బెంగాలీ … బంగ్లాదేశ్ భాష’ – బెంగాల్ భగ్గు… సీఎం మమత ఆగ్రహం

  • విదేశీ భాష అంటూ ఢిల్లీ పోలీసుల హేళన
  • దేశంలో భాషా ఉద్యమాల సెగ
  • మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక ఉద్యమం
  • దక్షిణాదిలోనూ స్థానిక భాషా ఉద్యమాలు

సహనం వందే, కోల్‌కతా:
ఢిల్లీ పోలీసులు బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొనడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది భారత రాజ్యాంగాన్ని, బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడమేనని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొంటూ ఢిల్లీలోని బంగా భవన్‌కు లోధి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అసలేం జరిగింది?
ఢిల్లీలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు బంగా భవన్‌కు తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో, “బంగ్లాదేశ్ భాషలో రాసిన పత్రాల అనువాదం” అనే శీర్షిక ఉండటం వివాదానికి కారణమైంది. బెంగాలీ భాషను అవమానించినందుకు ఢిల్లీ పోలీసులపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. “రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానందల భాష, మన జాతీయ గీతం, జాతీయ గేయం రచించిన భాష, కోట్లాది మంది భారతీయులు మాట్లాడే భాష, భారత రాజ్యాంగం గుర్తించిన భాష అయిన బెంగాలీని బంగ్లాదేశ్ భాషగా పేర్కొనడం సిగ్గుచేటు” అని ఆమె ట్వీట్ చేశారు.

తృణమూల్ ఎంపీల విమర్శలు…
తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, మహువా మొయిత్రా కూడా ఈ ఘటనపై కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా విమర్శించారు. బంగ్లా సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అభిషేక్ ఆరోపించారు. ఇది ఒక పొరపాటు కాదని, బెంగాలీ భాషను అగౌరవపరచడానికి బీజేపీ చేసిన పథకం అని మహువా మొయిత్రా అన్నారు. దీనిపై వెంటనే ఢిల్లీ పోలీసులు క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

బెంగాలీ ప్రముఖుల మండిపాటు
ఈ వివాదంపై బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా స్పందించారు. “అది బంగ్లాదేశ్ భాష కాదు, అది బంగ్లా లేదా బెంగాలీ. జాతీయ గీతం అసలు భాష అదే, ఇది భారతదేశంలోని 22 అధికారిక భాషలలో ఒకటి” అని దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. “ఇదేంటి? బంగ్లా భారతదేశంలోని 22 అధికారిక భాషలలో ఒకటి కాదా? దానిని ఎందుకు బంగ్లాదేశ్ భాషగా పేర్కొనాలి? ఇది ఎంతటి అజ్ఞానమో, తెలివితక్కువ తనమో చూపిస్తుంది” అని గాయకుడు రూపమ్ ఇస్లాం అన్నారు. దేశంలో అనేక చోట్ల భాష ఉద్యమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో, దక్షిణాది రాష్ట్రాలలో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. మరీ ప్రత్యేకంగా మహారాష్ట్రలో హిందీ వ్యతిరేక… మరాఠీ అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బెంగాల్ లోనూ భాషా పరమైన ఉద్యమాలు మొదలయ్యాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *