- చిరంజీవిపై అల్లు అర్జున్ ప్రశంసలు
- వేవ్స్ సమ్మిట్‌లో బన్నీ బ్లాక్‌బస్టర్ స్పీచ్
సహనం వందే, ముంబై:
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన మెగా ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు. ‘మామయ్య చిరంజీవి నా సినిమా జర్నీలో ఎప్పుడూ మెగా ఇన్‌స్పిరేషన్. ఆయన నటన, సినిమా పట్ల అంకితభావం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాన’ని బన్నీ ఎమోషనల్‌గా చెప్పాడు. చిరంజీవి నటనలోని వైవిధ్యం, యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ నుండి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు.
బన్నీ పర్ఫెక్షనిజం రివీల్
పుష్ప-2 సినిమా గతేడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. వేవ్స్ సమ్మిట్‌లో బన్నీ… పుష్ప-2 షూటింగ్ అనుభవాలను వివరించాడు. ‘పుష్ప-2లో దుప్పటి ఎగిరే సీన్ కోసం 17-18 షాట్స్ తీశాం. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4.30 వరకు షూటింగ్ చేశాం. అభిమానులకు థ్రిల్లింగ్ ఇవ్వాలనేదే నా లక్ష్యమ’ని అల్లు అర్జున్ చెప్పాడు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి కూడా బన్నీ మాట్లాడాడు. ‘పుష్ప-2 షూటింగ్‌లో నా భుజానికి గాయమైంది. డాక్టర్ ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అప్పుడే నాకు వయసు పెరిగిందని అర్థమైంద’ని ఆయన హాస్యంగా చెప్పాడు. పుష్ప-2 విజయం తనను మరింత బాధ్యతాయుతంగా మార్చిందన్నారు.
అట్లీతో భారీ ప్రాజెక్ట్...
అల్లు అర్జున్ తన 22వ సినిమా గురించి వేవ్స్ సమ్మిట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంచలన దర్శకుడు. బన్నీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ‘ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుంది. విజువల్ ప్రెజెంటేషన్‌లో ఎలాంటి రాజీ ఉండద’ని బన్నీ హామీ ఇచ్చాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని సమాచారం. అట్లీ గతంలో షారుఖ్ ఖాన్‌తో జవాన్, విజయ్‌తో తెరి, మెర్సల్ లాంటి హిట్స్ అందించాడు. బన్నీ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో అట్లీ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.