- బాల్యంలోనే ఉగ్రవాద ఛాయలు
- 14 ఏళ్లల్లోనే ఉగ్రకుట్రల్లో భాగస్వామ్యం
- సంగీత కచేరీలు, షాపింగ్ సెంటర్లే టార్గెట్
- యూరప్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముప్పు
- ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు చేరిక
- జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియాల్లో అరెస్టులు
సహనం వందే, యూరప్:
యూరప్ ఖండం ఇప్పుడు అత్యంత భయానకమైన ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటోంది. ఊహించని విధంగా కేవలం 14 ఏళ్ల వయసున్న పిల్లలు సైతం ఉగ్ర దాడుల కుట్రల్లో పట్టుబడుతున్నారు. సంగీత కచేరీలు, షాపింగ్ మాల్స్, మతపరమైన ప్రార్థనా స్థలాలపై విధ్వంసం సృష్టించేందుకు పథకాలు రచిస్తున్న ఈ లేత వయసు ఉగ్రవాదులను గుర్తించడం భద్రతా దళాలకు పెను సవాలుగా మారుతోంది.
చిన్న వయసులోనే విషబీజాలు…
యూరప్ వ్యాప్తంగా ఉగ్రవాద దాడుల కుట్రల్లో చిన్నారులు, యువకులు నిమగ్నమవుతున్న సంఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న ఈ యువ ఉగ్రవాదులు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే సంగీత కచేరీలు, షాపింగ్ సెంటర్లు, చర్చిలు, మసీదులు వంటి ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఈ దాడుల్లో కొన్ని సాధారణ ఆయుధాలతో, మరికొన్ని శక్తివంతమైన పేలుడు పదార్థాలతో జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా వంటి దేశాల్లో ఇలాంటి యువకులను భద్రతా బలగాలు అరెస్టు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి భయంకరమైన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
సోషల్ మీడియా విషవలయం…
ఈ యువ ఉగ్రవాదులను గుర్తించడం భద్రతా అధికారులకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. సోషల్ మీడియా వేదికలు, వీడియో గేమ్స్, రహస్య చాట్ గ్రూప్‌లు వీరిని తీవ్రవాదులుగా మార్చేందుకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ వేదికలపై ఉగ్రవాద సంస్థలు యువతను ఆకర్షించేందుకు కళ్లు చెదిరే ప్రచార వీడియోలు, రెచ్చగొట్టే సందేశాలను విరివిగా వ్యాప్తి చేస్తున్నాయి. ‘సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంలోకి నెట్టడం ఇప్పుడు ఉగ్రవాద సంస్థలకు ఒక సులువైన మార్గంగా మారింది. తమ సమాజంలో అసంతృప్తిగా, ఒంటరిగా భావించే యువకులను వారు చాలా తేలికగా తమ వైపు తిప్పుకుంటున్నార’ని యూరోపియన్ యూనియన్ యాంటీ-టెర్రరిజం విభాగంలోని ఒక ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్‌లో ఉగ్రదాడుల ప్రత్యక్ష ప్రసారం…
జర్మనీలో 14 ఏళ్ల ఒక బాలుడు ఒక సినగాగ్‌పై దాడి చేసేందుకు అవసరమైన పేలుడు పదార్థాలను సేకరిస్తూ పోలీసులకు చిక్కాడు. మరో ఘటనలో ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల ఒక బాలిక ఒక సంగీత కచేరీపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతూ అరెస్టయింది. ఈ యువకులు తమ దాడులను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా పథకాలు రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇది ఉగ్రవాద సంస్థలు యువతను ఏ విధంగా తమ స్వార్థపూరిత ఎజెండా కోసం వాడుకుంటున్నాయో స్పష్టం చేస్తోంది.
సాధారణ విద్యార్థుల వలె సంచారం…
ఈ యువ ఉగ్రవాదులను ముందుగానే గుర్తించడం, వారి దుష్ట కుట్రలను భగ్నం చేయడం భద్రతా అధికారులకు ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ యువకులు చూడటానికి సాధారణ విద్యార్థుల్లాగే ఉంటారు. వారి కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు కూడా వారి తీవ్రవాద భావజాలం గురించి తరచుగా తెలియదు. ‘ఈ యువకులు తమ తీవ్రవాద ఆలోచనలను బయటపెట్టకుండా చాలా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారిని ముందుగానే గుర్తించడం చాలా కష్టం’ అని జర్మనీకి చెందిన ఒక సీనియర్ భద్రతా అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యువ ఉగ్రవాదం యూరప్ సమాజంలో భయం, ఒకరిపై ఒకరికి అపనమ్మకం అనే విషాన్ని నింపుతోంది. సాధారణ యువకులు కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందనే భయం ప్రజల్లో నెలకొంది.
తల్లిదండ్రుల్లో ఆందోళన…
‘మా పిల్లలు రోజూ పాఠశాలకు వెళ్తున్నారు. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. వారు ఎప్పుడు తీవ్రవాద భావజాలానికి బానిసలవుతారో అని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఒక భయంకరమైన విషయం’ అని నెదర్లాండ్స్‌కు చెందిన ఒక తల్లి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సంక్లిష్టమైన సమస్యను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ నాయకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.