రక్తం చిందిన ‘కర్మ’ బంధం – నేను… తను… శూన్యం

  • ఒక భర్త నిస్సహాయ సేవ

కష్టమే శాశ్వతం… సమాజపు చిన్నచూపు
జీవితం అనేది అనేక అనుభవాల రైలు ప్రయాణం లాంటిది. సుఖం అనేది కంటికి కనిపించని అందమైన దేవతా వస్త్రం లాంటిది. అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ కాలం మనతో కొనసాగదు. కానీ కష్టం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతుంది. కొందరు కొన్ని సమయాల్లో ఆప్తులుగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ కష్టం వస్తే ఎవరూ దొరకరు. మాస్టర్‌ డిగ్రీ చదివి బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఏరికోరి కుడిచేయి లేని దివ్యాంగురాలిని నేను పెళ్లి చేసుకుంటే నన్ను కన్నతల్లి కూడా ఇష్టపడలేదు.

కారు మబ్బులు..‌‌. రక్తపు ధారలు
పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత సుజనకు ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆఫీసు డ్యూటీకి బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద కింద పడిపోయింది. నేను వెనక్కి చూస్తే రోడ్డుపై స్పృహ తప్పి పడి ఉంది. ఆమెలో చలనం లేదు. కుళాయి వదిలితే నీరు వచ్చినట్లుగా సుజన ముక్కు, చెవుల్లో నుంచి రక్తం ధారలుగా నాపైకి చిమ్మింది. క్షణాల్లో నా షర్ట్ మొత్తం ఎర్రగా తడిచిపోయింది.

అడుగంటిన మానవత్వం… ఆస్పత్రి తిరస్కరణ
రక్తం ఆగడం లేదు. ఏం చేయాలో తెలియక నా మైండ్‌ బ్లాక్‌ అయింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అప్పటిదాకా ఎండ కాసిన వాతావరణం… రక్తం చూసిన ఐదు నిమిషాలకే సన్నగా వర్షం మొదలవడం నాకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఐదు నిమిషాల తర్వాత అటువైపు వచ్చిన ఆటో డ్రైవర్‌ రాను అని చెప్పి వెళ్లిపోయాడు. మరొక ఆటో డ్రైవర్‌ను రూ.500 ఇస్తానని ఒప్పించి వర్షంలోనే సుజనను ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి ఎండీ డాక్టర్ నా షర్ట్‌పై ఉన్న రక్తం చూసి, ‘నేను ట్రీట్‌మెంట్ చేయను… ఆమె బతకద’ని చెప్పి వైద్యానికి తిరస్కరించాడు. దీంతో నగరంలో ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చేసరికి సాయంత్రం ఏడు అయింది. డాక్టర్లు బతకడం కష్టమని చెప్పారు.

మతి భ్రమ.‌.‌. ఒంటరి పోరాటం
యాక్సిడెంట్ అయి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు సుజన పూర్తిగా మతి కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడేది. ఒకరోజు కాలి నరం పట్టుకుని ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. కుడిచేయి సరిగా లేకపోవడం, ఎడమ చేయి పూర్తిగా విరిగిపోవడంతో నేను సుజన కాళ్లు పట్టుకుని సర్దిచెప్తున్నా. సరిగ్గా సూది వేసే ముందు కాలితో విసురుగా డాక్టర్లను, నన్ను తన్నేసి పెద్దపెద్దగా అరిచేది. 14 గంటలకు పైగా డాక్టర్ల చుట్టూ తిరిగి, సరిగా తినక నాకు కళ్లు తిరుగుతుండేవి. సుజన ప్రవర్తనతో డాక్టర్ వెళ్లిపోవడంతో నిస్సహాయంగా ఆమె బెడ్‌ పక్కనే కూర్చునేవాడిని.

‘యు ఆర్ రియల్లీ గ్రేట్’… కళ్లలో నీరు
ఎమర్జెన్సీలో నాలుగు రోజులుగా చెప్పుల్లేక తిరగడం వల్ల నా అరికాళ్లకు బొబ్బలు వచ్చి బాగా నొప్పిగా ఉంది. నాకేం చేయాలో తెలియక సుజన వంకే చూస్తుంటే నీరసం, నిస్సహాయత, బాధ కలగలిసి నా కళ్లవెంట నీరు వచ్చేది. మనిషి జీవితం అంతే… అంతా రంగుల వలయం అనుకుంటే, ఆ వలయం బ్లాక్‌హోల్ మాదిరిగా మనల్ని మింగేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ నర్సు నా కళ్లవెంట నీళ్లు చూసి చాలా జాలిగా ఒక మాట అంది. ‘యూ ఆర్‌ రియల్లీ గ్రేట్‌ హజ్బండ్‌ సర్‌…మీలాంటి హజ్బెండ్‌ చాలా రేర్‌గా ఉంటారు’ అని. ఆమె అన్న మాట విని ఇబ్బందిగా అనిపించి తల పక్కకు తిప్పి కళ్లు తుడుచుకున్నా.

నేను ఒక దుర్గం…
ఆరు నెలల తర్వాత సుజన కోలుకున్నా ఆమె వాసన చూడటం పూర్తిగా పోయింది. ఉన్న ఒక్క ఎడమచేయి కూడా విరిగి రాడ్డు వేయడం వల్ల అచేతనం అయింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి నడుం నొప్పి తీవ్రమై కదల్లేకపోయింది. డాక్టర్లు 8 గంటలు ఆపరేషన్ చేసి వెన్నెముకకు ప్లేట్ వేసి స్క్రూలు బిగించారు. ఆ ఎనిమిది గంటలు నేను ఆస్పత్రి బయట శూన్యంలోకి చూస్తున్నాను. అయినా నేను తనతో ఎప్పుడూ సరదా మాటలతో తనను నవ్విస్తూనే ఉన్నాను. ఎందుకంటే… నేనొక దుర్గం. ‘నేనొక శూన్యం… అందులో తనొక చిరుదివ్వె’ అంటున్న ఈ యువకుడి జీవితగాథ అంతులేని త్యాగం, అనుబంధానికి నిదర్శనం.

డాక్టర్ మొవ్వా వర్షిణి (అమ్మతో నాన్న ఆత్మీయ బంధానికి అక్షర రూపం)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *