సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు.
సమగ్ర అధ్యయనానికి ఆదేశం!
పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కూడిన ఈ కమిటీ, గో సంరక్షణకు సంబంధించిన అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించనుంది. ముఖ్యమంత్రి తన నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో గో సంరక్షణపై సమీక్షించారు.
ఆధునిక గోశాలల ఏర్పాటు…
భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, అయితే స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. కోడె మొక్కులు చెల్లించే దేవాలయాలైన వేములవాడ, యాదగిరిగుట్టతో పాటు, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో ఈ గోశాలలు నిర్మిస్తారు.
వేములవాడలో భారీ గోశాల...
ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వేములవాడలోని కోడె మొక్కులను ప్రస్తావిస్తూ, భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని ఆదేశించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా ఒక భారీ గోశాల ఏర్పాటు చేయాలని సూచించారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడదని స్పష్టం చేశారు.