- తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మరణ హక్కు
- అసిస్టెడ్ డైయింగ్ పై ఇంగ్లాండ్ లో చట్టం
- వివిధ దేశాల్లో అనేక పద్ధతుల్లో అమలు
- స్విట్జర్లాండ్‌లో ఆత్మహత్య చట్టబద్ధం
- భారతదేశంలో దీనిపై పూర్తి వ్యతిరేకత
- అయితే ఇండియాలో ‘లైఫ్ సపోర్ట్ రిమూవ్’
సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ.
ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు...
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయక మరణం (అసిస్టెడ్ డైయింగ్) హక్కును కల్పించే కీలక బిల్లు ఇంగ్లాండ్, వేల్స్‌లో ముందడుగు వేయడం బ్రిటన్ సమాజంలో కొత్త చర్చకు తెరలేపింది. ‘టర్మినల్లీ ఇల్ అడల్ట్స్ (ఎండ్ ఆఫ్ లైఫ్) బిల్లు’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా చట్టం… హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో 23 ఓట్ల తేడాతో ఆమోదం పొందడం విశేషం. గత నవంబర్‌లోనే సూత్రప్రాయంగా ఆమోదం పొందిన ఈ బిల్లు, తాజాగా 314-291 ఓట్లతో కామన్స్‌లో తన ప్రారంభ దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఈ బిల్లు చట్టంగా మారాలంటే, ఇప్పుడు హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ) ఆమోదం పొందాలి. లార్డ్స్ సభ్యులు సూచించే ఏవైనా మార్పులను తిరిగి కామన్స్ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటరీ సెషన్ ముగిసినా లేదా బిల్లు వ్యతిరేకులు లార్డ్స్‌లో దానిని అడ్డుకునే మార్గం కనుగొన్నా ఈ చట్టం అమలులోకి రాకపోవచ్చు. ఈ బిల్లు చట్టంగా మారితే, దాని అమలుకు నాలుగు సంవత్సరాల వరకు పట్టవచ్చని అంచనా. అంటే, 2029 చివరి నాటికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చట్టబద్ధంగా సహాయక మరణాన్ని ఎంచుకోగలడు.
ఇండియాలో ‘లైఫ్ సపోర్ట్ రిమూవ్’
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సహాయక మరణాన్ని చట్టబద్ధం చేశాయి. అయితే అవి కఠినమైన నిబంధనలు, షరతులతో కూడుకుని ఉంటాయి. నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు 2002లో సహాయక మరణాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశాలు. కెనడాలో 2016 నుండి, ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాల్లో 2019 నుండి, స్పెయిన్‌లో 2021 నుండి ఈ చట్టాలు అమలులో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో సహాయక ఆత్మహత్య చట్టబద్ధం, కానీ యూతనేసియా (వైద్యుడు నేరుగా మందు ఇవ్వడం) నిషేధం. భారతదేశంలో సహాయక మరణం లేదా యూతనేసియా చట్టబద్ధం కాదు. అయితే 2018లో సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ‘పాసివ్ యూతనేసియా’ను (లైఫ్ సపోర్ట్ తొలగించడం) ‘లివింగ్ విల్’ ద్వారా అనుమతించింది. కానీ ‘యాక్టివ్ యూతనేసియా’ లేదా ‘సహాయక ఆత్మహత్య’ మాత్రం ఇంకా చట్టవిరుద్ధం. ఇంగ్లాండ్‌లో ఈ బిల్లు చట్టంగా మారితే, ఇది సమాజంలో కీలకమైన మార్పును తీసుకొస్తుంది.