- భారత సైనిక నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్‌లో పోస్ట్
- భారత్ పై పాకిస్తాన్ హ్యాకర్ల డిజిటల్ దాడి…
- ‘మీ మతం మిమ్మల్ని కాపాడలేదని’ హెచ్చరిక
సహనం వందే, ఢిల్లీ:
‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఇది కేవలం ఒక హ్యాకింగ్ దాడిగా కొట్టిపారేయడానికి లేదు. ఇది సైబర్ యుద్ధానికి తెరలేపుతున్న సంకేతం కావచ్చు. పాకిస్తాన్ మూలాలున్న హ్యాకర్ల పనే ఇది అని తెలుస్తుండటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది.
డిజిటల్ కోటలు బద్దలు…
సైనిక నర్సింగ్ కళాశాల వంటి కీలకమైన సంస్థల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, ఇలాంటి రెచ్చగొట్టే సందేశాలు పెట్టడం మన సైబర్ భద్రతా వ్యవస్థ యొక్క బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది. శత్రువులు ఇంత సులభంగా మన డిజిటల్ సరిహద్దులు దాటి రాగలిగారంటే, ఎక్కడో పెద్ద వైఫల్యం జరిగిందని స్పష్టమవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉగ్రవాదులకు మరింత ఊతం ఇచ్చాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సైబర్ దాడి కూడా ఆ విద్వేషపూరిత ప్రచారం కొనసాగింపా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదులనే కాకుండా, సైబర్ నేరగాళ్లను కూడా ప్రోత్సహిస్తోందా?