సోషల్ మీడియా నెత్తుటి మడుగులో ‘అమ్మ’ -ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్..

  • తల్లి రక్తంతో తడుస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్
  • తల్లినే చంపమంటూ కూతురిని ఎగదోస్తుంది
  • బిడ్డను హత్య చేయమని తల్లికి చెపుతుంది
  • భార్య భర్తల మధ్య మర్డర్లకు దారితీస్తుంది
  • ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లతో హత్యలు
  • డబ్బులే పరమావధిగా సోషల్ ప్లాట్ ఫామ్స్
  • నియంత్రణ లేకపోవడంతో మానవజాతి చిత్తు
  • కొన్ని దేశాల్లో సోషల్ మీడియాపై కంట్రోల్
  • ప్రకంపనలు పుట్టిస్తున్న తల్లిని చంపిన కూతురు ఘటన

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ నగరం రక్తపు మరకలతో నిండిన ఓ దారుణ నేరానికి సాక్ష్యంగా నిలిచింది. కన్న కూతురే తల్లిని కడతేర్చిన ఘటన తెలుగునాట పెను సంచలనం సృష్టించింది. మానవ సంబంధాల పవిత్రతను ఛిన్నాభిన్నం చేస్తూ, సామాజిక మాధ్యమాలు విషపు కోరలు ఎలా పరుచుకుంటున్నాయో ఈ హత్య స్పష్టం చేసింది. ప్రేమ, అక్రమ సంబంధాలు, డిజిటల్ ప్రపంచపు మాయాజాలం మనుషుల నైతికతను ఎలా కాలరాస్తున్నాయో ఈ ఘోరం కళ్ళ ముందుంచింది. సమాజం ఎటు పయనిస్తోంది? ఈ నీచపు పోకడలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అందరినీ తొలుస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల నయవంచన…
హైదరాబాద్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఈ ఘాతుకం యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పదో తరగతి చదువుతున్న యువతి, తన తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చిందని పోలీసులు విస్మయకర విషయాలను వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ దారుణానికి ప్రేమ, అక్రమ సంబంధం, ఇన్‌స్టాగ్రామ్ దుష్ప్రభావమే కారణమని తేలింది. యువతి సామాజిక మాధ్యమాల ద్వారా ఓ మగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు, ఈ నీచపు బంధాన్ని తల్లి తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఆమెనే అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లికూతుళ్ల మధ్య ఉండే పవిత్ర బంధాన్ని ఈ అమానుష ఘటన పూర్తిగా నాశనం చేసింది. ఇలాంటి నేరాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? సామాజిక మాధ్యమాలు యువతను ఈ స్థాయిలో రాక్షసులుగా మారుస్తోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతటా చర్చకు దారితీశాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లు హత్యా కేంద్రాలుగా మారిపోయాయి.

చైనాలో 2 గంటలే యువతకు అనుమతి…
కొన్ని దేశాలు సోషల్ మీడియాపై కఠినమైన, పదునైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు పిల్లల విషయంలో… హింసాత్మక కంటెంట్, నగ్నత్వం, శృంగారం వంటి అంశాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. చైనాలో సామాజిక మాధ్యమాల వేదికలపై కఠిన నియంత్రణ ఉంది. వీచాట్, డౌయిన్, టిక్‌టాక్ వంటి యాప్‌లు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయి. పిల్లలు రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు సామాజిక మాధ్యమాల వాడకంపై నిషేధం ఉంది. రోజుకు ఒకట్రెండు గంటలు మాత్రమే వినియోగం అనుమతిస్తారు.

పేరెంట్స్ అనుమతితోనే ఖాతా…
యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం… 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. హింస, నగ్నత్వం, శృంగారం వంటి కంటెంట్‌ను తొలగించడానికి అల్గారిథమ్‌లు, మానవ పరిశీలనతో పనిచేస్తున్నారు.

ఆస్టేలియాలో 16 ఏళ్ల పిల్లలకు నిషేధం…
ఆస్ట్రేలియా 2024లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిషేధం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల కంపెనీలు హింసాత్మక కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో సామాజిక మాధ్యమాల కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ని పాటించాలి. కానీ స్పష్టమైన చట్టం లేకపోవడంతో ఇష్టారాజ్యమైంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *