ఏవీ ఇన్ఫ్రాకాన్ భారీ మోసం – రూ. 500 కోట్లు స్వాహా ….

  • రెట్టింపు డబ్బులు ఇస్తామని హామీ
  • సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు

సహనం వందే, హైదరాబాద్: బై బ్యాక్ పాలసీ పేరుతో భారీ పెట్టుబడులు ఆకర్షించి, రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ దందా వెలుగులోకి వచ్చింది. అనతి కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశచూపి, వందలాది మంది బాధితులను నిండా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్ కేంద్రంగా దందా‌‌…

ఏవీ ఇన్ఫ్రాకాన్ ఛైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్‌ను కేంద్రంగా చేసుకుని ఈ భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన సంస్థలో పెట్టుబడి పెడితే, 18 నెలల్లో 50% అదనంగా డబుల్ అమౌంట్ ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా వంటి ప్రాంతాల్లో తమకు వెంచర్లు ఉన్నాయని నమ్మబలికాడు. దుర్గం చెరువు సమీపంలోని ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం నుంచే ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగాయి.

మోసం తీరు..‌.
పెట్టుబడి పెట్టిన 18 నెలల తర్వాత డబ్బులు అడిగితే, విజయ్ గోగుల మరో ప్రాజెక్ట్ పేరు చెప్పి దాటవేసే ప్రయత్నం చేశాడు. బాధితులు ఒత్తిడి చేయగా, బ్లాంక్ చెక్కులు ఇచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. సుమారు 500 మందికి పైగా బాధితులు ఈ మోసానికి గురైనట్లు అంచనా. రాజు అనే వ్యక్తి ఏకంగా రూ. 84 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ గోగులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ భారీ మోసంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *