- ట్రంప్ విధానాలతో అంతర్జాతీయ కుదుపు
- దీంతో వివిధ దేశాల్లో లెఫ్ట్ పునరుజ్జీవనం
- ఆస్ట్రేలియా, కెనడా, యూకే దేశాల్లో ఊపు
- లెఫ్ట్ కు ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలు
- ప్రముఖ పత్రిక ‘వాల్ స్ట్రీట్ జనరల్’ వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న అనూహ్య నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన విధానాలు… వివిధ దేశాలపై సుంకాల విధింపుతో బలహీనపడిన లెఫ్ట్ రాజకీయ పార్టీలకు కొత్త ఊపిరినిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల్లో వామపక్ష పార్టీలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సర్వేలు కూడా ఈ దేశాల్లో లెఫ్ట్ పార్టీల ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడిస్తున్నాయని ప్రముఖ అమెరికా పత్రిక ‘వాల్ స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పత్రిక ప్రత్యేక ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
మిత్రులపై కొరడా… రష్యాతో స్నేహం!
ట్రంప్ తన రెండో పాలనలో రష్యాతో సఖ్యత పెంచుకుంటూనే, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలపై కూడా భారీ దిగుమతి సుంకాలు విధించారు. అంతేకాకుండా చైనాతో మళ్లీ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచ వాణిజ్య వ్యవస్థను అస్థిరపరిచారు. ఈ చర్యలు అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులకు దారితీశాయి.
ట్రంప్ విధానాలతో వామపక్షాలకు ఊపిరి…
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్ రాజకీయ పార్టీలకు ఊతమిచ్చాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో గత కొంతకాలంగా వెనుకబడిన లెఫ్ట్ నాయకులు, ట్రంప్ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో మళ్లీ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ విధానాల వల్ల సామాన్యుల జీవనోపాధిపై పడిన ప్రభావం, ధరల పెరుగుదల, ఆర్థిక భద్రత లేకపోవడం వంటి అంశాలు లెఫ్ట్‌కు అనుకూలంగా మారాయి.
ట్రంప్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలు!
ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు, చైనాతో మళ్లీ మొదలైన వాణిజ్య పోరు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కలవరపెట్టాయి. ప్రపంచంలోని ప్రధాన షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి, లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. దీంతో ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతోంది. చైనా, అమెరికా ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకోవడంతో ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింది, అనేక దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులను లెఫ్ట్ పార్టీలు ట్రంప్‌ను విమర్శించడానికి ఒక అవకాశంగా మలుచుకున్నాయి.
ప్రపంచ రాజకీయాల్లో ‘టర్నింగ్ పాయింట్’…
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కేవలం ఆర్థిక వ్యవస్థనే కాకుండా అంతర్జాతీయ సంబంధాలను కూడా మార్చేస్తున్నాయి. రష్యాతో స్నేహం పెంచుకోవడం, మిత్రదేశాలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిని లెఫ్ట్ నాయకులు తమ ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంచి అవకాశం కల్పించింది. ఉదాహరణకు కెనడాలోని లిబరల్ పార్టీ, యూకేలోని లేబర్ పార్టీ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ తమ ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటున్నాయి.