విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

  • అలాగే హై-ఎండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై కూడా
  • జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయంపై చర్చ
  • పన్ను పెంచితే అలవాట్లు మానుకుంటారా?
  • మద్యం ఆదాయంపైనే ప్రభుత్వాలు ఆధారం
  • అధిక పనులతో ప్రభుత్వాలకి అధిక లాభం

సహనం వందే, న్యూఢిల్లీ:
పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఆరోగ్యానికి హానికరమని…
ప్రజల ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం భావించే ఈ ఉత్పత్తులను అధిక పన్నుల ద్వారా నియంత్రించవచ్చని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా పన్నుల రూపంలో వచ్చే అదనపు ఆదాయాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వినియోగించే అవకాశం ఉంది.

లగ్జరీ ఉత్పత్తులకూ ఇదే పరిస్థితి…
పాపపు వస్తువులతో పాటు లగ్జరీ ఉత్పత్తులైన ఖరీదైన కార్లు, డిజైనర్ దుస్తులు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లగ్జరీ హోటళ్ల సేవలపైనా 40 శాతం పన్ను విధించారు. ఈ ఉత్పత్తులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవని… కేవలం ధనిక వర్గాల ప్రజలు మాత్రమే కొనుగోలు చేస్తారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ఆదాయ అసమానతలను తగ్గించి సమాజంలో ఆర్థిక సమతుల్యతను తీసుకురావాలని భావిస్తోంది.

అలవాటున్న వారు తగ్గిస్తారా?
మద్యం, సిగరెట్టు, పాన్ మసాలా వంటివి ఒకసారి అలవాటైతే చాలామంది బానిసలుగా మారిపోతారు. మరి ముఖ్యంగా మద్యం యువతను పక్కదారి పట్టిస్తుంది. అనేకమంది యూత్ ఆల్కహాల్ తాగడాన్ని ఫ్యాషన్ గా భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆల్కహాల్ వినియోగాన్ని పెంచి ఆయాచితంగా ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది.పెద్ద ఎత్తున లిక్కర్ షాపులకు అనుమతులు ఇవ్వడం… గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండడం, వాటిని పరోక్షంగా ప్రభుత్వం ప్రోత్సహించడం తెలిసిందే.

అందువల్ల హానికర వస్తువుల పన్నులు పెంచడం వల్ల అది అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పన్నులు పెంచితే వాటి వినియోగాన్ని తగ్గిస్తారని అనుకోవటం పొరపాటని విశ్లేషిస్తున్నారు. వాటికోసం ఇతర ఖర్చులు తగ్గించుకుంటారే కానీ అలవాటును మాత్రం మార్చుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు. వీటి పన్ను పెంచడం వల్ల వినియోగదారులకు నష్టం… ప్రభుత్వాలకు పన్నుల రూపేణా లాభం జరుగుతుందని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *