‘కుల’రణగొణ

  • కులగణనపై అగ్రవర్ణాల గరంగరం
  • బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే ఎట్లా?
  • తమ భవిష్యత్తు ఏంటని అగ్రకులాల ఆవేదన
  • అంతవరకు సమస్య రాబోదని నేతల హామీ
  • రాజకీయ క్రీడలో బీసీల భవితవ్యం

దేశంలో కులగణన అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుల గణన చేపట్టడంపై అనేక అగ్రకులాల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కులగణన సక్రమంగా జరిగితే రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా తమకు నష్టం జరుగుతుందని అగ్రవర్ణాలు ఆందోళన చెందుతున్నాయి. వెనుకబడిన తరగతులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే, తమకు అవకాశాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కులగణన తర్వాత తమ జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలంటూ బహుజన ఉద్యమాలు ఊపందుకుంటాయని, ఇది కూడా తమకు నష్టమేనని వారు ఆందోళన చెందుతున్నారు. కులగణనను ఎలా అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

తెలంగాణలో బీసీలు తక్కువలో మతలబు…
బీహార్‌లో 63%, కర్ణాటకలో 70% వెనుకబడిన తరగతుల జనాభా ఉంటే, తెలంగాణలో మాత్రం 56% మాత్రమే వెనుకబడిన తరగతులు ఉన్నారని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించిన కుల గణన సర్వేలో వెల్లడైంది. ఈ వ్యత్యాసానికి కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. తెలంగాణలో కులగణనలో తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యత్యాసంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని బహుజన్ రిపబ్లిక్ పార్టీ (బీఆర్పీ) డిమాండ్ చేస్తుంది.

కులగణన లక్ష్యాలు… రాజకీయ ప్రేరణలు
దేశ ప్రజల కులాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడుతోంది. దీని ద్వారా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, వనరుల పంపిణీకి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. రిజర్వేషన్లను పునర్మూల్యాంకనం చేయడం, బలహీన వర్గాలకు న్యాయం కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. బీహార్, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉన్నందున సామాజిక న్యాయానికి హామీ ఇస్తున్నట్లు చూపించాలనుకుంటోంది. బహుజన వర్గాల మద్దతు పొందడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో కులగణన… ప్రస్తుత సవాళ్లు
బ్రిటిష్ ప్రభుత్వం 1881లో మొదలుపెట్టిన జనగణనలో 1931 వరకు కులాలను నమోదు చేసింది. ఆ సందర్భంగా దేశంలో దాదాపు 4,147 కులాలు ఉన్నట్లు గుర్తించారు. గత తొమ్మిది దశాబ్దాలలో ఈ సంఖ్య, వివిధ కులాల జనాభాలో గణనీయమైన మార్పులు సంభవించి ఉండవచ్చని అంచనా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కేవలం షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) గణన మాత్రమే కొనసాగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కుల గణనలో వాస్తవికంగా కులాలను నమోదు చేయలేకపోయారు. కులాల సంఖ్య అధికంగా ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల అది ముందుకు పడలేదు.

ఒకే కులం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా…
కుల గణన ప్రక్రియలో అనేక క్లిష్టమైన సవాళ్లు ఎదురుకానున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్న వేలాది కులాల పేర్లు, వాటిని సరైన విధంగా వర్గీకరించడం ఒక పెద్ద సమస్యగా మారనుంది. ఉదాహరణకు ఒకే కులం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఒక నిర్దిష్ట కులం వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో ఉంటే, మరొక రాష్ట్రంలో అది షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా ఇతర వర్గాలలో ఉండవచ్చు. ఈ రకమైన అస్పష్టత డేటా సేకరణ సమయంలో తీవ్రమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. తప్పుల దొర్లే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది.

ఈ గణన ద్వారా అందే సమాచారం…
ఈ గణన ద్వారా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, వనరుల పంపిణీకి ఆధారంగా పని చేసే గణాంకాలు లభిస్తాయి. రిజర్వేషన్లను పునర్మూల్యాంకనం చేయడం, బలహీన వర్గాలకు న్యాయం కల్పించడం వంటి విషయాల్లో ఇది కీలకంగా మారుతుంది. ఉదాహరణకు 1931 గణనలో దేశ జనాభాలో 52% మంది సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించారు. దాని ఆధారంగా మండల్ కమిషన్ 27% రిజర్వేషన్లు సూచించింది.

50 శాతం అడ్డు తొలగిస్తేనే..‌.!
రిజర్వేషన్ల పెంపునకు ప్రధానమైన అడ్డు 50 శాతం పరిమితిని ఎత్తివేయడం, బీసీ జనాభాకు అనుగుణంగా ఆయా వర్గాలకు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ రెండు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకొని అమలు చేయకపోతే కులగణనతో వచ్చే ప్రయోజనం శూన్యం. అందుకే అగ్రకుల పార్టీలు అంత ధీమాగా కులగణన చేయాలని, తద్వారా వెనుకబడిన వర్గాల ఓటును తమ వైపు తిప్పుకోవాలని ఆరాటపడుతున్నాయి. ‘కులగణన చేయగానే ఒరిగేది ఏమీ లేదు. రిజర్వేషన్ల పరిమితి ఉన్నంతకాలం… చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించనంత కాలం మనకు వచ్చే నష్టం ఏమీ లేద’ని అగ్రకుల పార్టీలు తమ కుల పెద్దలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. అంటే బీసీలు కేవలం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతారన్నమాట.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *