- పేలుడులో 43 మంది మరణిస్తే పట్టింపేది?
- సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అండ
- నిందితులను అరెస్టు చేయడానికి వెనుకంజ
- బహుజనులు చనిపోతే పట్టించుకోని పెద్దలు
- తూతూ మంత్రంగా కేసు… కమిటీ ఏర్పాటు
- కెమికల్ ఫ్యాక్టరీలలో దారుణంగా వైఫల్యాలు
- అగ్నిమాపకశాఖ తనిఖీలపై అనుమానాలు
సహనం వందే, హైదరాబాద్:
కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపితే… కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్ తో యుద్ధమే చేసింది. అందుకు సహకరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోన పడేసింది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలంటే ఇలా చేయాల్సిందే. కానీ హైదరాబాదు శివారు పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏకంగా 43 మందికి పైగా

చనిపోవడం… దాదాపు అంతే సంఖ్యలో గల్లంతు కావడం జరిగింది. ఈ పేలుడుకు యాజమాన్యపు నిర్లక్ష్య వైఖరి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్న నిందితులను కనీసం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించలేదంటే ఏమనుకోవాలి? చిన్న చిన్న సంఘటనలకు అరెస్టులు చేయడం, జైల్లో పడేయడం చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద మారణకాండ జరిగినప్పుడు నిందితులను కనీసం అరెస్టు చేయలేదంటే ఏమనుకోవాలి? యాజమాన్యానికి రక్షణ కవచంగా మారుతున్నది ఎవరు? చనిపోయిన కార్మికులు దాదాపు బడుగు బలహీన వర్గాలకు చెందిన బహుజనులు కావడంతో వారి ప్రాణాలు అంటే పెద్దలకు చిన్న చూపా? పెద్దలను కాపాడుతున్న గద్దలు ఎవరు? వారిని ఎందుకు కాపాడుతున్నారు? వారికి రక్షణ కవచంగా ఎందుకు ఉంటున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తూతు మంత్రంగా కేసు…
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో గత నెల 30వ తేదీన జరిగిన పేలుడు, అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43కు చేరింది. ఇంకా కొందరి ఆచూకీ తెలియరాలేదని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై తూతూ మంత్రంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. పాత మిషనరీని వాడటం, కొత్త మిషనరీ కావాలని చెప్పినా వినిపించుకోకపోవడం వంటి కారణాలను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు టీవీ9 తెలుగు ఛానల్ https://tv9telugu.com/telanganaపేర్కొంది. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై సుమోటోగా కేసులను స్వీకరించాయి.
అరెస్టు చేయడానికి ఎందుకు వెనుకంజ
యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రమాదం జరిగిన 48 గంటల వరకు యాజమాన్యం స్పందించకపోవడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటి? 43 మంది బహుజనుల ప్రాణాలు అంటే ఎవరికీ లెక్క లేదా? పొట్టకూటి కోసం ఊరు వదిలి ఇక్కడికి వచ్చి పని చేస్తే దిక్కులేని అనాధలా మరణించారు. కొందరి శరీరాలు అగ్నిలో మండి ముద్దగా మారితే వాటిని తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అనాధలా అంత్యక్రియలు చేశారు. ఒక నాయకుడి కాలు జారి కింద పడితే అనేకమంది వెళ్లి పరామర్శిస్తారు. మాజీ ముఖ్యమంత్రికి జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళితే ఎక్కడలేని హడావుడి చేస్తారు. మరి 43 మంది బహుజనులు కాలి బూడిదై పోతే వారిని పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదంటే అంతగా అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి?
పరిహారంతో ప్రాణాలు వస్తాయా?
ఎక్కడైనా ప్రమాదం జరిగితే అత్యంత సాధారణంగా పరిహారం ప్రకటించడం చేతులు దులుపుకోవడం చాలా మామూలైంది. ఇదేదో నాయకులే తమ చేతి నుంచి ఇస్తున్నంత బిల్డప్ ఇస్తారు. వాళ్లు ఒక్క పైస కూడా పెట్టరు. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్… మృతుల కుటుంబాలకు

కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపింది. అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను కూడా చెల్లిస్తామని పేర్కొంది. ప్రమాదం తీవ్రత దృష్ట్యా ప్లాంట్‌లో కార్యకలాపాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీనివల్ల మరణించిన బహుజన కుటుంబాలకు న్యాయం జరిగిందని అనుకోవాలా? రాష్ట్ర అగ్నిమాపక శాఖ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యాజమాన్యం తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది.
ఉన్నతస్థాయిలో సిగాచి పలుకుబడి...
సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు రవీంద్రప్రసాద్ సిన్హా చైర్మన్ గా ఉన్నారు, చిదంబరనాథన్ షణ్ముగనాథన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ గా అమిత్ రాజ్ సిన్హా ఉన్నారు. డైరెక్టర్ల బోర్డులో సర్వేశ్వరరెడ్డి శనివరపు, ధనలక్ష్మి గుంటక, బిందు వినోదన్ కీలక వ్యక్తులు. వీరంతా ఎంతో పలుకుబడిన గలిగిన వాళ్ళు. ఈ కంపెనీ ప్రధానంగా మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ ను తయారు చేస్తుంది. రూ. 500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ కావడంతో దానిపై కన్నెత్తి చూడడానికి కూడా అధికారులు సాహసించరు. మారణహోమం జరిగిన తర్వాత యాజమాన్యం అనేకమంది పెద్దలకు కోట్లు కుమ్మరించినట్లు విమర్శలు వస్తున్నాయి.