్దతివ్వడం వల్ల పెట్టుబడి విలువ తగ్గితే చివరకు నష్టపోయేది పాలసీ తీసుకున్న సామాన్యులే. ఈ పక్షపాత వైఖరి వల్ల మార్కెట్ పారదర్శకత దెబ్బతింటుంది.
వెలుగులోకి రాని రాజకీయ కుట్ర!
గత మూడేళ్లుగా ఎల్‌ఐసీ అనుసరిస్తున్న ఈ ధోరణి వెనుక పెద్ద రాజకీయ ఒత్తిడి ఉందనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. లేదంటే ఒక ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ తన విధానాలను పక్కన పెట్టి రెండు ప్రైవేటు సంస్థలకు ఎందుకు ఇలా దాసోహం అవుతుంది? ఎల్‌ఐసీ తక్షణమే తన ఓటింగ్ విధానంపై పారదర్శకమైన వివరణ ఇవ్వాలి. లేదంటే సామాన్యుల డబ్బుతో ఈ సంస్థ జూదం ఆడుతుందనే అపవాదు తప్పదు. కోట్ల మంది ప్రజల జీవితకాల పొదుపుకు పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకొని ఎల్‌ఐసీని నిలదీయాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన ఎల్‌ఐసీ కేవలం కొన్ని కార్పొరేట్ శక్తుల దళారిగా మారుతుంది.