- మహారాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం
- పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని స్పష్ఠీకరణ
- పవిత్ర జలాల్లో విగ్రహ నిమజ్జనం బంద్!
సహనం వందే, ముంబై:
గణపతి విగ్రహాల నిమజ్జనం కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని చారిత్రక పవిత్ర బంగంగా తలావ్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను కూడా బంగంగాలో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ప్రజల హక్కుల కంటే సమాజ శ్రేయస్సు, వారసత్వ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
పర్యావరణానికి పెద్దపీట…
బంగంగా తలావ్‌లో గణపతి విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ఇది చారిత్రక కట్టడం కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) ఆదేశాలను పిటిషనర్ సవాలు చేసినప్పటికీ, కోర్టు దాన్ని తిరస్కరించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే కాకుండా అన్ని రకాల విగ్రహాలనూ కృత్రిమ సరస్సుల్లో నిమజ్జనం చేయాలన్న నిబంధనలు సరైనవేనని కోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.
పిటిషన్‌కు సరైన ఆధారాలు లేవు…
పిటిషనర్ తన వాదనను నిరూపించుకోవడానికి తగిన ఆధారాలు చూపలేదని కోర్టు తెలిపింది. బంగంగా తలావ్‌లో విగ్రహాలను ఎప్పటినుంచి నిమజ్జనం చేస్తున్నారన్న దానిపై ఎలాంటి డేటాను సమర్పించలేదని కోర్టు ఎత్తి చూపింది. పిటిషనర్ అడిగిన దానిపై జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద తమకు తగిన కారణాలు లేవని, ఈ కేసులో వ్యక్తిగత హక్కుల కంటే సమాజం, చరిత్రకు సంబంధించిన అంశాలే ముఖ్యమని హైకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ, చారిత్రక వారసత్వం కోసం ఈ నియమాలు అత్యంత అవసరమని కోర్టు భావించింది.
మలుపు తిరిగిన సంప్రదాయం…
గిర్గామ్ చౌపట్టి వంటి ఇతర ప్రాంతాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలున్నప్పటికీ బంగంగా తలావ్‌లోనే నిమజ్జనం చేస్తామని పట్టుబట్టడం సరికాదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బిరేంద్ర సరాఫ్ కోర్టుకు తెలిపారు. సమీపంలో ఉన్న కృత్రిమ సరస్సుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున బంగంగానే ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పర్యావరణ నిబంధనలు, సంప్రదాయ ఆచారాల మధ్య ఒక కొత్త చర్చకు తెరతీసింది. భవిష్యత్తులో పండుగల సందర్భంగా ఇలాంటి నిర్ణయాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.