- అవినీతిపై పోరాడిన ఐఏఎస్ యోధుడు
- హరియాణా కేడర్ నుంచి పదవీ విరమణ
- ఉన్నత అధికారులకు అశోక్ ఖేమ్కా ఆదర్శం
- రాబర్ట్ వాద్రా భూ కుంభకోణంతో ఫేమస్…
సహనం వందే, హరియాణా:
హర్యానా కేడర్‌లో తిరుగులేని ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ బుధవారం పదవి విరమణ చేశారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏకంగా 57 సార్లు బదిలీ అయిన ఆయన… అవినీతిపై నిక్కచ్చిగా పోరాడిన యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కా హరియాణా ఎన్నో కీలక పదవులు నిర్వహించినా, ఎక్కడ అవినీతి కనిపించినా నిలదీసే తత్వం ఆయనది. ఈ కారణంగానే అధికారులు, రాజకీయ నాయకుల నుంచి ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆయన కెరీర్‌లో 57 సార్లు బదిలీ కావడం ఆయన పోరాటానికి నిదర్శనం.
రాబర్ట్ వాద్రా భూ కుంభకోణంతో ఫేమస్…
ముఖ్యంగా 2012లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు ఖేమ్కా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆయన చూపిన తెగువ, నిజాయతీ ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. “నేను ఎల్లప్పుడూ నిజాయితీగా నా విధులు నిర్వర్తించాను. అవినీతిపై నా పోరాటం ఎప్పటికీ ఆగదు” అని అశోక్ ఖేమ్కా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ బదిలీలను ఆయన “సేవలో ఒక భాగంగా” భావించినప్పటికీ, ఒక ఐఏఎస్ అధికారి ఇన్నిసార్లు బదిలీ కావడం అరుదైన విషయం.
రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవకే అంకితం!
హరియాణా స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఖేమ్కా, పదవీ విరమణ తర్వాత కూడా సామాజిక సేవలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన నిజాయితీని కొనియాడుతూ ఎందరో పోస్టులు పెడుతున్నారు. “అశోక్ ఖేమ్కా లాంటి నిజాయితీపరులైన అధికారులు దేశానికి స్ఫూర్తి” అని ఒక నెటిజన్ ఎక్స్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్‌తో ఒక నిఖార్సయిన శకం ముగిసిందని అధికారులు భావిస్తున్నారు. ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన అభిమానులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.